హోటల్‌ ఫుడ్‌.. రోగం ఫ్రీ | - | Sakshi
Sakshi News home page

హోటల్‌ ఫుడ్‌.. రోగం ఫ్రీ

Published Sat, Apr 19 2025 12:23 AM | Last Updated on Sat, Apr 19 2025 12:23 AM

హోటల్‌ ఫుడ్‌.. రోగం ఫ్రీ

హోటల్‌ ఫుడ్‌.. రోగం ఫ్రీ

ఘుమఘుమలాడే వాసన, ఆకర్షించే రంగులతో వండి వార్చిన చికెన్‌, మటన్‌, చేపలు కనిపిస్తే చాలు లొట్టలేసుకుంటూ తింటాం. బిర్యానీ ప్రేమికులు ఇంకాస్త ఎక్కువ. హోటల్‌లో తిన్న పాపానికి హాస్పిటల్‌కి వెళ్లాల్సి వస్తోంది. హోటల్‌ బిల్లు ఒక షాక్‌ అయితే, ఆస్పత్రి బిల్లు ఇంకో షాక్‌. హోటళ్లలో వాడుతున్న నాసిరకం ఆహార పదార్థాల ముడిసరుకులు, అపరిశుభ్రత వాతావరణం, మంచి నీళ్లు వాడకపోవడం, ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన పదార్థాలు వండడం వంటి కారణాలతో ఫుడ్‌ పాయిజినింగ్‌ కేసులు తీవ్రమవుతున్నాయి.

నెల్లూరు (బారకాసు): జిల్లాలో పెద్ద హోటళ్లు వందకు పైగా ఉన్నాయి. చిన్న చిన్నవి మరో 200కు పైనే ఉంటాయి. వీధుల్లో అమ్ముతున్న ఆహార బండ్లకు లెక్కేలేదు. ఇక్కడ వాడే నూనెలు, కూరల్లో వేసే రంగులు అత్యంత ప్రమాదకరంగా ఉన్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. ప్రధానంగా మాంసం, చికెన్‌, చేపలు, రొయ్యలు వంటి పదార్థాలు నాలుగైదు రోజులైనా నిల్వ ఉంచి వినియోగదారులకు పెడుతున్నారు. హోటల్‌ ఫుడ్‌ తింటే.. రోగం ఫ్రీ అన్నట్లుగా పరిస్థితి ఉంది. చాలా హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లకు లైసెన్స్‌లు లేకపోవడం గమనార్హం.

కేసులు, జరిమానాలు.. అయినా మార్పేది?

జిల్లాలోని నాణ్యత లేని ఆహార పదార్థాలను విక్రయిస్తున్న హోటల్స్‌పై ఇటీవల ఫుడ్‌సేఫ్టీ అధికారులు దాడులు చేసి వ్యాపారస్తులపై కేసులు నమోదు చేశారు. అందులో నగరంలోని ఓ హోటల్లో తయారీ, ఎక్స్‌పైరీ తేదీలు లేకుండా వినియోగదారుడికి ఐస్‌క్రీం అందిస్తున్నట్లు గుర్తించి రూ.10 వేలు జరిమానా విధించారు. ఆత్మకూరులో ఓ రెస్టారెంట్‌లోని వంట గదిలో ఏ విధమైన తయారీ, ఎక్స్‌పైరీ తేదీలు లేని నూడిల్స్‌ విక్రయిస్తుండగా రూ.10 వేలు, పలు రకాలైన బ్రాండ్లతో గోళీసోడాలు తయారు చేస్తూ ఏ విధమైన తేదీలు, బ్యాచ్‌ నంబర్లు లేకుండా ప్రజలకు విక్రయిస్తున్న నాలుగు గోలీసోడా యూనిట్ల యజమానులకు ఒక్కొక్కరికి రూ.10 వేలు, నగరంలోని మాగుంటలే అవుట్‌లో కాంఫెక్టనరీ షాపులో సబ్‌స్టాండర్డ్‌ కోకోనట్‌ మిల్క్‌ ను విక్రయిస్తున్నందుకు రూ.25 వేలు, స్టోన్‌హౌస్‌పేటలో నాణ్యతలేని సబ్‌ స్టాండర్డ్‌ కారంపొడి విక్రయిస్తున్న షాపు యజమాని, తయారీదారుడికి రూ.10 వేలు, వంట నూనె లూజుగా విక్రయిస్తున్న 3 షాపుల యజమానులకు ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున జరిమానా విధించారు.

12 శాంపిళ్లు అనారోగ్యంగా గుర్తింపు

గడిచిన ఏడాదిలో జిల్లా వ్యాప్తంగా ఫుడ్‌ సేఫ్టీ అధికారులు పలు హోటల్స్‌లో తనిఖీ చేపట్టి మొత్తం 290 శాంపిల్స్‌ను సేకరించారు. వీటిని ల్యాబ్‌కు పంపించగా 12 శాంపిల్స్‌ ఆరోగ్యానికి హానికరమని, అలాగే 22 నాణ్యత లేని ఆహారంగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఏ హోటల్లో అయితే గడువు ముగిసిన, నిల్వ ఉంచిన ఆహారా పదార్థాలను అధికారుల తమ పరిశీలనలో గుర్తించారో అటువంటి హోటల్స్‌పై మొత్తం 15 క్రిమినల్‌ కేసులు నమోదు చేయడంతో పాటు రూ.1.45 లక్షలు జరిమానా విధించారు.

నాణ్యత లేని, నిల్వ పదార్థాలతో

ఆహారాలు తయారీ

పదే పదే నూనెలు మరిగిస్తూ

ఆరోగ్యంతో చెలగాటం

కంపు కొడుతున్న కిచెన్‌లు..

ఫుడ్‌ పాయిజనింగ్‌తో బెంబేలు

ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నా మార్పేదీ?

290 శాంపిళ్లు టెస్ట్‌ చేయగా

12 శాంపిళ్లు హానికరమని వెల్లడి

నగరంలోని ఆత్మకూరు బస్టాండ్‌ సమీపంలో ఓ చిన్న రెస్టారెంట్‌కు లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఇటీవల కుటుంబంతో కలిసి వెళ్లి భోజనం చేశారు. ఇంటికొచ్చిన గంటన్నరకే కడుపులో వికారం. కొద్ది సేపటికే వాంతులు, విరేచనాలు. దీంతో ఆస్పత్రికి పరుగు తీయగా, ఫుడ్‌ పాయిజనింగ్‌ అని డాక్టర్‌ తేల్చి చెప్పారు.

నగరానికి చెందిన మురళి కావలిలోని మెయిన్‌రోడ్డులో ఉన్న ఓ నాన్‌వెజ్‌ రెస్టారెంట్‌కు వెళ్లాడు. చికెన్‌ తిన్న అతనికి నాలుగు గంటల తర్వాత తీవ్ర కడుపు నొప్పి వచ్చింది. వెంటనే నెల్లూరులోని పొగతోటలో ఉన్న ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వచ్చి చికిత్స చేయించుకంటే కానీ పరిస్థితి కుదుట పడలేదు.

ఇటీవల ఓ వ్యక్తి అల్పాహారం తినేందుకు నగరంలోని ప్రముఖ హోటల్‌కు వెళ్లి ఇడ్లీ ఆర్డర్‌ చేశాడు. ఆ ప్లేటులో బొద్దింక ఉండడాన్ని కస్టమర్‌ గుర్తించి సర్వ్‌ చేసిన వ్యక్తితోపాటు హోటల్‌ నిర్వాహకుడిని ప్రశ్నించినా పట్టించుకోకపోవడంతో అతను ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement