
నరకం చూపిస్తున్న రైల్వే గేట్లు
నెల్లూరు సిటీ: నెల్లూరు నగరం నడిబొడ్డు మీదుగా సాగే రైల్వే లైన్ ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపిస్తోంది. ఈ లైన్ నగరాన్ని రెండుగా చీల్చేసింది. అటూ, ఇటూ రాకపోకలు సాగించాలంటే రైల్వే ట్రాక్ అడ్డంగా ఉండడంతో పెన్నానది నుంచి అయ్యప్పగుడి రోడ్డు వరకు ఆరు లెవెల్ క్రాసింగ్ రైల్వే గేట్లు ఉన్నాయి. ఇందులో అయ్యప్పగుడి రోడ్డులో ఉన్న ఎల్‌సీ గేటు ప్రాంతంలో ఫ్లై ఓవర్ నిర్మాణంతో ఆ ప్రాంత ప్రజలకు ఇక్కట్లు తప్పాయి. పెన్నానది చెక్‌పోస్టు, రంగనాయకులపేట , విజయమహల్, కొండాయపాళెం, కరెంట్ ఆఫీసు సెంటర్లలో ప్రస్తుతం ఐదు లెవల్ క్రాసింగ్ రైల్వే గేట్లు ఉన్నాయి. అయితే ప్రధానమైన విజయమహల్ గేటును ఎలాంటి మరమ్మతులు లేకపోయినప్పటికీ చాలా కాలంగా తీయడం లేదు. ఇక్కడ బాక్స్‌టైప్ బ్రిడ్జి ఉండడంతో ఈ గేట్ తీయకపోవడంతో ప్రతి నిత్యం ట్రాఫిక్‌కు గంటల కొద్ది అంతరాయం ఏర్పడుతోంది. రైల్వే ఎల్‌సీ గేటు నిర్వహణకు సిబ్బంది ఉన్నప్పటికీ బాక్స్‌టైప్ బ్రిడ్జి ఉందనే నెపంతో అసలు తెరవడం లేదని వాహన చోదకులు మండిపడుతున్నారు. ఇక్కడి గేట్ మన్లకు ఉత్తిగా జీతాలు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక పెన్నానదికి సమీపంలోని చెక్‌పోస్టు రైల్వేగేటు వద్ద బాక్స్‌టైప్ అండర్ బ్రిడ్జి పనుల పేరుతో దాదాపు రెండేళ్లుగా నిలిపివేశారు. ఇక్కడ పనులు నత్తనడకన సాగుతున్నాయి. అటు వైపు వెళ్లే వాహనదారులు రంగనాయకులపేట రైల్వేగేటు వైపు, ఆత్మకూరు బస్టాండు వైపు నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొండాయపాళెం గేటు వద్ద ట్రాక్ మరమ్మతుల పేరుతో రోజుల తరబడి మూసివేశారు. ఈ విషయాలు తెలియక అటు వైపు వెళ్లిన వాహనచోదకులు ఉసూరుమంటూ మరో మార్గం వైపు తిరిగి వెళ్లిపోతున్నారు. కొండాయపాళెం గేటు వద్ద ఒకటీ.. రెండు రోజుల్లో చేసే పనిని ఉద్దేశపూర్వకంగా రోజుల తరబడి నిలిపివేయడం, ఎలాంటి మరమ్మతులు లేకపోయిప్పటికీ విజయమహల్‌గేటును నెలల తరబడి మూతవేయడంతో నగర ప్రజలు ప్రతి నిత్యం నరకాన్ని చవిచూస్తున్నారు.
● నగరంలో మూడు గేట్లు మూత
● వాహనదారులకు తప్పని తిప్పలు

నరకం చూపిస్తున్న రైల్వే గేట్లు

నరకం చూపిస్తున్న రైల్వే గేట్లు