ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా రాజేశ్వరి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా రాజేశ్వరి

Published Mon, Apr 28 2025 12:00 AM | Last Updated on Mon, Apr 28 2025 12:00 AM

ప్రభుత్వ మెడికల్‌  కళాశాల ప్రిన్సిపల్‌గా రాజేశ్వరి

ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా రాజేశ్వరి

నెల్లూరు (అర్బన్‌): దర్గామిట్టలోని ఏసీఎస్‌ఆర్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాల నూతన ప్రిన్సిపల్‌గా డాక్టర్‌ జి.రాజేశ్వరిని ప్రభుత్వం నియమించింది. ఆమె ఇప్పటి వరకు రాజమహేంద్రవరం మెడికల్‌ కళాశాలలో బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఆమెను పదోన్నతిపై ఇక్కడికి బదిలీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రాజమన్నార్‌ ఈ నెలాఖరున రిటైర్‌ కాబోతున్నారు. దీంతో ప్రభుత్వం ఆమెను ఇక్కడ నియమించింది.

పేదరికం లేని

సమాజానికి కృషి

కలెక్టర్‌ ఆనంద్‌

నెల్లూరు రూరల్‌: పేదరికం లేని సమాజం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన మార్గదర్శి బంగారు కుటుంబం పథకంలో స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కలెక్టర్‌ ఆనంద్‌ అన్నారు. ఆదివారం ఆయన వివిధ శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ దాదాపు ఒక లక్ష కుటుంబాలు పీ4లో సహాయం అవసరం ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు, ధనికులు, సేవాభావం కలిగిన వారు ఈ పథకంలో స్వచ్ఛందంగా భాగస్వాములు కావచ్చునని కలెక్టర్‌ వివరించారు. జిల్లాలో ప్రతిశాఖ కనీసం 10 మందిని మార్గదర్శి బంగారు కుటుంబం పథకంలో పేదవారికి సహకారం అందించే విధంగా భాగస్వాములయ్యేటట్లు అవగాహన కల్పించాలన్నారు. ఎవరిని బలవంతంగా ఈ పథకంలో చేర్చవద్దని, ఇది కేవలం స్వచ్ఛంద పథకమేనని తెలిపారు. పేదరికం నుంచి బయటకు తీసుకురావడానికి ఆ కుటుంబాలను దత్తత తీసుకోవడం, వారికి మార్గదర్శకులుగా ఆర్థిక సహకారం అందించడం, సంపద, ఆరోగ్యం సృష్టించడం ద్వారా సంతోష ఆంధ్రప్రదేశ్‌ చేయాలన్నారు.

వైఎస్సార్‌సీపీ

మైనార్టీ నేత అరెస్ట్‌

ఆత్మకూరు: వైఎస్సార్‌సీపీ మైనార్టీ నేత అరెస్ట్‌తో కూటమి అరాచకం పరాకాష్టకు చేరింది. శనివారం రాత్రి పిచ్చాపాటి కబుర్లల్లో కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశాడని ఆదివారం ఉదయమే అరెస్ట్‌ చేసి అత్యవసరంగా కోర్టుకు హాజరుపరిచారు. పట్టణంలోని దర్గా సెంటర్‌ వద్ద వైఎస్సార్‌సీపీ మైనార్టీ నేత షేక్‌ రహీం త్వరలో ఏర్పాటు కానున్న దర్గా కమిటీపై శనివారం రాత్రి పిచ్చాపాటిగా కొన్ని వ్యాఖ్యానా లు చేశారు. అయితే దాన్ని కొందరు వీడియోలో చిత్రీకరించి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీఐ జి గంగాధర్‌, ఎస్సై ఎస్‌కే జిలానీ హడావుడిగా రంగంలోకి దిగి ఆదివారం ఉదయం రహీంను అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచగా, అతనికి 14 రోజుల రిమాండ్‌ విధించారు. విషయం తెలుసుకున్న పట్టణ ప్రజలు చిన్నపాటి వ్యాఖ్యానాలను పరిగణనలోకి తీసుకుని, కక్ష సాధింపు చర్యలకు కూటమి ప్రభుత్వం పాల్పడుతుందని మండి పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాక్‌ స్వాతంత్య్ర హక్కు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ అధినేతను, నాయకులను అసభ్యకరంగా దూషించినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఆడిటర్‌ ఆత్మహత్య

నెల్లూరు (క్రైమ్‌): ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆడిటర్‌ మృతి చెందాడు. పోలీసుల సమాచారం మేరకు.. వనంతోపు మూడో వీధిలో ఆడిటర్‌ గిరిబాబు (40), భవాని దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు సంతానం. ఆయన శనివారం రాత్రి కుటుంబంతో కలిసి కొద్దిసేపు గడిపారు. అనంతరం పడక గదిలోకి వెళ్లి ఉరేసుకున్నాడు. గమనించిన భార్య గిరిబాబును హుటాహుటిన మాగుంట లేఅవుట్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మృతి చెందారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న వేదాయపాళెం ఎస్‌ఐ విజయకుమార్‌ హాస్పిటల్‌కు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, జీజీహెచ్‌ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. మృతుడి సోదరుడు సుబ్బారెడ్డి ఫిర్యాదు మేరకు ఆదివారం ఎస్‌ఐ కేసు నమోదు చేశారు. అనారోగ్య కారణాల నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడు సూసైడ్‌ లేఖ రాసినట్లు తెలిసింది. ఎస్‌ఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement