
కామాక్షమ్మా.. క్షమించమ్మా
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పవిత్ర పినాకినీ తీరంలో వెలసిన జొన్నవాడ కామాక్షితాయి అమ్మవారి దర్శనం భక్తులకు దుర్లభంగా మారుతోంది. సామాన్య భక్తులకే ప్రాధాన్యమిస్తున్నామని చెప్పే దేవదాయ శాఖ అధికారులు, పాలకమండలి సభ్యులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ డబ్బున్నోళ్లు, వీఐపీలకే పెద్దపీట వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
దర్శనాల విభజన
జొన్నవాడ క్షేత్రానికి జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ఆలయంలో గతంలో అందరికీ ఒకే రకమైన దర్శనం ఉండేది. అయితే రాబడిని పెంచాలనే లక్ష్యంతో ప్రత్యేక దర్శనాల పేరుతో క్యూలను విభజించారు. తొలుత టికెట్ ధర రూ.25 ఉండగా, ఇప్పుడు దాన్ని రూ.50కు పెంచారు. ప్రత్యేక దర్శన భక్తులకు అమ్మవారి గర్భగుడి వాకిటి నుంచి కల్పిస్తే.. సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు మరికొద్ది దూరం నుంచే అవకాశమిచ్చేవారు.
తాజాగా ఇలా..
తాజాగా సామాన్య భక్తులకు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి గర్భగుడి వద్ద క్యూలైన్‌కు గేట్‌ను ఏర్పాటు చేశారు. ఫలితంగా గర్భగుడి వాకిలికి 20 అడుగుల దూరం నుంచే అమ్మవారిని దర్శించుకోవాల్సి వస్తోంది. టికెట్ కొని వచ్చే భక్తులు అమ్మవారికి ఎదురుగా నిలుస్తుండటంతో సామాన్యులకు ఇబ్బంది ఎదురవుతోంది.
పదుల సంఖ్యలో కాంట్రాక్ట్ సిబ్బంది
ఆలయంలో పదుల సంఖ్యలో కాంట్రాక్ట్ సిబ్బందిని మోహరించడంతో భక్తులకు దేవదేవుళ్ల దర్శనం గగనమవుతోంది. హారతి పళ్లేల్లో భక్తులు సమర్పించే కానుకలను తీసి హుండీల్లో వేసేందుకు దాదాపు 70 మందిని కాంట్రాక్ట్ సిబ్బందిగా ఆలయ పాలకమండలి నియమించింది. ఆలయంలో వినాయకుడు, మల్లికార్జునస్వామి, వల్లీ, దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, కామాక్షితాయి అమ్మవారి సన్నిధులున్నాయి. గర్భగుడుల్లో కొలువైన స్వామి వార్ల దర్శనానంతరం భక్తులు హారతి పొంది సమర్పించిన కానుకలను తీసుకునేందుకు ఇద్దరు కాంట్రాక్ట్ సిబ్బంది కాచుకొని ఉంటే, అమ్మవారి సన్నిధి వద్ద ఐదారుగురు ఉంటున్నారు. భక్తులకు దర్శనభాగ్యం కలగకుండా వీరు అడ్డంగా నిలబడిపోతున్నారు. పూజారులు సైతం సామాన్య భక్తులను పట్టించుకోవడంలేదనే విమర్శలూ లేకపోలేదు. ప్రత్యేక దర్శన భక్తుల వద్దకు హారతి పళ్లేలను తీసుకెళ్లి, సామాన్య భక్తుల వద్దకు రాని పరిస్థితీ ఏర్పడుతోంది.
గాయపడుతున్న భక్తుల మనోభావాలు
దేవదాయ శాఖ మంత్రిగా ఆనం రామనారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోని జొన్నవాడ క్షేత్రంలో పరిస్థితి ఇలా ఉందని భక్తులు మండిపడుతున్నారు. మరోవైపు ఇక్కడ అనధికారకంగా పార్కింగ్ ఫీజులను వసూలు చేస్తున్నారు. దేవదాయ శాఖతో సంబంధం లేకుండా అధికార పార్టీకి చెందిన సర్పంచ్, స్థానిక నేతలు ఇలా వసూళ్ల పర్వానికి తెరలేపారు. ఈ విషయమై దేవదాయ శాఖ అధికారులను ప్రశ్నించగా, తమకెలాంటి సంబంధం లేదని చెప్తున్నారు. మరోవైపు పంచాయతీ తరఫున వసూలు చేస్తున్నామని నిర్వాహకులు బదులిస్తున్నారు.
జొన్నవాడలో సామాన్య భక్తులపై చిన్నచూపు
గగనమవుతున్న దర్శనం
డబ్బున్నోళ్లకే పెద్దపీట
హారతి పళ్లేల్లో
కానుకల కోసం సిబ్బంది