నిబంధనల ప్రకారమే లారీని రిలీజ్‌ చేశా | - | Sakshi
Sakshi News home page

నిబంధనల ప్రకారమే లారీని రిలీజ్‌ చేశా

Published Mon, Apr 28 2025 12:00 AM | Last Updated on Mon, Apr 28 2025 12:00 AM

నిబంధనల ప్రకారమే లారీని రిలీజ్‌ చేశా

నిబంధనల ప్రకారమే లారీని రిలీజ్‌ చేశా

నెల్లూరు (పొగతోట): జిల్లా నుంచి ప్రతి నెల వేల టన్నుల రేషన్‌ బియ్యం కృష్ణపట్నం, చైన్నె పోర్టు ద్వారా విదేశాలకు తరలిపోతోంది. ఇది.. జిల్లా సివిల్‌ సప్లయీస్‌ శాఖ, రెవెన్యూ, పోలీస్‌, విజిలెన్స్‌ శాఖలు కాదనలేని నిజం. రేషన్‌ షాపులకు చేరాల్సిన బియ్యం ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి నేరుగా రైస్‌మిల్లులకు వెళ్లి అక్కడ పాలిష్‌ పట్టించి, బ్రాండెడ్‌ బ్యాగ్‌ల్లో ప్యాక్‌ చేసి అక్రమ రవాణా సాగిస్తున్న విషయం జగద్విదితమే. కానీ.. మాఫియా ముడుపులకు అలవాటుపడి.. పేదల కడుపులు కొట్టి సాగిస్తున్న రేషన్‌ బియ్యం అక్రమ దందాతో పేదలకు పట్టెడన్నం కూడా దొరకని దుస్థితి.

పంచనామా ప్రక్రియకు పాతర

సాధారణంగా రేషన్‌ బియ్యం పట్టుబడిన సందర్భంలో సివిల్‌ సప్లయీస్‌ శాఖ అధికారులు ఆరుగురు సామాన్య పౌరుల సమక్షంలో పంచనామా నిర్వహించి, శాంపిల్స్‌ సేకరించాల్సి ఉంది. వాటిని సివిల్‌ సప్లయీస్‌ సంస్థ టెక్నికల్‌ ల్యాబ్‌ టెస్టింగ్‌కు పంపించాల్సి ఉంది. అయితే తొలి పంచనామా ప్రక్రియకు నీళ్లొదిలేసి, తమకు తామే సూపర్‌ బాస్‌ల్లా డీటీలు వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి నిబంధనల ప్రకారం వాహనాన్ని సీజ్‌ చేసే అధికారం డీటీలకు ఉంది. అవి పీడీఎస్‌ బియ్యమైనా, నాణ్యమైన బియ్యమైనా పట్టుకున్న వెంటనే కేసు నమోదు చేయాలి. పంచనామా చేసి అధికారులకు శాంపిల్స్‌ పంపించాలి. అయితే అధికార పార్టీ నేతలు, మాఫియా ఒత్తిళ్లకు, ముడుపులకు లొంగిపోయి క్షణాల్లో నివేదికలను ఇచ్చేస్తున్న పరిస్థితి ఉందంటే ఏం జరుగుతుందో అర్థమవుతోంది.

జాయింట్‌ కలెక్టర్‌ అనుమతి లేకుండానే..

నిబంధనల ప్రకారం వాహనాన్ని పట్టుకున్న వెంటనే 6ఏ కేసు నమోదు చేసి పంచనామా నిర్వహించి వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు అప్పగించాల్సి ఉంది. ఈ మేరకు జాయింట్‌ కలెక్టర్‌కు ఫైల్‌ పంపాల్సి ఉంది. పంచనామా, టెక్నికల్‌ రిపోర్టులను పరిశీలించాక జేసీ ఆదేశాల మేరకు వాహనాలను రిలీజ్‌ చేయాల్సి ఉంటుంది. అయితే దగదర్తి, కోవూరు మండలాల్లో పట్టుకున్న వాహనాలను జాయింట్‌ కలెక్టర్‌ దృష్టికే తీసుకెళ్లకుండా, ఎటువంటి ఫైల్‌ నిర్వహించకుండా సీఎస్‌డీటీలే అంతా తామై వ్యవహరించి లారీలను రిలీజ్‌ చేశారు. పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణాను అరికట్టాల్సిన అధికారులు విధి విధానాలను పాటించకుండా మాఫియాకు సహకరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై సివిల్‌ సప్లయీస్‌ అధికారులు మాత్రం రిలీజింగ్‌ ఆర్డర్‌ సీఎస్‌డీటీకి ఉందంటూ సమర్ధించుకుంటున్నారు. కోవూరుకు సంబంధించి ఎటువంటి డ్యూప్రొసీజర్స్‌ (గడువు ప్రక్రియలు) ఫాలో కాకుండా, పోలీస్‌ ఫిర్యాదు లేకుండా లారీని, బియ్యాన్ని సీజ్‌ చేయకుండా పోలీసు కస్టడీలో ఉంచడం, జిల్లా అధికారులకు ఎటువంటి ఆదేశాలు లేకుండా రెండు రోజులు గడిచిన తర్వాత లారీని విడిచి పెట్టడం అనుమానాలకు తావిస్తోంది.

అక్రమ రవాణా సమాచారం ఇచ్చి వాహనం పట్టించినా వదిలేస్తున్న వైనం

ఇటీవల కోవూరు, దగదర్తిల్లో రేషన్‌ బియ్యం వాహనాల పట్టివేత

వాటిల్లో సాధారణ బియ్యమేనని

నివేదిక ఇచ్చిన అధికారులు

నిబంధనలకు విరుద్ధంగా సీజ్‌ చేసిన వాహనాలకు డీటీల రిలీజింగ్‌ ఆర్డర్‌

పీడీఎస్‌ లారీ వస్తుందన్న సమాచారం మేరకు సీఎస్‌డీటీలను పంపించాం. వాహనాన్ని కోవూరు వద్ద పట్టుకున్నారు. తనిఖీ చేసి పంచనామా నిర్వహించి అనుమానం మేరకే సేకరించిన బియ్యాన్ని టెస్టింగ్‌ నిమిత్తం పంపించాం. సాధారణ బియ్యంగా నివేదికలు వచ్చిన అనంతరం లారీని సీఎస్‌డీటీ రిలీజ్‌ చేశారు. సాధారణ బియ్యంగా నిర్ధారణ అయిన అనంతరమే లారీని రిలీజ్‌ చేశాం. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నాం. – విజయ్‌కుమార్‌, డీఎస్‌ఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement