
బ్లేడుతో భార్య గొంతు కోసి..
● సైదాపురం మండలంలో ఘటన
సైదాపురం: భార్యాభర్తల మధ్య విభేదాలతో ఓ వ్యక్తి బ్లేడుతో భార్య గొంతు కోశాడు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటనపై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. సైదాపురం ఎస్సై క్రాంతి కుమార్ కథనం మేరకు.. కడప పట్టణంలోని శివానందపురానికి చెందిన ఊటుకూరు విష్ణుకు సైదాపురం మండలంలోని కలిచేడు గ్రామానికి చెందిన ప్రసన్నతో వివాహం జరిగింది. ప్రస్తుతం వారు కలిచేడు గ్రామంలో కాపురం ఉంటున్నారు. ఇటీవల భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. విష్ణు భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈనెల 22వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో విష్ణు బ్లేడుతో భార్య గొంతుపై, గడ్డంపై, కుడిచేయి భుజంపై కోశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితురాలిని కుటుంబ సభ్యులు నెల్లూరులోని ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసును నమోదు చేసి పరారీ ఉన్న విష్ణు కోసం గాలిస్తున్నట్టు ఎస్సై తెలిపారు.