ప్రొఫెసర్లకు పునరావాస కేంద్రాలుగా మార్చొద్దు | CM Revanth Reddy Review Meeting Universities Vice Chancellors: Telangana | Sakshi
Sakshi News home page

ప్రొఫెసర్లకు పునరావాస కేంద్రాలుగా మార్చొద్దు

Published Sat, Apr 5 2025 1:17 AM | Last Updated on Sat, Apr 5 2025 1:17 AM

CM Revanth Reddy Review Meeting Universities Vice Chancellors: Telangana

వీసీలతో సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో ఆకునూరి మురళి, కె. కేశవరావు, వేం నరేందర్‌రెడ్డి తదితరులు

వైస్‌ చాన్స్‌లర్లతో సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి 

వర్సిటీలు విద్యార్థుల కేంద్రంగానే ఉండాలి 

కాలం చెల్లిన వారికి పునరావాసం కల్పించేందుకు కాదు.. డిమాండ్‌ ఉన్న కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వాలి 

అలాంటి కోర్సులు బోధించని ప్రొఫెసర్లను పరిపాలన బాధ్యతలకు పంపండి 

గ్రామీణ విద్యార్థులకు సరైన భవిష్యత్తు కల్పించేలా బోధన ఉండాలన్న సీఎం  

అవసరమైన నిధులు, నియామకాలపై నివేదిక అందజేయాలని సూచన 

విద్యాశాఖపై కూడా సీఎం సమీక్ష 

విద్యా ప్రమాణాలు క్షీణిస్తున్నాయంటూ ఆందోళన!

సాక్షి, హైదరాబాద్‌: విశ్వవిద్యాలయాలు కొందరు ప్రొఫెసర్లకు పునరావాస కేంద్రాలుగా మారా యని సీఎం రేవంత్‌రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. వర్సిటీలను అలా చేయొద్దని సూచించారు. యూనివర్సిటీలన్నీ విద్యార్థులు కేంద్రంగా పని చేయాలే తప్ప.. కాలం చెల్లిన వారికి పునరావాసం కల్పించేందుకు కాదని స్పష్టం చేశారు. గతంలో నియమించిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఇంకా ఉన్నారనే భావనతో పలు విశ్వ విద్యాలయాల్లో పెద్దగా ప్రాధాన్యం లేని కోర్సులను ఇప్పటికీ బోధిస్తున్నారని, వాటిని రద్దు చేసి నూతన కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు.

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే కోర్సులు ఉండాలని, మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న కోర్సుల బోధనకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. శుక్రవారం ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఉన్నత విద్యపై రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాల వైస్‌చాన్స్‌లర్లతో సమీక్ష అనంతరం ఆయన మాట్లాడారు.  

కేకేతో చర్చించండి: ప్రస్తుతం వర్సిటీలకు గ్రామీణ ప్రాంతాల నుంచి, ఆర్థిక స్తోమత లేని కుటుంబాల నుంచే విద్యార్థులు వస్తున్నారని.. వారికి సరైన భవిష్యత్తు కల్పించేలా బోధన ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆర్థిక స్తోమత ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వారు మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న కోర్సులను ఎంచుకుని ప్రైవేటు విశ్వ విద్యాలయాల వైపు వెళ్లిపోతున్నారని..వారితో ఎదురయ్యే పోటీని ప్రభుత్వ విశ్వ విద్యాలయాల విద్యార్థులు ఎదుర్కోవాలంటే డిమాండ్‌ ఉన్న కోర్సులనే బోధించాల్సి ఉందని చెప్పారు.

గతంలో నియమితులైన ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు అధునాతన, డిమాండ్‌ ఉన్న బోధనను అందివ్వని పక్షంలో వారికి పాలనపరమైన బాధ్యతలు అప్పగించాలని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు వీసీలు తమ విశ్వ విద్యాలయాల్లో ప్రొఫెసర్ల కొరత, భవనాలు, ఇతర వసతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో యూనివర్సిటీలకు అవసరమైన నిధులు కేటాయించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం హామీ ఇచ్చారు. వీసీలందరూ తమ ఉమ్మడి సమస్యలు, అలాగే యూనివర్సిటీల వారీగా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావుతో సమావేశమై చర్చించాలని సూచించారు. వర్సిటీల వారీగా తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమరి్పంచాలని చెప్పారు.  

విద్యా వ్యవస్థలో మార్పులు చేయాలి 
    క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. అంగన్‌వాడీలు, ప్రాథమిక పాఠశాల స్థాయిలో తీసుకురావాల్సిన మార్పులపై సమాజంలోని వివిధ సంఘాలు, ప్రముఖులతో చర్చించి సమగ్ర విధాన పత్రాన్ని రూపొందించాలని సూచించారు. ఇది ఆచరణకు దగ్గరగా ఉండాలని చెప్పారు.

విద్యా రంగాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళేందుకు అవసరమైన నిధులు సమకూరుస్తామని భరోసా ఇచ్చారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో కూడా రేవంత్‌ సమీక్ష నిర్వహించారు. విద్యారంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. పెద్ద ఎత్తున ఉపాధ్యాయుల నియామకం, అమ్మ ఆదర్శ పాఠశాలలకు కమిటీల ఏర్పాటు, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల పంపిణీపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నట్టు తెలిపారు.  

ప్రాథమిక దశే పునాది 
    ప్రాథమిక దశలో అందే విద్య కీలకమని, విద్యార్థికి పునాది వేసేది ఇదేనని సీఎం తెలిపారు. ప్రాథమిక విద్య బలోపేతం చేస్తే ఉన్నత విద్యలో మరింత రాణిస్తారని అన్నారు. వివిధ రాష్ట్రాలు, దేశాల్లో ప్రాథమిక విద్యలో అనుసరిస్తున్న విధానాలను విద్యా కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. 1960 దశకం నుంచి ఇప్పటివరకు విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన పలు సంస్కరణలు, విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి, ఆలోచన ధోరణి ఏ విధంగా క్షీణిస్తోందో ఫౌండేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫారŠమ్స్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణ వివరించారు. 

విద్యా ప్రమాణాలు ఎందుకు పడిపోతున్నాయ్‌? 
    విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోవడంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ స్థాయి పరీక్ష (న్యాస్‌)లో విద్యార్థుల ప్రమాణాలు తగ్గిపోవడం, భాషల్లోనూ బలహీనంగా ఉండటాన్ని సీఎం ప్రస్తావించారు. అధికారుల నుంచి వివరణ కోరారు. అధికారులు దీనిపై ప్రతినెలా ఎందుకు సమీక్షించడం లేదని ప్రశ్నించారు.

ఇప్పటికీ ప్రజల్లో ప్రభుత్వ స్కూళ్ళు సరిగా నడవవని, పాఠాలు సరిగా చెప్పరనే అపోహ ఉందంటూ, దీన్ని ఎలా దూరం చేస్తారో చెప్పాలన్నారు. ఈ దిశగా చపట్టబోయే చర్యలపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ప్రైవేటు స్కూళ్ళు ప్రతి ఏటా ప్రవేశాలు పెంచుకుంటున్నాయని, ప్రభుత్వ స్కూళ్ళు మాత్రం ప్రజల్లో నమ్మకాన్ని కల్పించలేకపోవడంతో ప్రవేశాలు తగ్గుతున్నాయని సీఎం అన్నట్టు తెలిసింది.  

వేసవి సెలవుల్లో టీచర్లకు ప్రత్యేక శిక్షణ 
    డిజిటల్, ఏఐ సాంకేతిక విద్యను ప్రాథమిక దశలోనే ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నామని, దీనికి తగ్గట్టుగా టీచర్లూ తమ నాణ్యతను పెంచుకోవాలని సీఎం సూచించినట్టు సమాచారం. ఇలావుండగా వేసవి సెలవుల్లో ప్రభుత్వ టీచర్లకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని రేవంత్‌ సూచించారు. 

ఈ సమీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కేశవరావుతో పాటు శ్రీనివాసరాజు,  సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ బాలకిష్టారెడ్డి, సీఎం కార్యదర్శి మాణిక్‌ రాజ్, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌ శ్రీదేవసేన, ప్రాథమిక విద్యా శాఖ డైరెక్టర్‌ నరసింహారెడ్డి, విద్యా కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి, సభ్యులు ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వరరావు, చారకొండ వెంకటేష్, జ్యోత్స్న శివారెడ్డి, వీసీలు ప్రొఫెసర్‌ కుమార్‌ మొలుగారం, ప్రొఫెసర్‌ కె.ప్రతాప్‌రెడ్డి, డాక్టర్‌ టి.యాదగిరిరావు, ప్రొఫెసర్‌ ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్, ప్రొఫెసర్‌ జీఎన్‌ శ్రీనివాస్, ప్రొఫెసర్‌ ఉమేష్‌ కుమార్, ప్రొఫెసర్‌ సూర్య ధనుంజయ్, ప్రొఫెసర్‌ కిషన్‌కుమార్‌ రెడ్డి, ప్రొఫెసర్‌ టి.గంగాధర్, ప్రొఫెసర్‌ ఎ.గోవర్ధన్, ప్రొఫెసర్‌ వి.నిత్యానందరావు, ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement