
నారాయణపేట: నారాయణపేట జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ రేషన్ డీలర్ల ఆలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నుంచి జూన్ నెలకు సంబంధించి ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభం అయింది. దీంతో ఆయన ఆదివారం జిల్లాలోని మరికల్, సమీప గ్రామాల్లో ఉన్న రేషన్ దుకాణాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. డీలర్లు నిర్వహిస్తున్న రేషన్ కేంద్రాలు బూజు, చెత్త చెదారంతో ఉండడం చూసి .. '' బాబు ఇది రేషన్ దుకాణమా.. లేక బూత్ బంగ్లానా'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన మాట్లాడుతూ.. దుకాణాల నిర్వహణ విషయం లో అలసత్వం ఏమాత్రం ఉపెక్షించేది లేదన్నారు. మాట వినక పోతే వేటు తప్పదని హెచ్చరించారు. నిత్యం ఎంతో మంది ప్రజలకు నిత్యావసర సరుకులను అందించే చౌక దుకాణాల ను అపరిశుభ్ర వాతావరణం లో నడపడం డీలర్లకు భావ్యం కాదని స్పష్టం చేశారు. సూక్ష్మ విషయాలే కొన్ని సందర్భాల్లో ప్రధాన అంశాలుగా పరిగణించాల్సి వస్తుందని, అందుకే డీలర్లు ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకునే ఆలోచన చేయకూడదని స్పష్టం చేశారు.