వేములవాడ రాజన్నకు కొత్త గుడి | Development and expansion of Vemulawada temple in three phases | Sakshi
Sakshi News home page

వేములవాడ రాజన్నకు కొత్త గుడి

Published Thu, Apr 17 2025 12:57 AM | Last Updated on Thu, Apr 17 2025 12:57 AM

Development and expansion of Vemulawada temple in three phases

మూడు దశల్లో ఆలయ అభివృద్ధి, విస్తరణ

తొలిదశలో రూ.76 కోట్లతో ప్రధాన ఆలయ నిర్మాణం

రూ.33 కోట్లతో కల్యాణ మండపం

జూన్‌ 15 నుంచి ప్రధాన ఆలయంలో దర్శనాల నిలిపివేత

భీమేశ్వరాలయంలో స్వామి దర్శనాలు

శృంగేరీ పీఠం కనుసన్నల్లో నిర్మాణాలు

చారిత్రక ప్రధాన ఆలయం తొలగించకుండా విస్తరణ 

సాక్షి, హైదరాబాద్‌: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి, విస్తరించే పనులకు ప్రభుత్వం శ్రీకారం చుడు­తోంది. మూడు దశల్లో ఆలయం, పరిసరాలను అభివృద్ధి చేయబోతోంది. ఇందులో తొలి దశ పనులను జూన్‌లో ప్రారంభించాలని నిర్ణయించింది. జూన్‌ 15 నుంచి ప్రధాన దేవాలయంలోకి భక్తులను అనుమతించరు. కేవలం నిత్య పూజలను మాత్రం అర్చకులు ప్రధాన దేవాలయ గర్భా­లయంలో నిర్వహిస్తారు. భక్తులకు స్థానిక భీమేశ్వరాలయంలో స్వామి దర్శనం కొన­సాగుతుంది. 

ఏడాదిన్నర నుంచి రెండేళ్లలో మొదటి దశ పనులు పూర్తి చేయనున్నారు. అప్పటి వరకు రాజరాజేశ్వర స్వామి దేవాలయంలోని ఉత్సవ మూర్తులను భీమేశ్వరాలయంలో ఉంచి భక్తులకు దర్శనాలు, కైంకర్యాలు కొనసాగిస్తారు. ఈ పనులకు సంబంధించి గురువారం వేములవాడలో ఉన్నతస్థాయి సమీక్షి నిర్వహించనున్నారు. ఇందులో చర్చించి తుది నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడిస్తారు. 

మొత్తం పనులకు రూ.550 కోట్లు అవసరం 
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం యాదగిరిగుట్ట దేవాలయాన్ని పునర్నిర్మించిన విషయం తెలిసిందే. గర్భాలయంలోని మూల విరాట్టు ప్రాంగణాన్ని అలాగే ఉంచి మిగతా మొత్తం ఆలయం స్థానంలో పూర్తి కొత్త ఆలయాన్ని నిర్మించారు. శతాబ్దాల చరిత్ర ఉన్న పురాతన ఆలయాన్ని తొలగించటం పట్ల భక్తుల్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో వేములవాడ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. 

శృంగేరీ శంకరమఠం పీఠాధిపతి సూచించిన మార్పులను మాత్రమే పరిగణనలోకి తీసుకుని కొత్త నిర్మాణాన్ని చేపడుతోంది. ప్రధాన గర్భాలయం, మండప భాగాన్ని పటిష్ట పరిచి దాన్ని అలాగే ఉంచి చుట్టూ కొత్త మండపాన్ని నిర్మిస్తారు. పాత నిర్మాణాన్ని అనుసరిస్తూ కొత్త నిర్మాణంతో ఆలయాన్ని విస్తరిస్తారు. పురాణ నేపథ్యంలో ఉన్న ధర్మగుండం, గుడి చెరువు ప్రాశస్త్యం తగ్గకుండా 40 ఎకరాల పరిధిలో నిర్మాణాలు చేపట్టనున్నారు. 

అన్నదాన సత్రం, క్యూ కాంప్లెక్సు, వసతి గృహాలు, రెండు ప్రాకారాలు, కార్యాలయం, కోనేరు, కల్యాణ కట్ట, కోడె మొక్కుల ప్రాంతం.. ఇలా అన్నీ కొత్తగా నిర్మిస్తారు. భీమేశ్వరాలయం సహా అనుబంధ దేవాలయాలను అభివృద్ధి చేస్తారు. ఈ మొత్తం పనులకు రూ.550 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఇందులో ప్రభుత్వం ఇప్పటికే ప్రధాన దేవాలయానికి సంబంధించి రూ.76 కోట్లకు, కల్యాణ మండపానికి సంబంధించి రూ.33 కోట్లకు నిధులు మంజూరు చేసింది. ఇటీవలి బడ్జెట్‌లో మరో రూ.100 కోట్లు ప్రతిపాదించింది. 

వీటితో పనులు కొనసాగిస్తూ, తదుపరి విడతలకు మరిన్ని నిధులు మంజూరవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. కేంద్రప్రభుత్వ ‘ప్రసాద్‌’పథకంలో భాగంగా 96 గదులతో కూడిన వసతి గృహ నిర్మాణానికి రూ.44 కోట్లు మంజూరయ్యాయి. దీనికి మరిన్ని నిధుల కోసం కేంద్రమంత్రి బండి సంజయ్‌ ప్రయత్నిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. 

» ఆలయం 15 డిగ్రీల కోణంలో ఆగ్నేయం దిశ వైపు మళ్లి ఉంటుంది. ఇప్పుడు గర్భాలయం, సభా మండపాన్ని అదే దిశలో నిర్మించి మిగతా భాగాన్ని నేరుగా ఉండేలా సరిద్దిది విస్తరిస్తారు.
» చారిత్రక, పౌరాణిక నేపథ్యం ఉన్న అన్ని భాగాలను, పురాణాలు, పురాతన గ్రంథాలు, 1970లో వెలుగు చూసిన రాతి శాసనాల్లో పేర్కొన్న విధంగా ప్రాశస్త్యానికి ఇబ్బంది లేకుండా విస్తరిస్తారు. కొన్ని నిర్మాణాలు తదనంతరం వెలిశాయి. వాటి విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
» అన్నాదాన సత్రాన్ని రెండెకరాల విస్తీర్ణంలో రెండంతస్తులుగా లక్షన్నర చ.అ. మేర రూ.35.35 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు.
» ప్రస్తుత ప్రధాన ఆలయం 4 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, దాన్ని 4.6 ఎకరాల విస్తీర్ణానికి పెంచనున్నారు.
» సరైన ప్రణాళిక లేకపోవటంతో గతంలో ఆలయ పునరుద్ధరణ వంకరటింకరగా జరిగింది. ఇప్పుడు దాన్ని రెండు ప్రాకారాలు, రెండు వీధులతో క్రమపద్ధతిలోకి మార్చనున్నారు. 
»  ప్రస్తుతం ఇరుకుగా ఉన్న వీధులను రూ.47 కోట్ల వ్యయంతో 80 అడుగుల మేర విస్తరించనున్నారు.
» అన్ని ప్రాంతాల్లో బతుకమ్మ పండుగను 9 రోజులు నిర్వహిస్తే, ఒక్క వేములవాడలో ఏడు రోజులు మాత్రమే జరుగుతుంది. బతుకమ్మ పుష్పం నుంచే ఆలయం ఉద్భవించిందన్న పౌరాణిక గాథ ఉంది. దాన్ని ప్రతిబింబించే తరహా గుర్తులను నిర్మాణంలో చూపనున్నారు.
» పునరుద్ధరణ క్రమంలో గతంలో కొన్ని నిర్మాణాల్లో వేములవాడ చాళుక్యుల శైలి లోపించింది. ఇప్పుడు కొత్త నిర్మాణం యావత్తు ఆ శైలిలోనే ఉండనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement