
సాక్షి,హైదరాబాద్: మేడిగడ్డ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ అధినేత.. మాజీ సీఎం కేసీఆర్(KCR), మాజీ మంత్రి హరీష్ రావులు వేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. తీర్పు రిజర్వు చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. తీర్పును తర్వాత వెల్లడిస్తామని తెలిపింది.
మేడిగడ్డ కుంగిన వ్యవహరంపై భూపాలపల్లి కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేసీఆర్, హరీష్ రావులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఇవాళ (ఫిబ్రవరి24) హైకోర్టు విచారణ జరపింది. విచారణ సందర్భంగా.. లోయర్ కోర్టులో పిటిషన్ వేసిన రాజలింగమూర్తి(Raja Lingamurthy) చనిపోయాడని కేసీఆర్, హరీష్ తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే..
కేసు వేసిన పిటిషనర్ చనిపోయినా లీగల్ హైర్(Legal Heir)ను ఇంప్లీడ్ చేస్తే.. పిటిషన్ మెయింటేనబుల్ అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. కాబట్టి, మళ్లీ లోయర్ కోర్టుకు రిఫర్ చేయాలని బెంచ్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే.. ఇది క్రిమినల్ పిటిషన్ కాబట్టి లీగల్ హైర్‌కు ఆస్కారం ఉండబోదని కేసీఆర్ అడ్వకేట్ వాదించారు. లీగల్ హైర్ ను ఇంప్లీడ్ చేయడం సమన్స్ కేసుకు మాత్రమే వర్తిస్తుందని కోర్టుకు నివేదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.
