
జూనియర్ పై సీనియర్ విద్యార్థి దాడి
ఇందిరానగర్ ఎస్సీ హాస్టల్‌లో ఘటన
పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
హన్మకొండ చౌరస్తా : ‘నీళ్లు తెమ్మంటే తీసుకురావా రా.. నాకే ఎదురు సమాధానం చెబుతావా’ అంటూ జూనియర్ పై ఓ సీనియర్ విద్యార్థి దాడికి పాల్ప డ్డాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి హనుమకొండలోని ఇందిరానగర్ ఎస్సీ హాస్టల్‌లో చోటుచేసుకుంది. బాధిత విద్యార్థుల కథనం ప్రకారం.. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన రాజబాబు, పవన్‌కల్యాణ్, రణధీర్, మధుకర్ హనుమకొండ 8వ డివిజన్‌లోని ఇందిరానగర్‌లో గల ఎస్సీ హాస్టల్‌లో ఉంటూ ప్రభుత్వ కాకతీయ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు.
సుమారు పదిహేను రోజుల క్రితం ఇదే హాస్టల్‌లో ఉంటూ డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న రంజిత్ వాటర్ బాటిల్‌లోని నీరును రాజబాబు తాగాడు. విషయం తెలుసుకున్న రంజిత్ ‘నా వాటర్ బాటిల్‌లోని నీరు తాగి మళ్లీ తీసుకురాకుండా వెళ్తావా’ అంటూ గద్దించాడు. దీంతో భయపడిన జూనియర్ విద్యార్థి రాజబాబు అన్న రూమ్‌లో ఉంటే తాగి వెళ్లిపోయానన్న నీ బాటిల్ అని తెలియదని సమాధానం ఇచ్చాడు. నీళ్లు తీసుకురాకుండా నాకే ఎదురు సమాధానం చెబుతావా, నీ సంగతి చెబుతా అంటూ వెళ్లిపోయాడు. అప్పటి నుంచి హాస్టల్‌లో రాజబాబు ఎదురుపడినా ప్రతీసారి దూషణకు దిగేవాడు.
రాజబాబు అతడి మిత్రులు అక్కడి నుంచి వెళ్లిపోయినా రెచ్చగొట్టేలా వ్యవహరించేవాడు. ఆదివారం రాత్రి రంజిత్ హాస్టల్‌కు సంబంధం లేని కొందరి వ్యక్తులను తీసుకొచ్చి రాజబాబుపై దాడికి దిగాడు. అడ్డుకున్న అతడి మిత్రులు పవన్‌కల్యాన్, రణధీర్, మధుకర్‌ను సైతం చితకబాదారు. ఈ ఘటనలో రాజబాబుకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధిత విద్యార్థులు తెలిపారు. ఈ విషయం పై హాస్టల్ వార్డెన్ మోతీలాల్‌ను వివరణ కోరగా గాయపడిన విద్యార్థికి చికిత్స చేయించామని, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు.