
సాక్షి, హైదరాబాద్: రక్తహీనత సమస్య గ్రామీణ ప్రాంత పిల్లలు, కౌమార వయసు వారిలో ఎక్కువగా కన్పిస్తోందని, నగరాల్లోని పిల్లల్లో మాత్రం ఐరన్ లేమి ఎక్కువగా ఉందని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) అధ్యయనంలో తేలింది. నగరాల్లోని పిల్లల్లో రక్త హీనత సమస్య తక్కువగానే ఉందని వెల్లడైంది. గ్రామీణుల్లో రక్తహీనత ఎక్కువగా ఉన్నా ఇనుము లేమి సమస్య లేదని స్పష్టమైంది. దేశంలోని పిల్లలు, కౌమార వయసున్న వారిలో రక్తహీనత సమస్యను అధిగమించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు.. వ్యాధులు, పోషణ లేమితో విజయవంతం కాలేకపోతున్నాయని వెల్లడైంది. దేశంలోని మహిళలు, పిల్లలు 40–50 శాతం మంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటుండగా.. పరిష్కారం కోసం జరుగుతున్న ప్రయత్నాలను సమీక్షించాల్సిన అవసరం ఈ అధ్యయనం కల్పిస్తోందని ఎన్‌ఐఎన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.
మంచి ఆహారం కీలకం..
రక్తంలో ఇనుము మోతాదు చాలా తక్కువగా ఉంటే రక్తహీనత వచ్చిందని చెబుతుంటారు. ఈ లెక్కన చూస్తే దేశంలోని దాదాపు 50 శాతం మందిలో ఈ సమస్య ఉండాలి. అయితే రక్తంలోని ఇనుము మోతాదును గుర్తించేందుకు అయ్యే పరీక్షలు చాలా ఖరీదైనవి. జనాభా స్థాయిలో పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు. ఈ కారణంగానే రక్తంలోని హిమోగ్లోబిన్‌ను లెక్కించడం ద్వారా ఇనుము లోపాన్ని పరోక్షంగా గుర్తించి రక్తహీనతపై అంచనాకు వస్తారు. ‘రక్తహీనత ఎక్కువగా ఉన్నట్లు సర్వేల ద్వారా తెలిస్తే.. ఇనుము సప్లిమెంట్లు, ఇనుము కలిగిన ఆహారం ఇవ్వడం ద్వారా సమస్యను అధిగమించే ప్రయత్నం జరుగుతుంది.
కానీ తాజా అధ్యయనం ప్రకారం చూస్తే సమస్య పూర్తిగా పరిష్కారం అవుతున్నట్లు కన్పించట్లేదు’అని ఎన్‌ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 33 వేల మంది పిల్లలు, కౌమారులపై ఈ అధ్యయనం జరిగింది. ‘రక్తంలో హిమోగ్లోబిన్ తయారయ్యేందుకు నాణ్యమైన ఆహారం చాలా కీలకం. పండ్లు, జంతు సంబంధిత ఆహారం తక్కువగా తీసుకుంటుండటం వల్ల గ్రామీణుల్లో, పేదల్లో హిమోగ్లోబిన్ తయారీ సక్రమంగా జరగట్లేదు. ఇనుముతో పాటు అనేక ఇతర పోషకాలు హిమోగ్లోబిన్ తయారీకి అవసరమవుతాయి’అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ భారతీ కులకర్ణి తెలిపారు.
(చదవండి: కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా అనూప్ చంద్ర)