
ప్రమాదవశాత్తు చెరువులో పడి ఆరేళ్ల చిన్నారి మృతి
చైతన్యపురి(హైదరాబాద్): ఇంటి పక్క నుంచి ఆడుకుంటూ వెళ్లిన ఆరేళ్ల బాలిక ప్రమాదవశాత్తు చెరువు నీళ్లలో పడి మృతి చెందిన ఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన పాలకుర్తి శ్రీను, శ్రావణి దంపతులు. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి కూలిపనులు చేసుకుంటూ గ్రీన్‌పార్కు కాలనీ రోడ్‌నం.14లో నివసిస్తున్నారు. వీరికి నలుగురు కూతుళ్లు. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో తల్లిదండ్రులు పక్కింటివారితో మాట్లాడుతుండగా రెండో కూతురు అభిత (6) ఆడుకుంటోంది.
కొద్ది సేపటి తర్వాత తర్వాత చూడగా అభిత కనిపించలేదు. ఎక్కడ వెతికినా జాడ తెలియకపోవటంతో రాత్రి సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు అభిత మృతదేహం చెరువు నీటిలో తేలుతూ కనిపించింది. ఇంటి సమీపంలోనే చెరువు ఉండటంతో బాలిక ఆడుకుంటూ వెళ్లి అందులో పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. తమ ఆరేళ్ల కూతురు మృతి చెందడంతో శ్రీను, శ్రావణి దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.