గ్రూప్‌–1 నియామకాలు నిలిపివేయండి | TGPSC Group 1 recruitment: Telangana High Court halts appointment letters issuance | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–1 నియామకాలు నిలిపివేయండి

Published Fri, Apr 18 2025 3:36 AM | Last Updated on Fri, Apr 18 2025 3:36 AM

TGPSC Group 1 recruitment: Telangana High Court halts appointment letters issuance

టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం

సర్టీఫికెట్ల వెరిఫికేషన్‌ కొనసాగించేందుకు ఓకే

పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలుచేయాలన్న న్యాయమూర్తి 

మెయిన్స్‌ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్‌ విచారణ 

మధ్యంతర ఉత్తర్వులు జారీ.. తదుపరి విచారణ 28కి వాయిదా

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–1 నియామకాలను నిలిపివేస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మెయిన్స్‌ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్‌లో తాము తీర్పు వెలువరించే వరకు నియామక పత్రాలు జారీ చేయవద్దని తెలంగాణ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ)కు స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం నడుస్తున్న సర్టీఫికెట్ల వెరిఫికేషన్‌ను కొనసాగించేందుకు వెసులుబాటు ఇచ్చింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థుల డేటా నమోదు చేసే లాగ్డ్‌ హిస్టరీ సమర్పణతో పాటు పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని కమిషన్‌ను ఆదేశించింది. తదుపరి విచారణ 28కి వాయిదా వేసింది.  

అవకతవకలపై విచారణ జరిపించండి 
గ్రూప్‌–1 పోస్టులు భర్తీ చేసే క్రమంలో 2024 అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు నిర్వహించిన మెయిన్స్‌ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు, అసమానతలు చోటు చేసుకున్నాయని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట శివనగర్‌కు చెందిన కె.పర్శరాములుతో పాటు మరో 19 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌ వేసిన వారిలో 19 మంది ప్రభుత్వ ఉద్యోగులేనని చెబుతుండటం గమనార్హం.

కాగా తమ సమాధాన పత్రాలను సరిగా మూల్యాంకనం చేయలేదని, జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితాను తప్పుగా ప్రచురించారని వారు పేర్కొన్నారు. అవకతవకల తీవ్రత దృష్ట్యా విచారణకు ఆదేశించి కోర్టు పర్యవేక్షించినా సరే లేదా స్వతంత్ర న్యాయ విచారణకు ఆదేశించాలని కోరారు. తమ జవాబు పత్రాలను తిరిగి ముల్యాంకనం చేసేలా లేదా తిరిగి మెయిన్స్‌ నిర్వహించేలా కమిషన్‌కు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు గురువారం విచారణ చేపట్టారు.  

రీకౌంటింగ్‌తో 60 మార్కులు తగ్గాయి..  
    పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘హైదరాబాద్‌లోని రెండు సెంటర్ల నుంచి 71 మంది ఎంపిక కావడం సందేహాస్పదం. మొత్తం 563 పోస్టుల్లో ఇది దాదాపు 12 శాతం. మెయిన్స్‌కు తొలుత 21,075 మంది హాజరయ్యారని ప్రకటించి, తర్వాత 21,085 మంది అని పేర్కొన్నారు. ఈ 10 మంది ఎలా పెరిగారో వెల్లడించలేదు. ఉర్దూలో 9 మంది రాస్తే.. 10 మంది అని చెప్పారు.

జనరల్‌ ర్యాంకింగ్‌ ప్రకటన సమయంలో కంప్యూటర్‌లో మార్పులు చేశారు. లాగ్డ్‌ హిస్టరీ పరిశీలిస్తే నిజం తేలుతుంది. అయితే దీనిపై ప్రశ్నిస్తే ఆ వివరాలు మీకెందుకంటూ బెదిరిస్తున్నారు. 482 మార్కులు వచ్చిన ఓ అభ్యరి్థకి రీకౌంటింగ్‌లో 60 మార్కులు తగ్గడం మరీ విచిత్రం. పరీక్షా కేంద్రాల పెంపు, ప్రిలిమ్స్‌కు, మెయిన్స్‌కు హాల్‌టికెట్ల నంబర్‌ మార్పుపై స్పష్టత లేదు..’ అని చెప్పారు.  

అలాగైతే అందరూ ఎంపిక కావాలి కదా.. 
    టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది పీఎస్‌ రాజశేఖర్‌ వాదనలు వినిపిస్తూ.. ‘ప్రిలిమ్స్‌కు, మెయిన్స్‌కు వేర్వేరు హాల్‌ టికెట్‌ నంబర్లు ఇచ్చాం. అయితే ప్రిలిమ్స్‌ హాల్‌టికెట్‌ నంబర్‌ను కూడా మెయిన్‌ హాల్‌టికెట్‌లో పొందుపరిచాం. అక్టోబర్‌ 27న మెయిన్స్‌ చివరి పరీక్ష జరిగింది. పరీక్షా కేంద్రాల నుంచి అందిన సమాచారం మేరకు హాజరైన అభ్యర్థులు 21,075 మందిగా కమిషన్‌ ప్రకటించింది. ఈ సంఖ్యలో స్వల్ప మార్పు ఉండొచ్చని కూడా చెప్పింది.

ఆ తర్వాత ఈ సంఖ్య 21,085 అని పేర్కొంది..’అని చెప్పారు. దీంతో రిపోర్టు చేసిన తర్వాతే అభ్యర్థులు హాల్లోకి ప్రవేశిస్తారు కదా.. అదే రోజు సరైన సంఖ్య వచ్చే అవకాశం లేదా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. లేదని న్యాయవాది బదులిచ్చారు. ‘రెండు సెంటర్ల నుంచి ఎక్కువ మంది ఎంపికయ్యారన్నది మరో ఆరోపణ.

ఓ సెంటర్‌లో 792 మంది పరీక్షకు హాజరుకాగా 39 మంది (4.92%), మరో సెంటర్‌ నుంచి 864 మంది హాజరుకాగా 32 మంది (3.7%) ఎంపికయ్యారు. ఎంపికైన శాతం స్వల్పం. ఒకవేళ అవకతవకలు జరిగి ఉంటే ఆ సెంటర్లలోని అందరూ ఎంపికయ్యేవారు. అలా జరగలేదంటే ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా సాగిందని తెలుస్తోంది..’అని అన్నారు.  

పోర్జరీ చేసి మార్కులు మార్చారు 
    ‘ఓ సెంటర్‌ పెంచడంపై పిటిషనర్‌ మరో ఆరోపణ చేశారు. మెయిన్స్‌కు 45 సెంటర్లు ప్రకటించినా తర్వాత ఓ సెంటర్‌ పెంచాం. ఒకచోట దివ్యాంగులు పరీక్ష రాసేందుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండటంతో మరో కేంద్రాన్ని పెంచాం. పిటిషనర్లు చెబుతున్నట్టుగా.. పదవీ విరమణ పొందిన వారిని మూల్యాంకనానికి తీసుకోవద్దని చట్టంలో లేదు. ఇక పిటిషనర్లంతా ప్రభుత్వ ఉద్యోగులు. ఎక్కడ పని చేస్తున్నారో దాచి పిటిషన్‌ వేశారు.

రీ కౌంటింగ్‌లో ఒకరికి మార్కులు తక్కువ వచ్చాయన్నది కూడా నిజం కాదు. తొలుత, ఆ తర్వాత కూడా ఆ అభ్యర్థికి 422.5 మార్కులే వచ్చాయి. అయితే పోర్జరీ చేసి మార్కులు మార్చారు. దీనిపై షోకాజ్‌ నోటీసు జారీ చేశాం. విచారణ జరుపుతాం..’అని నివేదించారు.  

పిటిషనర్ల వివరాలు సమర్పించాలి: న్యాయమూర్తి 
    వాదనలు విన్న న్యాయమూర్తి.. నియామకాలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే పిటిషనర్లు ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారో పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించారు. పిటిషనర్లు తప్పుడు వివరాలను దాఖలు చేసినట్లు నిరూపితమైనా, టీజీపీఎస్సీలో అవకతవకలు జరిగాయని తేలినా తీవ్ర చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇలావుండగా.. ఇంప్లీడ్‌ కాకుండా వాదనలు వినిపించడం సరికాదంటూ.. రీ కౌంటింగ్‌లో తక్కువ మార్కులు వచ్చాయని చెప్పిన ఓ అభ్యరి్థని హైకోర్టు తప్పుబట్టింది. పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని సూచించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement