మధ్యాహ్నం 12.30 నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతి
1.30 గంటలకు గేట్లు బంద్.. 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష
తొలి పరీక్ష హాల్‌టికెట్‌నే చివరి పరీక్ష వరకు వెంట ఉంచుకోవాలి
పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సివిల్ సర్విస్ ఉద్యోగాలుగా పేర్కొనే గ్రూప్–1 కొలువుల భర్తీకి సంబంధించిన మెయిన్స్ పరీక్షలు సోమవారం ప్రారంభమవుతున్నాయి. ఈనెల 27వ తేదీ వరకు వరుసగా జరిగే ఈ పరీక్షలకు తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ జిల్లాలో 8, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27 పరీక్షా కేంద్రాలు కలిపి.. మొత్తం 46 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి.
మొత్తం 563 గ్రూప్–1 పోస్టుల కోసం 31,383 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు పరీక్షల నిర్వహణ, భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ప్రతి పరీక్ష హాల్, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. టీజీపీఎస్సీ కార్యాలయం నుంచి నేరుగా పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. సహాయకుల (స్క్రైబ్) ద్వారా పరీక్ష రాసే దివ్యాంగులకు ప్రత్యేకంగా ఒక గంట అదనంగా కేటాయిస్తారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాలకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారు.
ఏడు రోజులు... ఏడు పరీక్షలు..
సోమవారం నుంచి 27వ తేదీ వరకు ఏడు రోజులు.. ప్రతిరోజు మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ప్రతి పరీక్షకు 3గంటల సమయం ఉంటుంది. ప్రతి పరీక్షకు గరిష్ట మార్కులు 150. జనరల్ ఇంగ్లిష్ మినహా మిగతా పరీక్షలను ఇంగ్లి‹Ù, తెలుగు, ఉర్దూ భాషల్లో ఏదో ఒక దానిలో రాయవచ్చు. అయితే అన్ని పరీక్షలను ఒకే భాషలో రాయాలి. అభ్యర్థులు అన్ని పరీక్షలకు తప్పకుండా హాజరుకావాలి. అభ్యర్థులను మధ్యాహ్నం 12.30 గంటల నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. 1.30 గంటలకు పరీక్షా కేంద్రాన్ని మూసివేస్తారు. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అభ్యర్థులను లోనికి అనుమతించరు. అభ్యర్థి తొలి పరీక్షకు వినియోగించిన హాల్‌టికెట్‌నే చివరి పరీక్ష వరకు వెంట ఉంచుకోవాలి. డూప్లికేట్ హాల్‌టికెట్ జారీ చేసే అవకాశం ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment