
సామాజిక కార్యకర్త కిడ్నాప్.. హత్య!
పోలీసుల అదుపులో నిందితులు
నిందితుల్లో కానిస్టేబుల్?
వరంగల్ క్రైం: ములుగు జిల్లా వెంకటాపూర్ (కె) మండల కేంద్రానికి చెందిన ‘చేయూత’స్వచ్ఛంద సంస్థ కార్యకర్త చేడం సాయి ప్రకాశ్(30)ను కిడ్నాప్ చేసి హత్యకు పాల్పడినట్లు తెలిసింది. పోలీసులు, అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సాయి ప్రకాశ్ ఈనెల 15న వెంకటాపూర్ నుంచి హనుమకొండకు తన బంధువులను ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత తన ఆచూకీ తెలియకపోవడంతో ఈనెల 16, 17 తేదీల్లో వెతికిన అనంతరం 18న బంధువులు హనుమకొండ పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
పోలీసులు దర్యాప్తులో భాగంగా సాయిప్రకాశ్ హనుమకొండకు వచ్చిన ఆస్పత్రి, ఆ తరువాత వెళ్లిన దృశ్యాలను సీసీ టీవీ ఫుటేజీల ద్వారా పరిశీలించారు. తన ఫోన్ ద్వారా ఆచూకీ కనిపెట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికి వివరాలు రాకపోవడంతో ఏసీపీ కొత్త దేవేందర్‌రెడ్డి రెండు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అప్పటికే సాయి ప్రకాశ్‌ను కిడ్నాప్ చేసిన దుండగులు కరీంనగర్‌లో హత్య చేసినట్లు తెలిసింది. దీంతో సాయి ప్రకాశ్‌కు ఎవరితో శతృత్వం ఉందనే కోణంలో విచారణ చేపట్టడంతో నిందితుల సమాచారం తెలిసినట్లు తెలిసింది.
నిందితుల్లో కానిస్టేబుల్?
సాయి ప్రకాశ్ హత్య సంఘటనలో పాల్గొన్న నిందితుల్లో ఓ కానిస్టేబుల్ ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు సమాచారం. హనుమకొండలో సాయి ప్రకాశ్‌ను కిడ్నాప్ చేసి కరీంనగర్‌లో హత్య చేసినట్లు గుర్తించారు.
ఈ హత్యకు గతంలో వెంకటాపూర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేసిన ఓ కానిస్టేబుల్ ప్రధాన కారణమని తెలిసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కానిస్టేబుల్ శ్రీనివాస్‌తో కలిసి ప్రకాష్‌ను సుపారీ గ్యాంగ్‌తో పిన్ని నిర్మల హత్య చేయించింది. కానిస్టేబుల్ వివాహేతర సంబంధం విషయంలో సాయి ప్రకాష్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడినట్లు తెలిసింది. దానిని మనస్సులో పెట్టుకుని సాయి ప్రకాశ్‌ను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు తెలిసింది.