
ఆదర్శ పంచాయతీని సందర్శించిన పంచాయతీరాజ్ కమిషనర్
తిరుపతి రూరల్: చెర్లోపల్లి సర్పంచ్ బొల్లినేని సుభాషిణి ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదర్శ పంచాయతీ అవార్డును దక్కించుకోవడంతో ఆ పంచాయతీని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ గురువారం సందర్శించారు. చెర్లోపల్లి పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించిన ఆయనకు సర్పంచ్ సుభాషిణి సాదర స్వాగతం పలికారు. అనంతరం గ్రా మ పంచాయతీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రజలకు అందించిన సేవల గురించి ఫొటోలు ఆధారంగా ఆయనకు వివరించారు. అనంతరం పంచాయతీ శాశ్వత ఆదాయానికి తీసుకున్న నిర్ణయాలు, పూర్తి చేసిన పనుల గురించి తెలుసుకున్న ఆయన సర్పంచ్‌ను అభినందించారు. అలాగే పంచాయతీ కార్యాలయంతో పాటు అక్కడ నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌ను పరిశీలించారు. చెర్లోపల్లి పంచాయతీ పరిధిలో చేసిన అభివృద్ధి పనులను మిగతా పంచాయతీల వారికి చూపించి ఆదర్శంగా తీసుకునేలా చూడాలని అధికారులకు సూచించారు. జెడ్పీ సీఈఓ రవికుమార్‌నాయుడు, డీపీఓ సుశీలాదేవి, డీఎల్‌పీఓ సురేష్ నాయుడు, ఎంపీడీఓలు రామచంద్ర, రమేష్, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది పాల్గొన్నారు.