
సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యమివ్వాలి
బొబ్బిలిరూరల్: మండలంలోని పిరిడి, పక్కి గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను డీఎంహెచ్‌వో జీవనరాణి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది అందిస్తున్న వైద్యసేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. గర్భిణులకు ఆపరేషన్ కాకుండా సాధారణ ప్రసవాలు చేసేందుకు ప్రాధాన్యమివ్వాలన్నారు. ఈ నెలలో నాలుగు సాధారణ ప్రసవాలు చేశామని, గత నాలుగు నెలల్లో 52 సాధారణ ప్రసవాలు చేశామని వైద్యుడు రఘువంశీ తెలిపారు.
పశువుల శాల,
వరి కుప్పలు దగ్ధం
నెల్లిమర్ల రూరల్: మండలంలోని వల్లూరు గ్రామంలో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో పశువుల శాల, వరి కుప్పలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానిక బీసీ కాలనీ సమీపంలో చెత్త కుప్పలకు నిప్పు పెట్టడంతో.. దగ్గరలో ఉన్న పశువుల శాలకు మంటలు అంటుకొని దట్టంగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన పంచాది ఈశ్వరరావు, గాదిపల్లి సత్యంకు చెందిన ఆవుల శాలతో పాటు రెండు వరికుప్పలు దగ్ధమయ్యాయి. సుమారు రూ.లక్ష వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. స్థానికులు స్పందించి మంటలు అర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందడంతో వారు అక్కడికి చేరుకొని పూర్తి స్థాయిలో మంటలను అదుపు చేశారు. రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి బాధితుల వివరాలు సేకరించారు.
‘అంగన్‌వాడీ’లను సందర్శించిన నాగాలాండ్ బృందం
బలిజిపేట: సుపోషిత పంచాయతీ పలగరలోని 2, 4 అంగన్‌వాడీ కేంద్రాలను నాగాలాండ్ బృందం సభ్యులు హవీబు మేహవుడ్, లాంగ్ కుహంలు శనివారం సందర్శించారు. కేంద్రాల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన, బోధనకు సంబంధించి ఎటువంటి చర్యలు చేపడతారనేది ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ వారికి వివరించారు. కేంద్రాల్లో ఉండే టాయిలెట్‌లు, తాగునీటి సదుపాయం, కేంద్రాల ద్వారా అందిస్తున్న పోషకాహారం, చిన్నారులకు అందించే మధ్యాహ్న భోజనం, గర్భిణుల, బాలింతలకు ఇచ్చే పౌష్టికాహారం తదితర వివరాలను బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనేది తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు గర్భిణులకు సీమంతాలు చేశారు. బలిజిపేట సీడీపీఓ సులేఖ, సూపర్‌వైజర్ పద్మ, టాటా ట్రస్టు అసోసియేట్ సూపర్‌వైజర్ పూర్ణిమ, మహిళా పోలీసు, సిబ్బంది, జాన్, తదితరులు పాల్గొన్నారు.

సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యమివ్వాలి

సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యమివ్వాలి