
కడప రూరల్ : జిల్లా తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగలు ఎగిసిపడుతున్నాయి. ఆ పార్టీ అధిష్టానం, నేతలపై కార్యకర్తలు మండిపడుతున్నారు. ఇక కడప టీడీపీలో అయితే అసమ్మతి అగ్నిగుండంలా మారింది. గురువారం స్ధానిక రహమతియా ఫంక్షన్ హాల్‌లో టీడీపీ కడప మాజీ ఇన్‌చార్జి అమీర్‌బాబు, సీనియర్ నాయకుడు లక్ష్మిరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నియోజకవర్గ క్లస్టర్లు, యూనిట్ ఇన్‌చార్జిల సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ కార్యకర్తలు పలువురు పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి, కడప ఇన్‌చార్జి మాధవిరెడ్డిల వ్యవహార శైలిపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు రామలక్షుమ్మ, స్వర్ణలత మాట్లాడుతూ ఏళ్ల తరబడి టీడీపీలో సీనియర్ కార్యకర్తలుగా పనిచేస్తున్నాం. పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి అయితే ఏ నాడూ మమ్మల్ని కనీసం పలకరించను కూడా లేదని విమర్శించారు.
ఆయన ఓ వ్యాపారి, పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా వ్యాపారమే చేసుకుంటాడని ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీనివాసులురెడ్డి నీరు–చెట్టు నిధులను కొల్లగొట్టారు. ఆ డబ్బులో చిల్లిగవ్వ కూడా తమలాంటి కార్యకర్తలకు ఇవ్వలేదన్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో అన్ని స్థానాల్లో అభ్యర్థులను గెలిపిస్తామని ప్రగల్బాలు పలికి దారుణంగా విఫలమయ్యారని గుర్తు చేశారు.
కడప కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ అతికష్టం మీద ఒక్క కార్పొరేటర్ స్థానం మాత్రమే గెలిచిందన్నారు. ఇప్పుడు తన సతీమణి మాధవిరెడ్డిని తెరపైకి తెచ్చి, కడప ఇన్‌చార్జిగా నియమించుకోగలిగారని అన్నారు. ఆమెకు పార్టీ గురించి, కార్యకర్తల గురించి ఏమి తెలుసని ప్రశ్నించారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోకుండా ఆమెకు కడప ఇన్‌చార్జి బాధ్యతలు కట్టబెట్టడం విడ్డూరంగా ఉందన్నారు.
కడప ఎమ్మెల్యే టికెట్‌ను సీనియర్లకు కేటాయిస్తే తామంతా బలపరుస్తామని తెలిపారు. పార్టీలో కార్యకర్తలకే విలువ, గ్యారెంటీ లేదు ప్రజలకు ఏమి గ్యారెంటీ ఇస్తారని నిలదీశారు. అసమ్మతి అంశం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.