
సర్వీసు రోడ్డు ఏర్పాటు చేయకుంటే ఆందోళనలు ఉధృతం
బద్వేలు అర్బన్ : ఎన్‌హెచ్–67 రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా గుంతపల్లె గ్రామ సమీపంలో నిర్మించిన ఫ్లైఓవర్ కింది భాగంలో ఎన్‌హెచ్ అధికారులు, కాంట్రాక్టర్లు ఇచ్చిన హామీ మేరకు తక్షణమే సర్వీసు రోడ్డు ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో సమీప గ్రామ ప్రజలను కలుపుకుని ఆందోళనలను ఉధృతం చేస్తామని సోమవారం గుంతపల్లె గ్రామస్తులు, సమీప గ్రామాల రైతులు ఫ్లైఓవర్ సమీపంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు డి.ప్రసాద్, రామచంద్రయ్య మాట్లాడుతూ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా గ్రామ సమీపంలో ఫ్లైఓవర్ నిర్మాణం మొదలు పెట్టిన సమయంలో రైతులతో కలిసి ఆందోళన నిర్వహిస్తే ఫ్లైఓవర్ పూర్తి కాగానే సర్వీసు రోడ్డు ఏర్పాటు చేస్తామని చెప్పిన నేషనల్ హైవే అధికారులు, కాంట్రాక్టర్లు ఫ్లైఓవర్ పూర్తయ్యే సమయానికి సర్వీసు రోడ్డు విషయం మా చేతుల్లో లేదని చేతులెత్తేయడం దారుణమన్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి సర్వీసు రోడ్డు ఏర్పాటు చేయించేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు.