
సేల్ రిజిస్ట్రేషన్లకు నిబంధనాలు
సాక్షి టాస్క్‌ఫోర్స్: జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసిన, చేయాలని ఆసక్తి ఉన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(ఏపీఐఐసీ) నిబంధనలు ముందరి కాళ్లకు బంధం వేస్తున్నాయి. ఏపీఐఐసీ వివిధ చోట్ల ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసి నిర్ణీత ధరకు ప్లాట్లు విక్రయిస్తుంది. కడపలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్, కొప్పర్తి పారిశ్రామికవాడలో ఫేజ్–1, ఎంఎస్‌ఈ–సీడీపీ, మైదుకూరు, ప్రొద్దుటూరు, రాజంపేట, ఎర్రగుంట్ల తదితర ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయి. ప్లాట్లు కేటాయించే క్రమంలో సేల్ అగ్రిమెంట్ చేసిన ఏపీఐఐసీ అధికారులు.. పరిశ్రమలు నెలకొల్పిన తర్వాత సేల్ డీడ్ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కార్మికులకు పీఎఫ్, ఈఎస్‌ఐ చెల్లిస్తేనే సేల్ రిజిస్ట్రేషన్ చేస్తామని సేల్ అగ్రిమెంట్‌లో ఎక్కడా లేకపోయినా.. ఏపీఐఐసీ అధికారులు కావాలనే మొండికేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలో ఒక్కటంటే ఒక్కటి కూడా.. సేల్ డీడ్ కాలేదంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
నిబంధనలన్నీ పారిశ్రామికవేత్తలకేనా..
ఏపీఐఐసీకి వర్తించవా?
నీరు, కరెంటు, రోడ్లు, కాలువలు వంటి వసతులు కల్పించకుండానే ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతున్న ఏపీఐఐసీ అధికారులు.. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పరిశ్రమలు స్థాపిస్తున్న వారిపై కఠిన వైఖరి అవలంబిస్తున్నట్లు విమర్శలున్నాయి. అన్ని రకాల అనుమతులు పొంది పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని.. ‘అయ్యా మాకు సేల్ డీడ్ చేసివ్వండి’ అని కోరుతున్న వారికి అధికారులు పగలే చుక్కలు చూపిస్తున్నారు. వారికి ఎక్కడ లేని నిబంధనలు పెడుతూ నెలల తరబడి సేల్‌డీడ్ చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ‘మీరు మొదట డీపీఆర్‌లో ఎంత మందికి ఎంప్లాయిమెంట్ కల్పిస్తామన్నారు.. వారందరికీ కల్పించారా.. కార్మికులకు పీఎఫ్, ఈఎస్‌ఐ చేశారా.. ఫ్యాక్టరీ లైసెన్స్ తీసుకున్నారా.. మీకు ఇచ్చిన భూమిలో 90 శాతం భూమిని వినియోగించారా(అందుకు తగిన ధ్రువీకరణ పత్రం సమర్పించాలి).. ఇది లేదు, అదిలేదు.. అంటూ నానా కొర్రీలు వేస్తూ సేల్ డీడ్ చేయకుండా నెలలు, సంవత్సరాలు జాప్యం చేస్తున్నట్లు సమాచారం. అమ్యామ్యాల కోసమే వీరు ఇదంతా చేస్తున్నారని పారిశ్రామికవేత్తలు వాపోతున్నారు.
ఫ్యాక్టరీస్ యాక్టు పరిధిలోకి రాకపోయినా..
20 కంటే తక్కువ మంది కార్మికులు పని చేస్తున్న పరిశ్రమలు, 30 హెచ్‌పీ కంటే తక్కువ కరెంటు వినియోగిస్తున్న సూక్ష్మ, చిన్న పరిశ్రమలు ఫ్యాక్టరీస్ యాక్టు పరిధిలోకి రావు. వీరి వద్ద పర్మినెంట్ కార్మికులెవరూ పని చేసే అవకాశం ఉండదు. రోజు వారీ కూలీలు మాత్రమే పని చేస్తుంటారు.. వాళ్లలో కొంత మంది ఒక రోజు వస్తే మరొక రోజు రారు. కొందరు నెల, రెండు నెలలు పని చేసి వెళ్లిపోతుంటారు. వీరికి పీఎఫ్, ఈఎస్‌ఐ కూడా చెల్లించడం కష్టతరంగా మారుతోంది. కానీ ఏపీఐఐసీ అధికారులు మాత్రం ప్రతి ఒక్కరూ ఫ్యాక్టరీ లైసెన్స్ తీసుకోవాలి, కార్మికులకు ఫీఎఫ్, ఈఎస్‌ఐ చెల్లించాలనే నిబంధనలు విధిస్తున్నారు. సేల్ అగ్రిమెంట్‌లో లేకపోయినా అధికారులు ఎందుకు పట్టుబడుతున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
● వారి తప్పులు.. వీరికి శాపాలు
‘పరిశ్రమలు పెట్టేందుకు ఔత్సాహిక పారిశ్రామిక
వేత్తలు ముందుకు రండి.. కొనుగోలు చేసే భూముల్లో రాయితీలు ఇస్తాం.. పరిశ్రమలు పెట్టిన తర్వాత ప్రోత్సాహకాలు అందిస్తాం.. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటే వడ్డీ రాయితీ కల్పిస్తాం’ అని ఊదరగొట్టి, కల్లబొల్లి మాటలు చెప్పే ప్రభుత్వాలు.. పరిశ్రమలు పెట్టిన వారిని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాయి. ఇటు ఏపీఐఐసీ, అటు పరిశ్రమల శాఖ అధికారుల వైఖరి వల్ల పారిశ్రామికవేత్తలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
అడ్డుగా మారిన ఏపీఐఐసీ నిబంధనలు
సేల్ అగ్రిమెంట్‌లో లేకపోయినాపీఎఫ్, ఈఎస్‌ఐ కోసం పట్టు
కార్యాలయం చుట్టూ పారిశ్రామికవేత్తల ప్రదక్షిణలు
నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు..ప్రభుత్వ ఆదాయానికి గండి
ఎంఎస్‌ఎంఈ మంత్రి దృష్టికి తీసుకెళ్లిన అసోషియేషన్ల ప్రతినిధులు
మంత్రి నుంచి కరువైన స్పష్టమైన హామీ
అధిక శాతం పారిశ్రామికవేత్తలు పరిశ్రమల ఏర్పాటుపై వారికి తగిన పరిజ్ఞానం ఉన్నప్పటికీ.. డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) కోసం చార్టెడ్ అకౌంటెంట్లను ఆశ్రయిస్తున్నారు. ఇక్కడే తప్పులు జరుగు తున్నాయి. అన్ని రకాల యూనిట్లకు పేర్లు, విషయం(సబ్జెక్ట్) మార్చి కాపీ, పేస్ట్ చేయడం వల్ల అన్ని పరిశ్రమలకు కార్మికుల సంఖ్యను గుడ్డిగా నమోదు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది సరిచూసుకోలేని వారు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ‘డీపీఆర్‌లో మీరు ఇంత మందికి ఎంప్లాయిమెంట్ చూపారు కదా.. వారందరికీ పీఎఫ్, ఈఎస్‌ఐ చెల్లించండి’ అంటూ ఏపీఐఐసీ అఽధికారులు మెలిక పెడుతున్నట్లు సమాచారం. దీంతో ఏం చేయాలో తెలియక పారిశ్రామికవేత్తలు తల పట్టుకుంటున్నారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో ఆటోమేటిక్ మెషీన్లు వచ్చినందున ఎక్కువ మంది కార్మికులతో పెద్దగా అవసరముండదు. సూక్ష్మ, చిన్న స్థాయి పరిశ్రమలకు ఇంత మంది కార్మికులతో ఏం అవసరమని ఆలోచన చేయని అధికారులది కూడా ఇందులో తప్పుంది. ఏ పరిశ్రమలో ఎంత మంది కార్మికులు పని చేస్తున్నారో ఆయా పరిశ్రమల యాజమాన్యాల నుంచి అఫిడవిట్ తీసుకొని సేల్ డీడ్ చేయవచ్చని కొందరు అధికారులు చెబుతున్నారు. దీనిపై ఇటీవల జిల్లా పర్యటనకు విచ్చేసిన ఎంఎస్‌ఎంఈ, సెర్ఫ్ శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ దృష్టికి పారిశ్రామికవేత్తలు, అసోసియేషన్ల ప్రతినిధులు తీసుకుపోయినట్లు సమాచారం. అయితే దానిపై ఆయన్నుంచి స్పష్టమైన హామీ లభించనప్పటికీ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతానని చెప్పినట్లు తెలుస్తోంది.