
హరి హర అభేద క్షేత్రం పుష్పగిరి
వల్లూరు : జిల్లాలోని ప్రఖ్యాతి గాంచిన పుణ్య క్షేత్రాలలో పుష్పగిరి ఒకటి. వల్లూరు మండలంలో వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రమైన పుష్పగిరి చారిత్రాత్మకంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. శివ స్వరూపుడైన వైద్యనాథేశ్వరునికి, విష్ణు స్వరూపుడైన చెన్న కేశవునికి నిలయమైన ఈ క్షేత్రం హరి హర క్షేత్రమై శివ కేశవుల మధ్య అభేదానికి ప్రతీకగా నిలుస్తోంది. భాస్కర క్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన పుష్పగిరిలోని వైద్యనాథ స్వామి ఆలయాన్ని చోళుల కాలంలోను, చెన్నకేశవ స్వామి ఆలయాన్ని చాళుక్యుల కాలంలోనూ నిర్మించారని చరిత్రకారుల అభిప్రాయం.
శివ కేశవులకు 9 రోజులపాటు బ్రహ్మోత్సవాలు..
సాధారణంగా శైవ క్షేత్రాలలో ఐదు రోజులు , విష్ణు క్షేత్రాలలో తొమ్మిది రోజులు బ్రహ్మోత్సవాలను నిర్వహించడం పరిపాటి. కానీ పుష్పగిరిలో శివ కేశవులిద్దరికీ 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ప్రతి కార్యక్రమంలోనూ సాక్షాత్తూ శ్రీరామ చంద్రునిచే పూజలందుకున్న శ్రీ కామాక్షీ వైద్యనాఽథ స్వామికి ముందుగా పూజలు నిర్వహించి, అనంతరం శ్రీ లక్ష్మీ చెన్నకేశవునికి పూజలు నిర్వహిస్తారు. ప్రతి రోజూ రాత్రి మొదట వైద్యనాథస్వామికి, అనంతరం శ్రీ చెన్న కేశవ స్వామికి వాహన సేవలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలలో 29 వ తేదీన జరిగే చందనోత్సవానికి, 30 న అక్షయ తదియలో భాగంగా జరిగే గరుడవాహన సేవకు, మే 1 న జరిగే రెండు కల్యాణోత్సవాలకు, 2 న జరిగే రెండు రథోత్సవాలకు, బ్రహ్మోత్సవాల ముగింపు రోజైన 4 వ తేదీన జరిగే చక్రస్నానం, పుష్పయాగాలకు అత్యంత పాధాన్యత ఉంది. భారీ సంఖ్యలో భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలి వస్తారు.
ఈ నెల 29న చందనోత్సవం,
30న అక్షయ తదియ ,
మే 1 న కల్యాణోత్సవాలు, 2 న రథోత్సవాలు, 4 న చక్రస్నానం, పుష్పయాగం

హరి హర అభేద క్షేత్రం పుష్పగిరి

హరి హర అభేద క్షేత్రం పుష్పగిరి