సాక్షి, చెన్నై: మెర్శల్ చిత్రాని కి మద్రాసు హై కోర్టులో ఊరట లభించింది. దీంతో విజయ్ అభిమానులు ఉత్సాహంతో పండగ చేసుకుంటున్నా రు. విజయ్ నటిస్తున్న తాజా చిత్రం మెర్శల్. సమంత, కాజల్‌అగర్వాల్, నిత్యామీనన్ ముగ్గురు ముద్దుగుమ్మలు కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని అట్లీ దర్శకత్వంలో శ్రీ తేనాండళ్ ఫిలింస్ సంస్థ భారీ ఎత్తున నిర్మించింది. ఇది ఈ సంస్థకు వందో చిత్రం అన్నది గమనార్హం. ఏఆర్.రెహమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం దీపావళికి విడుదలకు ముస్తాబవుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో చెన్నైకి చెందిన రాజేంద్రన్ అనే నిర్మాత మెర్శల్ చిత్రంపై నిషేధం కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో తాను మెర్శలాయిటేన్ అనే టైటిల్‌ను 2014లోనే రిజిస్టర్ చేశానని, ఆ పేరుతో చిత్రాన్ని నిర్మిస్తున్నానని, కాగా మెర్శల్ అనే టైటిల్‌తో విజయ్ హీరోగా శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ చిత్రం చేస్తోందని పేర్కొన్నారు. దీంతో తన చిత్రం మెర్శలాయిటేన్ వ్యాపార పరంగా బాధింపునకు గురవుతుందని, అందువల్ల విజయ్ చిత్ర టైటిల్ మెర్శల్‌పై నిషేధం విధించాలని కోరారు.
ఈ పిటిషన్ విచారణకు స్వీరించిన న్యాయస్థానం ఈ నెల 6వ తేదీ వరకూ విజయ్ చిత్రానికి మెర్శల్ టైటిల్‌ను ఉపయోగించరాదని స్టే ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం ఈ కేసు విచారణకు రాగా నిర్మాత రాజేంద్రన్ పిటిషన్ను కొట్టివేస్తూ, మెర్శల్ టైటిల్‌పై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. దీంతో మెర్శల్ చిత్ర దర్శక నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే విజయ్ చిత్రం మెర్శల్ యూ ట్యూబ్, సోషల్ మీడియా అంటూ విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. హైకోర్టు తీర్పుతో విజయ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment