సాక్షి, చెన్నై : మెర్సల్ సినిమా మేకర్లకు పెద్ద ఊరట లభించింది. ఈ చిత్రాన్ని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. చిత్రంలో ప్రభుత్వాన్ని కించపరిచేలా డైలాగులు ఉన్నాయని.. ఈ చిత్రాన్ని నిషేధించాలంటూ ఓ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.
శుక్రవారం ఆ పిటిషన్ బెంచ్ ముందుకు రాగా.. దానిని కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. మెర్సల్ అనేది ఓ చిత్రం కల్పితగాథేనని.. నిజ జీవితం కాదని ఈ సందర్భంగా న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇది సమాజంపై ప్రభావం చూపుతుందనటం అర్థరహితమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధూమపానం, మద్యపానం హనికరమంటూ ప్రకటనలు జారీ చేసే చిత్రాలకంటే మెర్సల్ అంత ప్రమాదకరమైందా అంటూ న్యాయమూర్తి పిటిషనర తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. సినిమా నచ్చకపోతే చూడకండి.. అంతేగానీ ఇలా పిటిషన్లతో సమయాన్ని వృథా చేయకండి అంటూ మండిపడ్డారు. వివాదాలతో సినిమాకు ఫ్రీ పబ్లిసిటి లభించిందని జడ్జి వ్యాఖ్యానించారు.
భావ ప్రకటన అనే స్వేచ్ఛ ప్రతీ ఒక్కరికీ ఉంటుందని ఆయన పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టేశారు. అసత్య డైలాగులతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ అశ్వథామన్ అనే న్యాయవాది మెర్సల్ సెన్సార్ షిఫ్‌ను రద్దు చేయాలంటూ సోమవారం పిల్ దాఖలు చేశారు కూడా. ఇదిలా ఉండగా సినిమాలో డైలాగులు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ కొన్ని హిందుత్వ సంఘాలు రోడెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment