
సాక్షి, చెన్నై: విజయ్ హీరోగా తెరకెక్కిన 'మెర్శల్' సినిమాను వివాదాలు వీడటం లేదు. తాజాగా ఈ సినిమాకు కేంద్ర ఫిలిం సర్టిఫికేషన్ బోర్డు (సీబీఎఫ్‌సీ) జారీచేసిన సెన్సార్ సర్టిఫికేట్‌ను రద్దు చేయాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆర్థికరంగం గురించి తప్పుడు ప్రచారం చేస్తూ దేశాన్ని కించపరిచేలా ఈ సినిమాలో చూపించారని, అంతేకాకుండా ఇటీవల ప్రవేశపెట్టిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) గురించి తప్పుడు వ్యాఖ్యలను చేశారని పిటిషనర్ అశ్వత్థామన్ పేర్కొన్నారు.
ఈ సినిమా విడుదలకు సీబీఎఫ్‌సీ ఎలా అనుమతి ఇచ్చిందంటూ ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తంచేశారు. సినిమా నిండా దేశం గురించి తప్పుడు ప్రచారం ఉందని, జీఎస్టీని అపార్థం చేసుకునేలా ఫేక్ డైలాగులు, తప్పుడు సీన్లు సినిమాలో ఉన్నాయని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. జీఎస్టీ గురించి డైలాగులు చెప్పాల్సిన అవసరం సినిమాలో లేకపోయినా.. ఉద్దేశపూరితంగానే వాటిని పెట్టారని ఆరోపించారు. ఈ సినిమాలోని డైలాగులు చూసి యువత పెడదోవ పట్టే అవకాశముందని, ఇలాంటి సినిమాలకు సీబీఎఫ్‌సీ అనుమతి ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు.