సాక్షి, చెన్నై : ఇప్పటికే వివాదాలు ఎదుర్కొంటున్న తమిళ హీరో విజయ్ తాజా చిత్రం మెర్శల్‌పై బీజేపీ కన్నెర చేస్తోంది. విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మెర్శల్. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మించింది. పలు ఆటంకాలను ఎదురొడ్డి ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్రం ప్రజాదరణ అందుకుంటున్నా, మరోపక్క రాజకీయవాదుల ఆగ్రహానికి గురవుతోంది. ముఖ్యంగా బీజేపీ నాయకులు మెర్శల్ చిత్రంపై దండెత్తుతున్నారు. ప్రభుత్వ ఉచిత వైద్యంపై ఒత్తిడి తెచ్చే విధంగా మెర్శల్ చిత్ర తుది ఘట్ట సన్నివేశాల్లో ఆ చిత్ర కథానాయకుడు విజయ్ సింగపూర్ లాంటి దేశాల్లో 7 శాతం జీఎస్టీ విధించి ప్రభుత్వం ఉచిత వైద్యాన్ని అందిస్తోందని, మన దేశంలో 28 శాతం జీఎస్టీ పన్ను విధానాన్ని అమలు పరచి ఉచిత వైద్యాన్ని అందించలేకపోతోందని ఆవేశంగా చెప్పే సంభాషణలకు ప్రేక్షకులనుంచి విశేష ఆదరణ లభిస్తోంది.అదే విధంగా పెద్ద నోట్ల రద్దు విధానాన్ని ప్రస్తావించారు. దీంతో మెర్శల్ చిత్రంలో జీఎసీ, పెద్ద నోట్ల రద్దు విధానాలను వ్యతిరేకించేలా సన్నివేశాలు చోటు చేసుకోవడం బీజీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.
రాష్ట బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందర్‌రాజన్ మెర్శల్ చిత్రంలోని జీఎస్టీ పన్ను, పెద్దనోట్ల రద్దుకు సంబంధించిన సన్నివేశాన్ని తొలగించాలని డిమండ్ చేశారు. తాజాగా కేంద్రమంత్రి పొన్‌రాధాకృష్ణన్ మెర్శల్ చిత్రంపై తీవ్రంగా ఖండన తెలిపారు. మెర్శల్ చిత్రంలో ఆ సన్నివేశాలను వెంటనే తొలగించాలన్నది తన అభిప్రాయం అని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్య తప్పుడు సమాచారాన్ని తీసుకెళ్లడం శ్రేయస్కరం కాదని హితవు పలికారు. అలాగే ప్రముఖ నటుడు కమలహాసన్‌పైనా విమర్శలు సంధించారు. పెద్ద నోట్ల రద్దును మొదట స్వాగతించిన కమలహాసన్ ఇప్పుడు అందుకు బహిరంగ క్షమాపణ కోరుతున్నట్లు పేర్కొనట్లు తెలిసిందని, ఆయన ఏ విషయాన్నైనా పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. ముందు అనాలోచనతో వ్యాఖ్యలు చేసి ఆ తరువాత రాజకీయ కోణంలో వెనక్కు తీసుకోవడం నాగరికత కాదన్నారు. మెర్శల్ చిత్ర నిర్మాత వివాదాస్పదమైన ఆ సన్నివేశాలను చిత్రం నుంచి తొలగించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment