Jhunjhunwala
-
ఇంటి నుంచి చూస్తే సముద్రం కనిపించాలి.. ఏదీ అడ్డు రాకూడదని..
బిలియనీర్ స్టాక్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలా తన కొత్త ఇంటి నుంచి అరేబియా సముద్రం వీక్షించడానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేదుకు రూ.118 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో భాగంగానే దక్షిణ ముంబైలోని మలబార్ హిల్‌లో వాకేశ్వర్ రోడ్‌లోని ప్లాట్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. రేఖా ఝున్‌ఝున్‌వాలా దక్షిణ ముంబైలోని మలబార్ హిల్‌లో ఖరీదైన వల్కేశ్వర్ రోడ్‌లోని ఒక విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను రూ. 11.76 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది రెసిడెన్షియల్ టవర్ రాక్‌సైడ్ అపార్ట్మెంట్స్లోని మూడవ అంతస్తులో 1,666 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాలో విస్తరించి ఉంది. అయితే ఇది సముద్రానికి ఎదురుగా ఉన్న రాక్‌సైడ్ సీహెచ్ఎస్ వెనుక ఉంది. దక్షిణ ముంబైలోని వాకేశ్వర్ రోడ్లో ఉన్న సుమారు 50 ఏళ్లు పైబడిన రాక్ సైడ్ అపార్ట్మెంట్స్ సహా మరో 6 బిల్డింగ్‌లను క్లస్టర్ స్కీమ్ కింద పునర్నిర్మించేందుకు నిర్ణయించారు. దీనికి సంబంధించి ఓ ప్రతిపాదిక కూడా వెలుగులోకి వచ్చింది. అనుకున్న విధంగా ఈ భవనాల నిర్మాణం పూర్తయితే.. అరేబియా సముద్రాన్ని చూడటానికి కొంత ఇబ్బంది కలుగుతుంది. అరేబియా సముద్ర వీక్షణ కోసం రేఖా ఝున్‌ఝున్‌వాలా 2023 నవంబర్ నుంచి వివిధ డీలర్ల నుంచి తొమ్మిది అపార్ట్మెంట్లను రూ.118 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ భవనంలోని 24 అపార్ట్మెంట్లలో 19 అపార్ట్మెంట్లను ఆమె కుటుంబానికి చెందిన వ్యక్తులు కొనుగోలు చేసినట్లు సమాచారం. -
గెలుపు దారి: దుఃఖనది దాటి గెలిచారు
రోహిక మిస్త్రీ, రేఖా ఝున్ఝున్వాలాల మధ్య ఉన్న ప్రధాన సారూప్యత ఏమిటంటే... ఇద్దరూ పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని నిలబడ్డారు. తడబడకుండా ధైర్యంగా అడుగు ముందుకు వేశారు. తమ తెలివితేటలు, కార్యదక్షతతో విజయపరంపరను ముందుకు తీసుకు వెళుతున్నారు. తాజాగా ఫోర్బ్స్ వరల్డ్స్ బిలియనీర్స్ జాబితాలో మన దేశం నుంచి చోటు సంపాదించిన న్యూకమర్స్లో ఈ ఇద్దరూ ఉన్నారు... సైరస్ మిస్త్రీ పరిచయం అక్కరలేని పేరు. లండన్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ చేసిన మిస్త్రీ ఆతరువాత కుటుంబవ్యాపారంలోకి వచ్చాడు. 2012లో టాటా గ్రూప్ ఛైర్మన్ అయ్యాడు. మిస్త్రీ జీవితంలో జయాపజయాలు ఉన్నాయి. ‘నిర్దేశిత లక్ష్యాల విషయంలో మిస్త్రీ విఫలమయ్యాడు’ అంటూ కొద్దికాలానికి ఛైర్మన్ పదవి నుంచి మిస్త్రీకి ఉద్వాసన పలికింది టాటా గ్రూప్. న్యాయపోరాటం సంగతి ఎలా ఉన్నా మిస్త్రీ ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో భర్తకు అండగా నిలబడి ఎంతో శక్తిని ఇచ్చింది రోహిక. ప్రచారానికి దూరంగా ఉండే రోహిక గురించి బయట పెద్దగా ఎవరికి తెలియదు. అయితే భర్త నోటి నుంచి ‘రోహిక’ పేరు వినిపించేది. దిగ్గజ న్యాయవాది ఇక్బాల్ చాగ్లా కుమార్తె అయిన రోహిక కొన్ని ప్రైవెట్, పబ్లిక్ కంపెనీలలో డైరెక్టర్‌గా పనిచేసింది. ఒకసారి రోహికను క్లెమెన్టైన్ స్పెన్సర్ చర్చిల్తో పోల్చాడు సైరస్ మిస్త్రీ. చర్చిల్ భార్య అయిన క్లెమెన్టైన్ ధైర్యశాలి. ముందుచూపు ఉన్న వ్యక్తి. భర్తకు ఎన్నో సందర్భాలలో అండగా నిలబడి ధైర్యాన్ని ఇచ్చింది. తప్పులను సున్నితంగా ఎత్తి చూపింది. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం తన నైజం. వర్క్–ఫ్యామిలీ లైఫ్‌లో సమన్వయాన్ని కోల్పోతున్న మిస్త్రీని దారిలోకి తెచ్చింది రోహిక. ‘సమస్యలు ఉన్నాయని సరదాలు వద్దనుకుంటే ఎలా!’ అంటూ భర్తను విహారయాత్రలకు తీసుకెళ్లేది. ఆ యాత్రలలో వ్యాపార విషయాలు అనేవి చివరి పంక్తిలో మాత్రమే ఉండేవి. 54 ఏళ్ల వయసులో సైరస్ మిస్త్రీ ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు. రోహికకు ఊహించిన షాక్! దుఃఖసముద్రంలో మునిగిపోయిన రోహిక తనకు తాను ధైర్యం చెప్పుకొని ఒడ్డుకు వచ్చింది. మైదానంలో అడుగు పెట్టి ఆట మొదలు పెట్టింది. ‘నువ్వే నా ధైర్యం’ అనేవాడు రోహికను ఉద్దేశించి మిస్త్రీ. భర్త జ్ఞాపకాలనే ధైర్యం చేసుకొని, శక్తిగా మలచుకొని ముందుకు కదిలింది రోహిక. ‘మిస్త్రీల శకం ముగిసింది’ అనుకునే సందర్భంలో ‘నేనున్నాను’ అంటూ వచ్చి గెలుపు జెండా ఎగరేసింది రోహిక మిస్త్రీ. స్టాక్ మార్కెట్ చరిత్రలో ‘స్టార్’గా మెరిశాడు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా. పెట్టుబడి పాఠాల ఘనాపాఠీ రాకేష్‌కు భార్య ఎన్నో పాఠాలు చెప్పింది. అవి ఆరోగ్య పాఠాలు కావచ్చు. ఆత్మీయ పాఠాలు కావచ్చు. రేసులకు వెళ్లి ఏ అర్ధరాత్రో ఇంటికి వచ్చే భర్తను ఆ అలవాటు మానిపించింది. సిగరెటు అలవాటును దూరం చేసింది. ఆరోగ్యకరమైన జీవనశైలి దిశగా భర్తను అడుగులు వేయించింది. తన పేరు, భార్య పేరులోని కొన్ని ఆంగ్ల అక్షరాలతో తన స్టాక్ బ్రోకింగ్ కంపెనీకి ‘రేర్’ అని పేరు పెట్టాడు రాకేశ్. భర్త హఠాన్మరణం రేఖను కుంగదీసింది. చుట్టూ అలముకున్న దట్టమైన చీకట్లో వెలుగు రేఖ కరువైంది. అలాంటి దురదృష్టపు రోజుల్లో వేధించే జ్ఞాపకాలను పక్కనపెట్టి వెలుగు దారిలోకి వచ్చింది రేఖ. ‘ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు’ అనే సామెత ఉంది. అది నిజమో కాదో తెలియదుగానీ ‘యూనివర్శిటీ ఆఫ్ ముంబై’లో చదువుకున్న రేఖ భర్త రాకేశ్‌లో ఒక విశ్వవిద్యాలయాన్ని దర్శించింది. అక్కడ ఎన్నో పాఠాలు నేర్చుకుంది. భర్త బాటలోనే ఇన్వెస్టర్‌గా, ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఘనమైన విజయాలు సాధిస్తోంది రేఖ ఝున్‌ఝున్‌వాలా. -
Rekha Jhunjhunwala: రెండు స్టాక్‌ల నుండి రూ. 650 కోట్లు
ఇండియన్ స్టాక్ మార్కెట్ బిగ్ బుల్గా పేరొందిన రాకేష్ ఝున్‌జున్‌వాలా భార్య రేఖా ఝున్‌జున్‌వాలా కూడా స్టాక్ మార్కెట్లో చాలా వర్క్ చేస్తోంది. ఆమె మొత్తం ఆస్తులు ఇప్పుడు రూ. 650 కోట్లకు పెరిగాయి. రేఖా సంపద పెరగడానికి ప్రధాన కారణం ఆమె పోర్ట్‌ఫోలియోలో ఉన్న రెండు స్టాక్‌లు భారీగా వృద్ధి చెందటమే. గత నెలలో రేఖా ఝున్‌జున్‌వాలా మెట్రో బ్రాండ్స్, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ షేర్లలో విపరీతమైన పెరుగుదల నమోదైంది. గత కొన్ని సెషన్లలో దలాల్ స్ట్రీట్ అండ్ గ్లోబల్ మార్కెట్లో ట్రెండ్ రివర్సల్ తరువాత లార్జ్ క్యాప్, మిడ్-క్యాప్ స్టాక్‌లు బలమైన పనితీరును కనబరిచాయి. నిజానికి 2023 ఫిబ్రవరి 2న టైటాన్ కంపెనీ షేరు ధర రూ.2310 నుంచి రూ.2535కి పెరిగింది. ఈ విధంగా కేవలం రెండు వారాల్లోనే ఈ షేర్ ధర రూ.225 మేర పెరిగింది. డిసెంబర్ 2021లో లిస్టింగ్ అయిన తర్వాత, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు చెందిన రేఖ జున్‌జున్‌వాలా భర్త రాకేష్ జున్‌జున్‌వాలా కంపెనీలో 10,07,53,935 షేర్లు లేదా 17.50 శాతం వాటాను కలిగి ఉన్నారు. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా మరణం తర్వాత, ఈ షేర్లు అతని భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలాకు చేరాయి. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో రేఖ 10,07,53,935 షేర్లను కలిగి ఉంది. అదే విధంగా 2022 అక్టోబర్ నుండి డిసెంబర్ త్రైమాసికంలో మెట్రో బ్రాండ్లలో 3,91,53,600 షేర్లను కలిగి ఉన్నారు. -
Rekha Jhunjhunwala: నాలుగు గంటల్లో రూ.482 కోట్లు..
నాలుగు గంటల్లో రూ.482 కోట్లు ఆర్జించి రికార్డ్ సృష్టించారు రేఖా ఝున్‌ఝున్‌వాలా. ఆమె దివంగత ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా సతీమణి. దేశంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరు. ఆమె భర్త కూడా ప్రీ-ఐపీఓ కాలం నుంచి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో పెట్టుబడి పెట్టారు. గతేడాది ఆయన మరణానంతరం స్టార్ హెల్త్‌తో సహా ఆయనకు సంబంధించిన అన్ని షేర్లు రేఖకు బదిలీ అయ్యాయి. స్టార్ హెల్త్ షేరు ధర సోమవారం (ఫిబ్రవరి 20) మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో ఇన్ట్రా డే గరిష్ట స్థాయి రూ.556.95ను తాకింది. దీంతో ట్రేడింగ్ ప్రారంభమైన నాలుగు గంటల్లోనే ఇన్ట్రాడేలో ఒక్కో ఈక్విటీ షేర్ రూ.47.90 పెరిగింది. స్టార్ హెల్త్ షేర్ ధర పెరగడంతో రేఖా ఝున్‌ఝున్‌వాలా దాదాపు రూ. 482 కోట్లు ఆర్జించారు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్టయిన తర్వాత రాకేష్ జున్‌జున్‌వాలా రెండింటిలోనూ 10,07,53,935 స్టార్ హెల్త్ షేర్లను కలిగి ఉండేవారు. ఇది కంపెనీ మొత్తం చెల్లింపు మూలధనంలో 17.50 శాతం. ఆ షేర్లన్నీ ఇప్పుడు రేఖా ఝున్‌జున్‌వాలా సొంతమయ్యాయి. ఒక్కో షేరుకు రూ.47.90 పెరగడం ద్వారా ఆమె రూ.482 కోట్ల భారీ మొత్తం ఆర్జించిన్లయింది. టాటా కంపెనీలో పెట్టుబడులు పెట్టి ఆమె ఇటీవల రెండు వారాల్లోనే రూ.1000 కోట్లు సంపాదించారు. రేఖా ఝున్‌జున్‌వాలా నికర ఆస్తి విలువ రూ. 47,650 కోట్లుగా అంచనా. (ఇదీ చదవండి: తెలిసిన జాక్‌మా జాడ! ఎక్కడ ఉన్నాడంటే..) -
ఝన్‌ఝన్‌వాలా జాక్‌పాట్:టైటన్ మెరిసెన్
న్యూఢిల్లీ: ఆభరణాలు, వాచ్‌లు, కళ్లద్దాలు తదితర వేరబుల్ ఉత్పత్తుల విక్రయంలోని ప్రముఖ కంపెనీ టైటాన్ జూన్ త్రైమాసికంలో పనితీరు పరంగా మెప్పించింది.దేశంలోని అతిపెద్ద బ్రాండెడ్ ఆభరణాల తయారీదారు అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే లాభం 13 రెట్లు పెరిగి రూ.790 కోట్లుగా నమోదైంది. ఆదాయం కూడా మూడు రెట్ల వృద్ధితో రూ.9,487 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో లాభం రూ.18 కోట్లు, ఆదాయం రూ.3,519 కోట్ల చొప్పున ఉన్నాయి. జ్యుయలరీ విభాగం ఆదాయం రూ.8,351 కోట్లుగా ఉంది. ఇది అంతక్రితం ఏడాది ఇదే కాలానికి రూ.3,050 కోట్లుగా ఉంది. వాచ్‌లు, వేరబుల్ కేటగిరీ ఆదాయం రూ.293 కోట్ల నుంచి రూ.786 కోట్లకు వృద్ధి చెందింది. కళ్లద్దాల విభాగం నుంచి ఆదాయం రూ.183 కోట్లకు పెరిగింది. అంతక్రితం రెండు ఆర్థిక సంవత్సరాల్లోనూ మొదటి త్రైమాసికంపై కరోనా మహమ్మారి ప్రభావం ఉందని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌లో సాధారణ వ్యాపార కార్యకలాపాలు ఉండడం మెరుగైన పనితీరుకు దోహదపడినట్టు కంపెనీ తెలిపింది. కాగా Trendlyne ప్రకారం, జూన్ 30 నాటికి ఝన్‌ఝన్‌వాలా, ఆయన భార్య రేఖ టైటాన్ ఎన్ఎస్ఇలో 0.38 శాతం 5.05 శాతం వాటాను కలిగి ఉన్నారు, దీని విలువ శుక్రవారం నాటికి రూ. 10,937 కోట్లు కావడం విశేషం. -
బిగ్బుల్ వాటాను తగ్గించుకున్న షేరు ఇదే..!
భారత స్టాక్‌మార్కెట్ బిగ్బుల్, ఏస్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా అతని సతీమణి రేఖా ఝున్‌ఝున్‌వాలాలు తొలి త్రైమాసికంలో అగ్రోటెక్ ఫుడ్స్ షేర్లలో వాటాను తగ్గించుకున్నారు. మార్చి 31 నాటికి ఈ ఇద్దరికి అగ్రోటెక్‌లో 5.75శాతం వాటా ఉండేది. ఈ తొలి త్రైమాసికంలో వారిద్దరూ 1.46లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించడంతో మొత్తం వాటా 5.14శాతానికి దిగివచ్చినట్లు ఎక్చ్సేంజ్‌లు చెబుతున్నాయి. అదేబాటలో ఎఫ్‌ఫీఐలు కూడా... ఇదే కంపెనీలో విదేశీ ఇన్వెస్టర్లు సైతం వాటాలను తగ్గించుకున్నాయి. మార్చి 31లో 8.58శాతంగా ఉన్న ఎఫ్‌పీఐ వాటా... 2020 క్యూ1 నాటికి 8.48 శాతానికి చేరుకుంది. కోచి ఆధారిత ఇన్వెస్టర్ ఈక్యూ ఇండియా మ్యూచువల్ ఫండ్ ఈకంపెనీలో ఎలాంటి క్రయ, విక్రయాలు జరపలేదు. అలాగే ఏ మ్యూచువల్ ఫండ్ కూడా ఈ క్యూ1లో ఎలాంటి అమ్మకాలుగానీ కొనుగోళ్లు గానీ జరపలేదు. -
మార్కెట్ క్రాష్: ఝన్‌ఝన్ వాలా నష్టం ఎంత?
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్ల పతనం పెట్టుబడుదారులను తీవ్ర నష్టాల్లోకి నెట్టేసింది. ముఖ్యంగా ఇండియన్ వారెన్ బఫెట్, ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝన్‌ఝన్‌వాలాకు భారీ షాక్ తగిలింది. మిడ్ క్యాప్ హోల్డింగ్స్ లో దాదాపు 75శాతం ఆవిరైపోయింది. ముఖ్యంగా గత నాలుగు సంవత్సరాలుగా నిలకడగా మిడ్ క్యాప్ షేర్లు ఇటీవల వరుస పతనంతో భారీ నష్టపోయాయి. దీంతో ఆయన పోర్ట్ ఫోలియో వాల్యూ రూ.10,000 కోట్ల దిగువకు చేరింది. దలాల్ స్ట్రీట్ లోని బ్లడ్ బాత్‌తో దిగ్గజ ఇన్వెస్టర్లతో పాటు బడా బాబులకే కోలుకోలేని దెబ్బ తగలగా ఇక సామాన్య ఇన్వెస్టర్ల పరిస్థితి సరేసరి. తాజా గణాంకాల ప్రకారం 2014 సంవత్సరంలో 55 శాతం, 2015లో 7.04 శాతం, 2016లో 8 శాతం, 2017లో 48 శాతం మిడ్ క్యాప్ షేర్లు పెరిగాయి. కానీ ఈ సంవత్సరం మార్కెట్ క్యాప్, మ్యూచువల్ ఫండ్స్‌ను పునర్నిర్వచించడంతో ఒక్కసారిగా మార్కెట్ క్రాష్ కు గురైంది. మిడ్ క్యాప్ కంపెనీలపై ఓవర్ వాల్యూషన్స్ పెరగడంతో ఒత్తిళ్ళకు గురైయ్యాయి. సుదీర్ఘ కాలం స్టాక్స్ ను హోల్డ్ చేసిన ఘనత కలిగిన రాకేష్ ఝన్‌ఝున్ వాలా పోర్ట్ ఫోలియోలో లోని స్టాక్స్ ఒక్కసారిగా 75 శాతం పతనమయ్యాయి. పోర్ట్ ఫోలియోలోఉన్న 27 స్టాక్స్ లో కేవలం మూడు మాత్రమే పాజిటివ్‌గా ఉన్నాయి. ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్, వీఐపీ ఇండస్ట్రీస్, ల్యూపిన్ స్టాక్స్ తప్ప మిగతా అన్ని స్టాక్స్ 75 శాతం ఢమాల్ అన్నాయి. నష్టపోయిన షేర్లు మందన రిటైల్స్ వెంచర్స్ స్టాక్స్ 75శాతానికి పడిపోయాయి. జయప్రకాష్ అసోసియేట్స్ 74.16 శాతానికి పడిపోయాయి. డీబీ రియాలిటీ 63 శాతం, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 61 శాతం, ఆప్ టెక్ 58 శాతం, ప్రోజోన్ ఇన్ టూ ప్రోపర్టీస్ 58 శాతం, బిల్ కేర్ 51 శాతం, ఓరియంట్ సిమెంట్స్, టీవీ18 బ్రాడ్ కాస్ట్, ప్రకాష్ ఇండస్ట్రీస్, మ్యాన్ ఇన్ఫ్రా , అటోలైన్ ఇండస్ట్రీస్, ఫెడరల్ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్ , డెల్టా గ్రూప్ షేర్లు 30- 50 శాతానికి పడిపోవడంతో రాకేష్ నష్టపోయారు. -
మార్కెట్ల పతనంతో ప్రముఖ ఇన్వెస్టర్లంతా...
న్యూఢిల్లీ : అటు అమెరికా స్టాక్ మార్కెట్లు, ఇటు దేశీయ స్టాక్ మార్కెట్లు ఇచ్చిన దెబ్బకి ఇన్వెస్టర్లెవరూ తప్పించుకోలేకపోయారు. రాఖేష్ ఝున్‌ఝున్‌వాలా, ఆసిస్ కచోలియా, డాలీ ఖన్నా వంటి ప్రముఖ ఇన్వెస్టర్లంతా తీవ్రంగా నష్టపోయారు. 2018లో ఆర్జించిన లాభాలన్నింటినీ సెన్సెక్స్ ఒక్కసారిగా కోల్పోయిన సంగతి తెలిసిందే. గత సోమవారం నమోదైన ఆల్-టైమ్ హై నుంచి 3000 పాయింట్ల మేర సెన్సెక్స్ క్రాష్ అయింది. దీంతో చాలా మంది మార్కెట్ గురూలు, తమ పోర్ట్ఫోలియా స్టాక్స్ నుంచి 32 శాతం వరకు సంపదను నష్టపోయారు. నేడు ట్రేడింగ్ ప్రారంభమైన సెకన్ల వ్యవధిలోనే 5 లక్షల 40వేల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ భారీగా 1250 పాయింట్ల మేర, నిఫ్టీ 350 పాయింట్ల మేర పతనమైంది. బడ్జెట్లో ప్రతిపాదించిన పన్ను భయాలు, అమెరికా స్టాక్‌మార్కెట్ల పతనం, ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో ఆర్బీఐ రెపో రేటు పెంపుకు అంచనాలు వంటివి మార్కెట్లను భారీగా దెబ్బతీస్తున్నాయి. ఈ కేలండర్ ఏడాదిలో ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌ఫోలియో స్టాక్స్ 32 శాతం వరకు పడిపోయినట్టు డేటా వెల్లడించింది. ఆప్టెక్ 34 శాతం, జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్, ఎంసీఎక్స్, అనంత్ రాజ్ 27 శాతం, 27.12 శాతం, 26 శాతం వరకు నష్టపోయాయి. ఆటో లైన్ ఇండస్ట్రీస్, ఫెడరల్ బ్యాంకు, ఓరియంట్ సిమెంట్లు కూడా 24 శాతం వరకు నష్టాలు గడించాయి. మరోవైపు మార్కెట్లో నెలకొన్న తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి నేపథ్యంలో మరో ప్రముఖ ఇన్వెస్టర్ ఆసిస్ కచోలియా, షైలీ ఇంజనీరింగ్ ప్లాటిస్టిక్స్లో 2,95,000 షేర్లను కొనుగోలు చేశారు. మరో స్టాక్‌ను కూడా కచోలియా కొన్నట్టు తెలిసింది. డాలీ ఖన్నా పోర్టుఫోలియోలో స్టెర్లింగ్ టూల్స్ 19 శాతం, ద్వారికేష్ షుగర్ 20 శాతం, నందన్ డెనిమ్ 21 శాతం, రుచిర పేపర్ 19 శాతం, మణప్పురం ఫైనాన్స్ 21 శాతం, జీఎన్ఎఫ్సీ 19 శాతం, రాణి ఇండస్ట్రీస్ 18 శాతం, ఐఎఫ్బీ ఆగ్రో 25 శాతం నష్టాలు పాలయ్యాయి. -
మార్కెట్లపై ఝున్ ఝున్‌వాలా జోస్యం
న్యూఢిల్లీ : దలాల్ స్ట్రీట్ సూచీల కదలికలు ఎప్పుడు ఎటువైపు సాగుతాయో ప్రతి ఒక్కరికీ సందేహమే. ఓ సారి టాప్‌లో ఎగుస్తాయి. మరోసారి ఢమాల్ మనిస్తాయి. సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్‌గా కీర్తి గడించిన రాకేశ్ జున్‌జున్‌వాలా మార్కెట్లో చూడబోతున్న ఆసక్తికరమైన అంశాలు మీడియాకు వివరించారు.. దలాల్ స్ట్రీట్‌లో బిగ్ బుల్‌ను చూడబోతున్నామని.. 2003లో చూసిన జోష్‌ను మార్కెట్లు ప్రతిబింబించబోతున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్లో పెట్టుబడిదారుల తక్కువగా పాల్గొనడం బుల్ మార్కెట్‌కు ప్రారంభదశలో ఉండటాన్ని సూచిస్తుందన్నారు. ఫెడరల్ రిజర్వు రేట్లు పెంచితేనే దేశీయ మార్కెట్లు కరెక్ట్ చెందుతాయన్నారు. అమెరికా రేట్లు కూడా 1-1.5 శాతం కంటే ఎక్కువ పెరుగుతాయని అంచనావేయడం లేదని పేర్కొన్నారు. రేట్ల పెంపు లేనంత వరకు అంతర్జాతీయంగా మార్కెట్లలో ర్యాలీ ఇలానే కొనసాగుతుందని వెల్లడించారు. గ్లోబల్ ర్యాలీతో సెన్సెక్స్ ఫిబ్రవరి చివరి కల్లా 18 శాతం ఎగిసినట్టు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో పేలవమైన ప్రదర్శనను కనబరుస్తున్న ఇండియన్ ఐటీ రంగంలో వృద్ధి కొనసాగింపును చూస్తామని.. కానీ ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది మాత్రం పెట్టుబడిదారులే నిర్ణయించుకోవాలని సూచించారు. గోల్డ్ మార్కెట్లో కూడా బుల్లిష్ ట్రెండ్ చూస్తామని తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకురావడానికి ఆర్బీఐ గవర్నర్ రాజన్ తీసుకున్న విధానాలు బాగున్నాయని వివరించారు. రాజన్ 8900 కోట్ల పోర్ట్‌ఫోలియో కలిగిన జున్‌జున్‌వాలా, ఇండియా వారెన్ బఫెట్‌గా పేరుగాంచారు. -
ఝున్‌ఝున్‌వాలా పెట్టుబడులకు స్పైస్‌జెట్ దెబ్బ
12 రోజుల్లో 12%పైగా నష్టం ముంబై: స్పైస్‌జెట్‌లో పెట్టుబడుల విషయంలో ప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా తప్పటడుగు వేసినట్లు కనిపిస్తోంది. ఝున్‌ఝున్‌వాలా అంటే పటిష్ట మూలాలున్న కంపెనీలలో చిన్న స్థాయిలో వాటాలను కొనడం ద్వారా భారీ లాభాలు ఆర్జిస్తారన్న గుర్తింపు ఉన్న తెలిసిందే. అయితే ఇటీవల పలు సమస్యలు ఎదుర్కొంటున్న స్పైస్‌జెట్‌లో ఝున్‌ఝున్‌వాలా రెండు వారాల క్రిత ం ఇన్వెస్ట్ చేశారు. రేర్ ఎంటర్ప్రైజెస్ సంస్థ ద్వారా నవ ంబర్ 28న స్పైస్‌జెట్‌కు చెందిన 75 లక్షల షేర్ల(1.4% వాటా)ను రూ. 17.88 సగటు ధరలో కొనుగోలు చేశారు. ఇందుకు రూ. 13.4 కోట్లు వెచ్చించారు. అయితే ఆపై 12 రోజుల్లో షేరు ధర 12%పైగా క్షీణించింది. బీఎస్ఈలో తాజాగా రూ. 15.65 వద్ద ముగిసింది. అయితే ఝున్‌ఝున్‌వాలా కొన్న రోజున స్పైస్‌జెట్ షేరు 18%పైగా ఎగసి రూ. 21ను దాటింది. ఈ స్థాయి నుంచి లెక్కిస్తే నష్టాలు మరింత అధికంగా ఉంటాయి. కాగా, ఆర్థిక సమస్యల కారణంగా సోమవారం 80 సర్వీసులను రద్దు చేయడమేకాకుండా, ఈ నెలాఖరు వరకూ మొత్తం 1,800 విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు స్పైస్‌జెట్ ప్రకటించింది. నెల రోజులకు మించి టెకెట్ల బుకింగ్‌ను అనుమతించవద్దంటూ డీజీసీఏ స్పైస్‌జెట్‌ను ఆదేశించగా, బకాయిల నిమిత్తం రూ. 200 కోట్లమేర బ్యాంక్ గ్యారంటీలను వెంటనే సమర్పించాల్సిందిగా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆదేశించింది.