రోహిక మిస్త్రీ, రేఖా ఝున్‌ఝున్‌వాలాల మధ్య ఉన్న ప్రధాన సారూప్యత ఏమిటంటే... ఇద్దరూ పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని నిలబడ్డారు. తడబడకుండా ధైర్యంగా అడుగు ముందుకు వేశారు. తమ తెలివితేటలు, కార్యదక్షతతో విజయపరంపరను ముందుకు తీసుకు వెళుతున్నారు. తాజాగా ఫోర్బ్స్ వరల్డ్స్ బిలియనీర్స్ జాబితాలో మన దేశం నుంచి చోటు సంపాదించిన
న్యూకమర్స్‌లో ఈ ఇద్దరూ ఉన్నారు...
సైరస్ మిస్త్రీ పరిచయం అక్కరలేని పేరు. లండన్ బిజినెస్ స్కూల్‌లో మాస్టర్స్ చేసిన మిస్త్రీ ఆతరువాత కుటుంబవ్యాపారంలోకి వచ్చాడు. 2012లో టాటా గ్రూప్ ఛైర్మన్ అయ్యాడు.
మిస్త్రీ జీవితంలో జయాపజయాలు ఉన్నాయి. ‘నిర్దేశిత లక్ష్యాల విషయంలో మిస్త్రీ విఫలమయ్యాడు’ అంటూ కొద్దికాలానికి ఛైర్మన్ పదవి నుంచి మిస్త్రీకి ఉద్వాసన పలికింది టాటా గ్రూప్.
న్యాయపోరాటం సంగతి ఎలా ఉన్నా మిస్త్రీ ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో భర్తకు అండగా నిలబడి ఎంతో శక్తిని ఇచ్చింది రోహిక. ప్రచారానికి దూరంగా ఉండే రోహిక గురించి బయట పెద్దగా ఎవరికి తెలియదు. అయితే భర్త నోటి నుంచి ‘రోహిక’ పేరు వినిపించేది. దిగ్గజ న్యాయవాది ఇక్బాల్ చాగ్లా కుమార్తె అయిన రోహిక కొన్ని ప్రైవెట్, పబ్లిక్ కంపెనీలలో డైరెక్టర్‌గా పనిచేసింది.
ఒకసారి రోహికను క్లెమెన్‌టైన్ స్పెన్సర్ చర్చిల్‌తో పోల్చాడు సైరస్ మిస్త్రీ. చర్చిల్ భార్య అయిన క్లెమెన్‌టైన్ ధైర్యశాలి. ముందుచూపు ఉన్న వ్యక్తి. భర్తకు ఎన్నో సందర్భాలలో అండగా నిలబడి ధైర్యాన్ని ఇచ్చింది. తప్పులను సున్నితంగా ఎత్తి చూపింది. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం తన నైజం. వర్క్–ఫ్యామిలీ లైఫ్‌లో సమన్వయాన్ని కోల్పోతున్న మిస్త్రీని దారిలోకి తెచ్చింది రోహిక.
‘సమస్యలు ఉన్నాయని సరదాలు వద్దనుకుంటే ఎలా!’ అంటూ భర్తను విహారయాత్రలకు తీసుకెళ్లేది. ఆ యాత్రలలో వ్యాపార విషయాలు అనేవి చివరి పంక్తిలో మాత్రమే ఉండేవి.
54 ఏళ్ల వయసులో సైరస్ మిస్త్రీ ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు. రోహికకు ఊహించిన షాక్!
దుఃఖసముద్రంలో మునిగిపోయిన రోహిక తనకు తాను ధైర్యం చెప్పుకొని ఒడ్డుకు వచ్చింది. మైదానంలో అడుగు పెట్టి ఆట మొదలు పెట్టింది. ‘నువ్వే నా ధైర్యం’ అనేవాడు రోహికను ఉద్దేశించి మిస్త్రీ. భర్త జ్ఞాపకాలనే ధైర్యం చేసుకొని, శక్తిగా మలచుకొని ముందుకు కదిలింది రోహిక. ‘మిస్త్రీల శకం ముగిసింది’ అనుకునే సందర్భంలో ‘నేనున్నాను’ అంటూ వచ్చి గెలుపు జెండా ఎగరేసింది రోహిక మిస్త్రీ.
స్టాక్ మార్కెట్ చరిత్రలో ‘స్టార్’గా మెరిశాడు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా. పెట్టుబడి పాఠాల ఘనాపాఠీ రాకేష్‌కు భార్య ఎన్నో పాఠాలు చెప్పింది. అవి ఆరోగ్య పాఠాలు కావచ్చు. ఆత్మీయ పాఠాలు కావచ్చు. రేసులకు వెళ్లి ఏ అర్ధరాత్రో ఇంటికి వచ్చే భర్తను ఆ అలవాటు మానిపించింది. సిగరెటు అలవాటును దూరం చేసింది. ఆరోగ్యకరమైన జీవనశైలి దిశగా భర్తను అడుగులు వేయించింది.
తన పేరు, భార్య పేరులోని కొన్ని ఆంగ్ల అక్షరాలతో తన స్టాక్ బ్రోకింగ్ కంపెనీకి ‘రేర్’ అని పేరు పెట్టాడు రాకేశ్.
భర్త హఠాన్మరణం రేఖను కుంగదీసింది. చుట్టూ అలముకున్న దట్టమైన చీకట్లో వెలుగు రేఖ కరువైంది. అలాంటి దురదృష్టపు రోజుల్లో వేధించే జ్ఞాపకాలను పక్కనపెట్టి వెలుగు దారిలోకి వచ్చింది రేఖ. ‘ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు’ అనే సామెత ఉంది. అది నిజమో కాదో తెలియదుగానీ ‘యూనివర్శిటీ ఆఫ్ ముంబై’లో చదువుకున్న రేఖ భర్త రాకేశ్‌లో ఒక విశ్వవిద్యాలయాన్ని దర్శించింది. అక్కడ ఎన్నో పాఠాలు నేర్చుకుంది. భర్త బాటలోనే ఇన్వెస్టర్‌గా, ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఘనమైన విజయాలు సాధిస్తోంది రేఖ ఝున్‌ఝున్‌వాలా.
గెలుపు దారి: దుఃఖనది దాటి గెలిచారు
Published Thu, Apr 6 2023 5:31 AM | Last Updated on Thu, Apr 6 2023 6:54 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment