
టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మోకాలీ సర్జరీతో టి20 ప్రపంచకప్‌కు దూరమైన సంగతి తెలిసిందే. జడ్డూతో పాటు బుమ్రా కూడా దూరమవ్వడం టీమిండియా అభిమానులకు షాక్ తగిలేలా చేసింది. ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు లేకుండానే టీమిండియా ప్రపంచకప్‌లో ఆడనుంది. మరి టీమిండియా అంచనాలు అందుకుంటుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.
ఈ విషయం పక్కనబెడితే.. ఇరానీ కప్‌లో భాగంగా సౌరాష్ట్ర, రెస్టాఫ్ ఇండియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో జడేజా బ్యాటర్‌గా ప్రత్యక్షమైన ఫోటో వైరల్‌గా మారింది. అదేంటి ప్రస్తుతం జడేజా బెంగళూరులోని ఎన్‌సీఏ అకాడమీలో ఉన్నాడు కదా.. ఇరానీ కప్‌లో ఆడడమేంటీ అనుకుంటున్నారా. అదంతా సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనాద్కట్ మాయ. అతని పెట్టిన ఒక ఫోటో ఇప్పుడు చర్చకు దారి తీసింది.
రెస్టాఫ్ ఇండియాతో మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర కెప్టెన్ ఉనాద్కట్‌తో పాటు ప్రేరణ్ మన్కడ్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ ఇద్దరి మధ్య ఎనిమిదో వికెట్‌కు 144 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. అయితే ప్రేరక్ మన్కడ్‌ను దూరం నుంచి చూస్తే కాస్త రవీంద్ర జడేజాలానే పోలి ఉంటాడు. ఇక్కడే ఉనాద్కట్ తన తెలివిని ఉపయోగించాడు.
తనతో బ్యాటింగ్ చేసిన ప్రేరక్ మన్కడ్ ఫోటోకు కాస్త మార్ఫింగ్ చేసి జడేజాను పెట్టాడు. ''జడ్డూ టీమ్‌లో ఉండడం ఆనందంగా ఉంది(మారువేషంలో)'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. కేవలం సరదా కోసమే చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. జడేజా, ప్రేరక్ మన్కడ్‌లకు పోలికలు దగ్గరగా ఉండడంతో..'' మరో జడేజా వచ్చేశాడు.. టి20 ప్రపంచకప్‌కు ఈ జడ్డూను పంపిద్దామా'' అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే సౌరాష్ట్ర రెండో ఇన్నింగ్స్‌లో 380 పరుగులకు ఆలౌటైంది. దీంతో రెస్టాఫ్ ఇండియా ముందు 104 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఉంచింది. ప్రస్తుతం రెస్టాఫ్ ఇండియా 2 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. అభిమన్యు ఈశ్వరన్ 25, శ్రకర్ భరత్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు.
Glad to have Jaddu in the team.. (in disguise 😂) @imjadeja = @PrerakMankad46 pic.twitter.com/3URrzEMgD2
— Jaydev Unadkat (@JUnadkat) October 3, 2022