తన వయసులో సగం కంటే తక్కువ ఉన్న ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటూ వెంట పడటమే కాదు.. ఆమె కాదన్నందుకు ఆ యువతిపై యాసిడ్ పోశాడో 50 ఏళ్ల ప్రబుద్ధుడు.
తన వయసులో సగం కంటే తక్కువ ఉన్న ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటూ వెంట పడటమే కాదు.. ఆమె కాదన్నందుకు ఆ యువతిపై యాసిడ్ పోశాడో 50 ఏళ్ల ప్రబుద్ధుడు. అయితే, అదృష్టవశాత్తు ఆమె ఎలాగోలా ఈ దాడి నుంచి తప్పించుకోగలిగింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో జరిగింది. పేపర్ మిల్లు కాలనీకి చెందిన విష్ణు నారాయణ్ శివపురి అనే వ్యక్తి మహానగర్ ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి (24) ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.
అయితే అందుకు ఆమె నిరాకరించింది. అయినా అతడు వెంటపడటం మానలేదు. ఎప్పటిలాగే మంగళవారం కూడా ఆమె వెంట పడ్డాడు. పెళ్లి చేసుకోవాలని బలవంత పెట్టాడు. కానీ ఆమె అంగీకరించలేదు. అంతే.. చేతిలో ఉన్న యాసిడ్ బాటిల్ తీసుకుని, మూత తీసి ఆమె మీద పారబోశాడు. కానీ, అతడి దుశ్చర్యను ముందే గమనించిన ఆ యువతి తృటిలో ఆ దాడి నుంచి తప్పించుకుంది. తన దివంగత తండ్రికి శివపురి స్నేహితుడని, ఆ పరిచయంతోనే చనువు పెంచుకుని, తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా బలవంత పెట్టాడని ఆమె పోలీసులకు తెలిపింది. పోలీసులు అతగాడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.