ఆధార్ కార్డును తప్పనిసరి చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను మే 17న విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది.
న్యూఢిల్లీ: సంక్షేమ పథకాలకు కేంద్రం ఆధార్ కార్డును తప్పనిసరి చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను మే 17న విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ విషయం చాలా ముఖ్యమని, అత్యవసరంగా విచారించాలన్న సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ అభిప్రాయంతో ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని బెంచ్ శుక్రవారం ఏకీభవించింది.
ఆధార్ స్వచ్ఛందమేనని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో స్పష్టం చేసినా, ఉపకార వేతనాలు, మధ్యాహ్న భోజన పథకం, ఆహార హక్కు లాంటి పథకాలకు కేంద్రం ఆధార్‌ను తప్పనిసరి చేసిందని దివాన్ అన్నారు. దీని విచారణకు ఇద్దరు జడ్జీలతో బెంచ్‌ను ఏర్పాటుచేయాలని అత్యున్నత ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు.
కేంద్రం తరుఫున హాజరైన సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్, దివాన్ వాదనలతో విభేదించారు. ఆధార్ వ్యవహారంలో ఐదుగురు జడ్జీల బెంచ్ ఇది వరకే మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిందని, మళ్లీ దీన్ని ఇద్దరు జడ్జీల బెంచ్‌కు నివేదించడం సరికాదని అన్నారు.