Guntur Medical College
-
గుంటూరు వైద్య కళాశాలలో ర్యాగింగ్
గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాలలో ర్యాగింగ్ జరిగిందని ఫిర్యాదులు రావడంతో శుక్రవారం వైద్య కళాశాల అధికారులు ర్యాగింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పీజీ మహిళా వైద్యులను పిలిపించి విచారణ చేశారు. గుంటూరు జీజీహెచ్‌లో హౌస్ సర్జన్‌గా (ఇంటర్నీ) విధులు నిర్వహిస్తున్న ఓ వైద్య విద్యార్థిని తనను పీజీ విద్యార్థినులు వేధిస్తున్నారని, బెదిరిస్తున్నారని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేసింది. ఎన్ఎంసీ అధికారులు సదరు ఘటనపై తక్షణమే విచారణ నిర్వహించాలని ఆదేశిస్తూ శుక్రవారం వైద్య కళాశాల అధికారులకు మెయిల్ ద్వారా ఉత్తర్వులు పంపారు. దీంతో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చాగంటి పద్మావతీదేవి ఆధ్వర్యంలో పలువురు యాంటీ ర్యాగింగ్ కమిటీ సభ్యులు ర్యాగింగ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పీజీ మహిళా వైద్యులను పిలిపించి విచారించారు. కాగా, ఏప్రిల్‌లో మెన్స్ హాస్టల్లో సీనియర్ వైద్య విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నారంటూ జూనియర్ వైద్య విద్యార్థులు ఎన్ఎంసీకి ఫిర్యాదు చేశారు. నాడు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మావతీదేవి సీనియర్ వైద్య విద్యార్థులు, జూనియర్ వైద్య విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి ర్యాగింగ్ విష సంస్కృతిని అనుసరించవద్దని, ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినా మళ్లీ కళాశాలలో ర్యాగింగ్ జరగడం గమనార్హం. -
మెదడు గురించీ ఆలోచించాలి..బ్రెయిన్ స్ట్రోక్‌కు కారణాలు
సాక్షి, అమరావతి: గుంటూరు నగరానికి చెందిన 26 ఏళ్ల యువకుడు ఓ ప్రైవేట్ షోరూమ్‌లో పనిచేస్తుంటాడు. ఇతనికి రెండు నెలల క్రితం మూతి వంకరపోవడంతో కుటుంబ సభ్యులు జీజీహెచ్‌కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం బ్రెయిన్ స్ట్రోక్ (పక్షవాతం)గా నిర్ధారణ అయింది. డిగ్రీ చదివే రోజుల నుంచే సురేశ్ సిగరెట్లు తాగేవాడు. రోజులు గడిచే కొద్దీ చైన్ స్మోకర్గా మారాడు. చిన్న వయసులోనే స్ట్రోక్‌కు గురికావడానికి పొగతాగడమే కారణంగా వైద్యులు గుర్తించారు. విశాఖపట్నం నగరానికి చెందిన 30 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ కరోనా కారణంగా గత ఏడాదిగా ఇంటి నుంచే పనిచేస్తున్నాడు. రెండు వారాల క్రితం ఇంట్లో పనిచేస్తూ స్పృహ కోల్పోయాడు. కుటుంబ సభ్యులు కేజీహెచ్‌కు తరలించగా వైద్య పరీక్షల అనంతరం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయినట్టుగా వైద్యులు నిర్ధారించారు. తీవ్రమైన పని ఒత్తిడితో, నిద్రలేమి వంటి సమస్యల వల్ల స్ట్రోక్ వచ్చినట్టుగా గుర్తించారు. ఆలోచనల ఒత్తిడితో సతమతమయ్యే మెదడు గురించి కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆధునిక జీవన శైలి, దురలవాట్ల కారణంగా 20 నుంచి 45 ఏళ్ల మధ్య వయసులో కొందరు బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడుతున్నారు. ఒకప్పుడు 60 ఏళ్లు పైబడిన వారిలో బీపీ, షుగర్ నియంత్రణలో లేకపోవడం వల్ల ఈ వ్యాధి వస్తుండేది. అయితే ప్రస్తుతం నమోదవుతున్న 25 నుంచి 30 శాతం బ్రెయిన్ స్ట్రోక్ కేసుల్లో వ్యక్తుల వయసు 20 నుంచి 45 ఏళ్ల లోపు ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్‌కు కారణాలు.. ► పొగతాగడం, మద్యం, గంజాయి, డ్రగ్స్ తీసుకోవడం. మద్యపానం, ధూమపానం అలవాటైన పదేళ్లకే పలువురిలో బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనబడుతున్నాయి. ► బీపీ, షుగర్లు నియంత్రణలో లేకపోవడం. శారీరక శ్రమ లేకపోవడం. ► మహిళలు నెలసరిని వాయిదా వేయడం. అధిక రక్తస్రావం నియంత్రణకు వైద్యుల సలహాలు తీసుకోకుండా మందులు వాడటం. ► ప్రస్తుతం కరోనా బారినపడి కోలుకున్న వారిలో 5 శాతం మంది బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవుతున్నారు. రాష్ట్రంలో బీపీ, షుగర్, ఊబకాయం పరిస్థితి ఇలా.. ► మన రాష్ట్రంలో 30 ఏళ్లు నిండిన ప్రతి నలుగురిలో ఒకరికి బీపీ, ప్రతి ఐదుగురిలో ఒకరికి షుగర్ ఉంటోంది. ► గ్రామాల్లో 26 శాతం మంది, పట్టణాల్లో 30 శాతం మంది బీపీ బాధితులు, గ్రామాల్లో 19 శాతం మంది, పట్టణాల్లో 24 శాతం మంది షుగర్ బాధితులు. ► జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 ఆధారంగా రాష్ట్రంలో 36.3 శాతం మంది మహిళల్లో, 31.3 శాతం పురుషుల్లో ఊబకాయం ఉంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ► రోజూ 45 నిమిషాల నడకతో పాటు ఇతర వ్యాయామాలు చేయాలి. ► ఆహారంలో 25 శాతం పండ్లు, 30 శాతం కూరగాయలు, 25 శాతం పిండి పదార్థాలు, 20 శాతం ప్రొటీన్స్ ఉండేలా చూసుకోవాలి. జంక్ ఫుడ్‌ను పూర్తిగా నియంత్రించాలి. ► శరీర బరువును నియంత్రించుకోవాలి. బీపీ, షుగర్ వంటి సమస్యలు ఉంటే తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ► ఒత్తిడికి గురికాకుండా ఉండాలి. రోజుకు ఆరు గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలి. స్ట్రోక్ రెండు రకాలు మెదడులోని రక్తనాళాల్లో రక్త ప్రసరణ సక్రమంగా లేకపోవడం వల్ల శరీరంలోని కొన్ని భాగాలు చచ్చుబడటాన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు. రక్తనాళాలు చిట్లినప్పుడు హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. బీపీ, షుగర్, ఊబకాయం నియంత్రించుకోవడంపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల మన దేశంలో మధ్య వయసుల వారు స్ట్రోక్‌కు గురవ్వడం పెరుగుతోంది. కేజీహెచ్‌కు రోజుకు సగటున ఆరు కేసులు వస్తుంటాయి. – డాక్టర్ జి.బుచ్చిరాజు, న్యూరాలజీ విభాగాధిపతి, విశాఖ ఆంధ్ర మెడికల్ కళాశాల మూడు గంటల్లోపు ఆస్పత్రికి వస్తే.. గుంటూరు జీజీహెచ్‌లో ప్రత్యేకంగా స్ట్రోక్ యూనిట్ ఉంది. గతేడాది 614 మంది, ఈ ఏడాది ఇప్పటి వరకూ 416 మంది స్ట్రోక్ బాధితులకు చికిత్స అందించాం. ఈ ఏడాది కరోనా చికిత్స కారణంగా మే నెలలో అడ్మిషన్లు లేవు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా చికిత్స ఉంటుంది. స్ట్రోక్ వచ్చిన మూడు గంటల్లోపు రోగిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తే వైకల్యం లేకుండా చేయవచ్చు. – డాక్టర్ కె. సుందరాచారి, న్యూరాలజీ విభాగాధిపతి, గుంటూరు మెడికల్ కళాశాల -
గుంటూరు వైద్య కళాశాల స్నాతకోత్సవం
-
ప్లాస్మా థెరపీకి ఎథిక్స్ కమిటీ ఆమోదం
సాక్షి, గుంటూరు: కరోనా (కోవిడ్–19) బాధితులకు ప్మాస్లాథెరపీ ద్వారా చికిత్స అందించేందుకు గుంటూరు వైద్య కళాశాల ఎథిక్స్ కమిటీ ఆమోదం తెలిపింది. శనివారం వైద్య కళాశాలలో కళాశాల ఎథిక్స్ కమిటీ సమావేశమై ఈ నిర్ణయం వెల్లడించింది. ఈ విధానంలో కరోనా సోకిన వారికి చికిత్స అందించేందుకు గుంటూరు వైద్య కళాశాలలో అన్ని రకాల వైద్యులు, వైద్య సౌకర్యాలు ఉండటంతో కళాశాల ఎతిక్స్ కమిటీ ఈ వైద్య విధానంలో చికిత్స అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. (ఢిల్లీలో తెలుగు మీడియా ప్రతినిధికి కరోనా) వైద్య కళాశాల ఎథిక్స్ కమిటీ నివేదికను కేంద్ర పరిశోధనా సంస్థ ఐసిఎంఆర్‌కు పంపి అక్కడి నుంచి అనుమతి వచ్చిన తర్వాత ప్లాస్మాథెరపీ చికిత్స ప్రారంభిస్తామని ప్రాజెక్ట్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్, పెథాలజీ వైద్య విభాగాధిపతి డాక్టర్ చాగంటి పద్మావతిదేవి తెలిపారు. (‘ఆరోగ్యసేతు గోప్యతపై అనుమానం’) -
కీర్తి ఘనం.. వసతులు శూన్యం!
సాక్షి, గుంటూరు: గుంటూరు వైద్య కళాశాల.. 70 ఏళ్ల కీర్తి కిరీటాన్ని తలపై అలంకరించుకున్న వైద్య దేవాలయం.. ఎందరో నిష్ణాతులైన వైద్యులను, మరెందరో ఉద్ధండులైన రాజకీయ నాయకులను జిల్లా నుంచి అందించిన కీర్తి మకుటం.. ఇక్కడ సీటు వస్తే చాలు.. జీవితంలో ఉన్నత శిఖరాల ఆనందపు అంచులు అందుకున్నంత సంబరం..ఇదంతా గతం.. కాలక్రమేణా పాలకుల అసమర్థత వైద్య కళాశాలలోని ప్రతి మూలలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. మంచి కళాశాలలో సీటు వచ్చిందనే ఆనందాన్ని ఆదిలోనే ఆవిరి చేస్తోంది. ఎన్నో ఆశలతో మరెన్నో ఆకాంక్షలతో కాలేజీలోకి అడుగు పెడితే.. అడుగడుగునా సమస్యల తోరణం గుమ్మంలోనే స్వాగతం పలుకుతోంది. కనీసం కూర్చొని పాఠాలు వినడానికి సరిపడా తరగతి గదిలేని దయనీయ స్థితి కళాశాల దుస్థితికి అద్దం పడుతోంది. సౌకర్యాలపై సర్దుకుపోయినా పాఠాలు పూర్తిగా చెప్పే గురువులు లేని దుస్థితి రేపటి భవిష్యత్‌ను ఆందోళనలో పడేస్తోంది. ఆరేళ్ల క్రితం ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయని సంతోషపడినంతలోనే.. వసతులలేమి దుఃఖంలో ముంచెత్తుతోంది. మొత్తంగా ఉన్నతాధికారుల చెవికి చేరని వైద్య విద్యార్థుల వేదన కాలేజీలో నాలుగు గోడల మధ్యే కన్నీరవుతోంది. రాష్ట్ర రాజధాని జిల్లా గుంటూరులో ఉన్న గుంటూరు వైద్య కళాశాలలో సరైన సౌకర్యాలు లేక వైద్య విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. సరిపడా వైద్యులు కూడా లేకపోవటంతో చికిత్స కోసం వివిధ జిల్లాల నుంచి వచ్చే పేద రోగులు సైతం సకాలంలో వైద్యం అందక అల్లాడిపోతున్నారు. గత ప్రభుత్వం రాజధాని జిల్లాలోని వైద్య కళాశాలలో సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా మిన్నకుండిపోయింది. పేరుకే జిల్లా రాజధానిలో ఉన్న వైద్య కళాశాల అని చెప్పుకోవటమే మినహా వైద్య విద్యార్థులకు తరగతి గదిలో కూర్చుని పాఠాలు వినేందుకు కూడా కనీస సౌకర్యాలు లేవు. కళాశాల ప్రిన్సిపాల్‌గా నియమించిన డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావును మూడేళ్ల క్రితం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అర్హత లేని వ్యక్తిగా నిర్ధారించింది. మెడికల్ కౌన్సిల్ తనిఖీలకు గుంటూరు వైద్య కళాశాలకు వచ్చిన సమయంలో అర్హత లేని డాక్టర్ సుబ్బారావుని పక్కన కూర్చోబెట్టి డాక్టర్ మోహనరావును ఆ స్థానంలో ఉంచారు. దీంతో సీనియర్స్ ప్రాధాన్యత లేకపోయింది. దీనంతటికీ టీడీపీ ప్రభుత్వ తీరే కారణమని సీనియర్ వైద్యులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎందరో ఆణిముత్యం లాంటి వైద్యులను ప్రపంచానికి అందించిన ఘనత అందుకున్న గుంటూరు వైద్య కళాశాలలో నేడు కనీసం బోధన చేసేందుకు సరిపడా సిబ్బంది లేరు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడకు వెళ్లినా అక్కడ గుంటూరు వైద్య కళాశాలలో చదువుకున్న వైద్యులు కనిపిస్తారు. వైద్య కళాశాలకు సుమారు 70 ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడ చదువుకున్న వైద్యులు చాలా మంది దేశంలోని ఉన్నత పదవులను సైతం అలంకరించారు. అమెరికాలో ప్రసిద్ధి చెందిన వైద్యుల్లో చాలా మంది గుటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థులే. వైద్యుల పోస్టుల ఖాళీలతో బోధన ఎలా? గుంటూరు వైద్య కళాశాల ప్రారంభంలో తొలి బ్యాచ్‌లో కేవలం 50 మంది ఎంబీబీఎస్ వైద్య విద్యార్థులు ఉండగా 1960 సంవత్సరం నాటికి 150 మందికి పెరిగారు. 2013–14 విద్యా సంవత్సరంలో గుంటూరు వైద్య కళాశాలకు 50 సీట్లు అదనంగా వచ్చి ప్రస్తుతం 200 మంది వైద్య విద్యార్థులు ఎనిమిదో బ్యాచ్ 2019–20 సంవత్సరానికి అడ్మిషన్లు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. నీట్ ఫలితాలు కూడా ప్రకటించటంతో వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లు భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. సూపర్ స్పెషాలిటీ, స్పెషాలిటీ వైద్య విభాగాలన్నీ కలిపి 32 వరకు జీజీహెచ్‌లో, వైద్య కళాశాలలో ఉన్నాయి. పీజీ సీట్లు 100 ఉండగా ఏడాదికి వంద మందికిపైగా పారా మెడికల్ కోర్సులను అభ్యసిస్తున్నారు. వీరందరికీ బోధన చేసేందుకు కళాశాలలో 66 మంది ప్రొఫెసర్లు, 50 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 201 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను ప్రభుత్వం కేటాయించింది. అయితే ఈ పోస్టుల్లో చాలా వరకు ఖాళీగా ఉండటంతో బోధన అంతంతమాత్రమే జరుగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏడు ప్రొఫెసర్, 3 అసోసియేట్ ప్రొఫెసర్స్ 3, 24 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 200 సీట్లకు సరిపడా వైద్యులు ఎక్కడ ? భారత వైద్య మండలి(ఎంసీఐ) నిబంధనల ప్రకారం గుంటూరు వైద్య కళాశాలలో బోధన సిబ్బంది లేరు. ప్రతి ఏడాది ఎంసీఐ తనిఖీల సమయంలో బోధనా సిబ్బంది ఉన్నట్లు రికార్డుల్లో చూపిస్తున్నారు. దీంతో వైద్య విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న ఖాళీగా ఉన్న 34 ఖాళీ పోస్టులతోపాటు పెరిగిన సీట్లకు అనుగుణంగా మరో 15 నుంచి 20 వైద్యుల పోస్టులు అవసరం. ముఖ్యంగా సీనియర్ రెసిడెంట్ వైద్యుల కొరత వేధిస్తోంది. సూపర్ స్పెషాలిటీ, పీజీ సీట్లకు గుర్తింపు రావాలంటే అసోసియేట్ ప్రొఫెసర్స్‌ను నూతనంగా మంజూరు చేయాల్సి ఉంది. ఈ పోస్టులు సరిపడా లేకపోవటంతో వైద్యులకు పదోన్నతులు కూడా సక్రమంగా రాని దుస్థితి నెలకొంది. గత ప్రభుత్వం కింది స్థాయి అసిస్టెంట్స్‌కు పదోన్నతులు కల్పించింది. అసోసియేట్స్, ప్రొఫెసర్స్‌కు పదోన్నతులు ఇవ్వలేదు. దీంతో వారు పదోన్నతి పొందే అవకాశం లేకుండాపోయింది. కూర్చొనే చోటు కూడా లేదు ఎంబీబీఎస్ వైద్య విద్యార్థులు సైతం తరగతి గదుల్లో కూర్చునేందుకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. తరగతి గదులు 125 మంది మాత్రమే కూర్చునేందుకు సరిపోయేలా నిర్మాణం చేశారు. ప్రస్తుతం 200 మంది వైద్య విద్యార్థులు ఉండటంతో కొంత మంది ఇరుక్కుని కూర్చుని లేదా నిలబడే క్లాసులు వినాల్సి వస్తుంది. తరగతి గదుల్లో గాలి, వెలుతురు ప్రసరణ లేదు. విద్యార్థులకు క్లాస్ రూమ్‌లోని బ్లాక్ బోర్డు చాలా దూరంగా ఉండి కంటి సమస్యలు వస్తున్నట్లు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వాపోవుతున్నారు. మంచినీరు, మరుగుదొడ్డి సౌకర్యాలు సరిపడా లేక వైద్య విద్యార్థులకు అవస్థలు తప్పటం లేదు. మళ్లీ కేంద్ర ప్రభుత్వం మరో 50 సీట్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న సీట్లకే వైద్యులు, వైద్య సౌకర్యాలు లేక సతమతవుతుంటే అదనంగా వచ్చే 50 ఎంబీబీఎస్ సీట్లకు ఏ విధంగా వసతుల కల్పిస్తారో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రోగులకు తప్పని ఇక్కట్లు గుంటూరు వైద్య కళాశాలకు అనుబంధంగా గుంటూరు జీజీహెచ్ ఉంది. ఇక్కడ ఓపీలో వైద్య సేవలు పొందేందుకు ప్రతి రోజూ నాలుగు వేల మంది రోగులు వస్తున్నారు. వీరికి వైద్యసేవలను అందించే వైద్యులు సరిపడా లేరు. దీంతో రోగులు అల్లాడుతున్నారు. ప్రస్తుతం 200 ఎంబీబీఎస్ సీట్లకు అనుగుణంగా ఆస్పత్రిలో 15 వైద్య యూనిట్స్‌ను పెంచాల్సి ఉంది. ఒక్కో యూనిట్లో ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్, సీనియర్ రెసిడెంట్ పోస్టులను మంజూరు చేయాలి. -
‘నీట్’ టాపర్స్‌లో మనవాళ్లు నలుగురు
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు విద్యార్థులు బుధవారం విడుదలైన నీట్ ఫలితాల్లో టాప్–50లో ర్యాంకులు సాధించి సత్తా చాటారు. మన రాష్ట్రానికి చెందిన ఖురేషి అస్రా 690 మార్కులతో జాతీయ స్థాయిలో 16వ ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు దక్కించుకుంది. 685 మార్కులతో పిల్లి భాను శివతేజ జాతీయ స్థాయిలో 40వ ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంక్ సాధించాడు. మరో విద్యార్థి సొదం శ్రీనందన్‌రెడ్డి 685 మార్కులే సాధించి 42వ ర్యాంక్ పొందాడు. తెలంగాణకు చెందిన మాధురిరెడ్డి 695 మార్కులతో జాతీయ స్థాయిలో 7వ ర్యాంక్ సాధించి సత్తా చాటింది. మన రాష్ట్రం నుంచి 57,798 మంది నీట్‌కు దరఖాస్తు చేసుకోగా 55,200 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 39,039 మంది అర్హత సాధించారు. తెలంగాణలో 67.44 శాతంతో 33,044 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది తగ్గిన ఉత్తీర్ణత శాతం ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ నుంచి 70.72 శాతం మంది మాత్రమే అర్హత సాధించారు. నీట్–2018లో 72.55 శాతం మంది క్వాలిఫై అయ్యారు. నీట్లో ఉత్తీర్ణతా శాతం ఆధారంగా జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది. కాగా, గతేడాది జనరల్ విభాగంలో కటాఫ్ మార్కు 107 కాగా ఈసారి 134కు పెరిగింది. ఈ ఏడాది నీట్ ప్రశ్నపత్రం సులువుగానే ఉండటంతో ఎక్కువ మంది 500 మార్కులకు పైగానే సాధించారు. అయితే గతేడాది కంటే ఎక్కువ మార్కులు సాధించినా ర్యాంకులు తగ్గాయి. ఉదాహరణకు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన లీనాకు గతేడాది 464 మార్కులు రాగా జాతీయ స్థాయిలో 37,050వ ర్యాంక్ వచ్చింది. లీనా ఈ ఏడాది నీట్లో 500 మార్కులు సాధించినా ర్యాంకు 49,261కి చేరింది. ఇలా చాలామంది 500 మార్కులు దాటినా సీటు వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు భారీగా మార్కులు సాధించినా అంచనాకు తగ్గట్టు ర్యాంకులు రాలేదు. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటాలో ఒక్కో సీటుకు 16.98 మంది పోటీలో ఉన్నారు. గతేడాది కంటే ఈసారి పోటీ మరింత పెరిగింది. తుది ‘కీ’ తో అన్యాయం మే 29న నీట్ ప్రిలిమినరీ ‘కీ’ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. జూన్ 1 వరకు విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించి బుధవారం ఫలితాలతోపాటు తుది ‘కీ’ని ప్రకటించింది. దీనిపై విద్యా నిపుణులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మొదట విడుదల చేసిన ప్రాథమిక ‘కీ’ కెమిస్ట్రీలో రెండు, ఫిజిక్స్‌లో రెండు ప్రశ్నలకు ఇచ్చిన జవాబులను తుది ‘కీ’లో మార్చినట్లు చెబుతున్నారు. మొదటి ‘కీ’లో ఇచ్చిన జవాబులు సరైనవని, వాటినే మన విద్యార్థులు రాశారని అంటున్నారు. తుది ‘కీ’లో వీటిని మార్చడంతో మన విద్యార్థులకు అన్యాయం జరిగిందని పేర్కొంటున్నారు. ప్రాథమిక ‘కీ’లో వచ్చిన మార్కులు తుది ‘కీ’లో పోయాయంటున్నారు. ఇలా 8 మార్కులు, వాటికి మైనస్ మార్కులతో కలిపి 10 మార్కులు విద్యార్థులు కోల్పోయారని వివరించారు. దీంతో ర్యాంకుల్లో భారీ తేడా వచ్చిందంటున్నారు. గతేడాది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు మొదటి 50 ర్యాంకుల్లో ఏడు ర్యాంకులుంటే, ఈసారి నాలుగు ర్యాంకులే ఉన్నాయన్నారు. 15 శాతం సీట్లకు అఖిల భారత కౌన్సెలింగ్ నీట్లో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులను 50 పర్సంటైల్‌గా, ఎస్టీ, ఎస్సీ, బీసీలకు 40 పర్సంటైల్‌గా, దివ్యాంగులకు 45 పర్సంటైల్‌గా నిర్ణయించారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 15% సీట్లను నేషనల్ పూల్‌లోకి తీసుకున్నారు. వీటన్నింటినీ అలిండియా కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు. నీట్ ర్యాంకుల ఆధారంగా రాష్ట్రాల వారీగా మెరిట్ జాబితా రూపొందించి ప్రవేశాలు కల్పిస్తారు. ఇక రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఎంబీబీఎస్‌లో ప్రవేశాలకు ఆయా రాష్ట్రాలు ప్రత్యేకంగా నోటిఫికేషన్లు జారీ చేస్తాయి. ఇందుకోసం రాష్ట్ర స్థాయి నీట్ ర్యాంకులను ప్రకటిస్తారు. వాటి ఆధారంగా కన్వీనర్, మేనేజ్మెంట్, ఎన్నారై, మైనారిటీ సీట్లను భర్తీ చేస్తారు. నిపుణుల అంచనా ప్రకారం.. నీట్లో జాతీయ స్థాయిలో 40 వేల లోపు ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో 1,500 నుంచి 2 వేల లోపు ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. అలాంటి వారికి కన్వీనర్ కోటాలోనే సీట్లు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. నీట్లో 470 నుంచి 480 మార్కుల వరకు వచ్చిన వారికి కూడా కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీట్లు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కార్డియాలజిస్టునవుతా నీట్ ఏడో ర్యాంకర్ జి.మాధురీరెడ్డి శిరివెళ్ల: నీట్–2019 ఫలితాల్లో కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలం గోవిందపల్లెకు చెందిన గంగదాసరి మాధురీరెడ్డి జాతీయ స్థాయిలో 7వ ర్యాంక్ సాధించింది. ఏపీ ఎంసెట్‌లోనూ 5వ ర్యాంకుతో సత్తా చాటింది. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ మెడికల్ అకాడమీలో చదువుతూ నీట్ రాసిన మాధురి 720 మార్కులకు గాను 695 మార్కులు సాధించి సత్తా చాటింది. ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరతానని, కార్డియాలజిస్టు కావడమే తన లక్ష్యమని తెలిపింది. మాధురి తండ్రి తిరుపతిరెడ్డి ఐటీ కంపెనీలో పనిచేస్తుండగా, తల్లి పద్మ గృహిణి. రేడియాలజిస్టునవుతా నీట్ 40వ ర్యాంకర్ భానుతేజ సాక్షి, విశాఖపట్నం: నీట్ ఫలితాల్లో విశాఖ నగరానికి చెందిన భానుతేజ జాతీయ స్థాయిలో 40వ ర్యాంకు సాధించాడు. విశాఖ చైతన్య కళాశాలలో ఇతను ఇంటర్మీడియట్ చదివాడు. ర్యాంకు వచ్చిన సందర్భంగా భానుతేజ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘ర్యాంకు సాధించడానికి రెండు నెలల పాటు రోజుకు 15 గంటలు కష్టపడి చదివాను. నీట్ రాశాక 500 లోపు ర్యాంకు వస్తుందని భావించాను. 40వ ర్యాంకు రావడం చాలా సంతోషాన్ని కలిగించింది. అమ్మ సూర్యమణి విశాఖ కేజీహెచ్‌లో డాక్టర్. నాన్న శ్రీకాకుళంలో ఎంవీ ఇన్స్పెక్టర్. అక్కలు ఇద్దరూ వైద్యులే. నాకు చిన్నప్పట్నుంచి రేడియాలజీ అంటే ఇష్టం. అందుకే భవిష్యత్తులో రేడియాలజిస్టునవుతాను. నాకు ఉత్తమ ర్యాంకు రావడంలో నా తల్లిదండ్రులు, చైతన్య కాలేజీ అధ్యాపకుల ప్రోత్సాహం ఉంది.’ అని వివరించాడు. శ్రీనందన్రెడ్డికి ఫిజిక్స్‌లో 180కి 180 కడప ఎడ్యుకేషన్: నీట్లో కడపకు చెందిన శ్రీనందన్‌రెడ్డి 42వ ర్యాంకు సాధించాడు. అంతేకాకుండా ఫిజిక్స్ సబ్జెక్టులో ఇతను 180కి 180 మార్కులు సాధించాడు. శ్రీనందన్‌రెడ్డి ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. ఇతను కడపలోని సంకల్ప కోచింగ్ సెంటర్లో ఫౌండేషన్ కోర్సులో శిక్షణ తీసుకున్నాడు. శ్రీనందన్‌రెడ్డి ర్యాంకు సాధించడం పట్ల తల్లిదండ్రులు రామిరెడ్డి, ప్రసూన, సంకల్ప్ డైరెక్టర్ వంశీ హర్షం వ్యక్తం చేశారు. -
బోధించే నాథుడేడీ..?
గుంటూరు మెడికల్: ఎందరో ఆణిముత్యం లాంటి వైద్యులను ప్రపంచానికి అందించిన ఘనత కలిగిన గుంటూరు వైద్య కళాశాలను నేడు బోధనా సిబ్బంది కొరత పట్టి పీడిస్తోంది. కళాశాలకు అనుబంధంగా ఉన్న జీజీహెచ్‌లో రోగుల సంఖ్యకు సరిపడా వైద్యులు లేక వైద్యసేవల్లో జాప్యం ఏర్పడి అవస్థలు పడుతున్నారు. గుంటూరు వైద్య కళాశాల ప్రారంభంలో 1946లో తొలి బ్యాచ్‌లో కేవలం 50 మంది ఎంబీబీఎస్ వైద్య విద్యార్ధులు ఉండగా 1960 నాటికి 150 మందికి పెరిగారు. 2013–14 విద్యా సంవత్సరంలో గుంటూరు వైద్యకళాశాలకు 50 సీట్లు అదనంగా వచ్చి ప్రస్తుతం ఏడాదికి 200 మంది వైద్య విద్యార్థులు ఉంటున్నారు. 2018–19 వ సంవత్సరానికి కళాశాలలో అడ్మిషన్లు తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. నీట్ ఫలితాలు కూడా ప్రకటించడంతో వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. సూపర్ స్పెషాలిటీ, స్పెషాలిటీ వైద్య విభాగాలన్నీ కలిపి 32 వరకు జీజీహెచ్‌లో, వైద్య కళాశాలలో ఉన్నాయి. పీజీ సీట్లు 100 ఉండగా, ఏడాదికి వంద మందికి పైగా పారామెడికల్ కోర్సులను అభ్యసిస్తున్నారు. వీరందరికీ బోధన చేసేందుకు కళాశాలలో 66 మంది ప్రొఫెసర్లు, 47 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 195 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను ప్రభుత్వం కేటాయించింది. అయితే ఈ పోస్టుల్లో చాలావరకు ఖాళీగా ఉండడంతో బోధన అంతంత మాత్రంగానే జరుగుతుందన్న విమర్శలు లేకపోలేదు. ప్రొఫెసర్స్ ఏడు పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్స్ 6, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 30 పోస్టులు మొత్తం 43 వైద్యుల పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. 200 సీట్లకు సరిపడా వైద్యులు లేరు భారత వైద్య మండలి(ఎంసీఐ) నిబంధనల ప్రకారం గుంటూరు వైద్య కళాశాలలో బోధనా సిబ్బంది లేరు. అయినప్పటికీ ప్రతి ఏడాది ఎంసీఐ తనిఖీల సమయంలో బోధనా సిబ్బంది ఉన్నట్టుగా రికార్డుల్లో చూపిస్తూ ఇతర వైద్య కళాశాలల నుంచి బోధనా సిబ్బందిని గుంటూరుకు తీసుకొచ్చి మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. దీనివల్ల వైద్య కళాశాలలో చేరిన వైద్య విద్యార్థులు నాణ్యమైన బోధన లభించక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఖాళీగా ఉన్న 43 సీట్లను భర్తీ చేయటంతో పాటుగా తక్షణమే పెరిగిన వైద్య సీట్లుకు అనుగుణంగా 50 బోధనా సిబ్బంది పోస్టులను మంజూరు చేయాల్సి ఉంది. విద్యార్థులు సైతం తరగతి గదుల్లో కూర్చునేందుకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. తరగతి గదులు 125 మంది మాత్రమే కూర్చునేందుకు సరిపోయేలా నిర్మాణం చేశారు. ప్రస్తుతం 200 మంది ఉండడంతో కొంతమంది ఇరుక్కుని కూర్చుని లేదా నిలబడే క్లాసులు వినాల్సి వస్తోంది. తరగతి గదుల్లో గాలి, వెలుతురు ప్రసరణ సరిగా లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులకు క్లాస్‌రూమ్‌లో బ్లాక్‌బోర్డు చాలా దూరంగా ఉండి కంటి సమస్యలు వస్తున్నట్టు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. మంచినీటి సౌకర్యాలు, మరుగుదొడ్డి సౌకర్యాలు సరిపడా లేక వైద్య విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. రోగులకూ తప్పని ఇక్కట్లు... గుంటూరు వైద్య కళాశాలకు అనుబంధంగా గుంటూరు జీజీహెచ్ ఉంది. ఓపీలో వైద్యసేవలకు ప్రతిరోజూ ఏడు జిల్లాల నుంచి నాలుగువేల మంది రోగులు వస్తుంటారు. వీరికి సరిపడా వైద్యులు లేక రోగులు నానా అగచాట్లు పడుతున్నారు. ఆస్పత్రిలో 15 వైద్య యూనిట్లను పెంచాల్సి ఉంది. ఒక్కో యూనిట్లో ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్, సీనియర్ రెసిడెంట్ పోస్టులను మంజూరుచేయాల్సి ఉంది. యూనిట్స్ పెంపుదల రెండేళ్లుగా కాగితాలపైనే ఉండడంతో రోగులకు వైద్యసేవల్లో జాప్యం వాటిల్లి ప్రాణాలు పోయి ఆందోళనలు చేసిన సంఘటనలు సైతం జీజీహెచ్‌లో తరచుగా చోటుచేసుకుంటున్నాయి. నవ్యాంధ్ర రాజధానిలో గుంటూరు వైద్య కళాశాల ఉండటంతో ఈ కళాశాలలో పూర్తిస్థాయిలో బోధనా సిబ్బంది నియామకాలతో పాటు వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. -
ఒక్కో ప్రొఫెసర్ ఒక్కో వసూల్ రాజా !
సాక్షి, గుంటూరు: గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో చదివిన ఎంతో మంది విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో రాణిస్తున్నారు. కానీ.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు గత వైభవ చరిత్రను మసకబారుస్తున్నాయి. పూర్వ విద్యార్థులు జీజీహెచ్ మిలీనియం బ్లాక్ నిర్మాణానికి రూ.కోట్లు ఇస్తున్నామని గొప్పగా చెప్పుకుంటుంటే, అధ్యాపకులు మాత్రం వైద్య విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ కళాశాల పరువును బజారుకీడుస్తున్నారు. పరీక్షల పేరు చెప్పి వసూలు కళాశాలలో శనివారం నుంచి ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. పర్యవేక్షించేందుకు (ఎక్స్టర్నల్) ఇతర రాష్ట్రాల నుంచి ప్రొఫెసర్లు వచ్చారు. వీరికి ప్రభుత్వం టీఏ, డీఏలు ఇస్తుంది. అయితే, ప్రభుత్వ వైద్య కళాశాలలోని నాలుగు వైద్య విభాగాలకు చెందిన ప్రొఫెసర్లు ఇన్విజిలేటర్లకు రూమ్‌లు, భోజన వసతులు కల్పించేందుకు అంటూ వైద్య విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంబీబీఎస్ విద్యార్థుల నుంచి రూ.20వేలు, హౌస్సర్జన్ల నుంచి రూ.15 వేలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రాక్టికల్స్‌లో ఎన్ని మార్కులు వేయాలనేది ప్రొఫెసర్ల నిర్ణయంపై ఆధారపడి ఉండటంతో విద్యార్థులు భయపడి నగదు ఇస్తున్నట్లు తెలిసింది. అవసరాన్ని బట్టి రూ.50 వేలు కూడా డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. హాజరు శాతం పెంచాలన్నా నగదు అడుగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిరుపేద వైద్య విద్యార్థులను కూడా వదలకుండా వైద్యాధికారులు వసూళ్లకు పా ల్పడుతున్నారు. నిరుపేదలనే కనికరం లేకుండా.. ఆరోగ్యశ్రీ ఆపరేషన్ల ద్వారా పలువురికి వచ్చే పారితోషికాలను సైతం ప్రొఫెసర్లు బినామీ అకౌంట్లలోకి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుత పరీక్ష విధానంలో మార్పులు తెస్తామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అనేకసార్టు వైద్య కళాశాలకు వచ్చిన సమయంలో వెల్లడించారు. అయితే.. ప్రకటనలు తప్ప ఆచరణలో మాత్రం చూపలేదు. విచారణ జరుపుతాం.. కళాశాలలో డబ్బులు వసూలు చేస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. ఇన్విజిలేటర్లకు ప్రభుత్వం టీఏ, డీఏలు ఇస్తుంది. అందుకోసం ఎవరూ ఖర్చు పెట్టనవసరం లేదు. విచారణ జరిపి వసూళ్లకు పాల్పడినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ సుబ్బారావు, ప్రిన్సిపల్, ప్రభుత్వ వైద్య కళాశాల -
ఆ ప్రొఫెసర్లను నరికి చంపుతాం
-
'ఆ ప్రొఫెసర్లను నరికి చంపుతాం'
-
ప్రొఫెసర్ వేధింపులు.. మెడికో ఆత్మహత్య
వైద్యవిద్య చదువుతున్న ఒక యువతి ఆత్మహత్య చేసుకుని నిండుప్రాణాలు తీసుకుంది. మరికొన్నాళ్లలో మెడిసిన్ పూర్తిచేసి, డాక్టర్‌గా సేవలు అందించాల్సిన సంధ్యారాణి.. బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. తమ మెడికల్ కాలేజిలో పనిచేసే ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులు తాళలేకనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సంధ్యారాణి తాను రాసిన సూసైడ్ నోట్లో పేర్కొంది. మృతురాలు సంధ్యారాణి స్వస్థలం హైదరాబాద్‌లోని మలక్‌పేట ప్రాంతమని తెలిసింది. -
వైద్యులు గోఖలే, గోపీచంద్‌లకు పద్మశ్రీ!
గుంటూరు మెడికల్: గుంటూరు వైద్యకళాశాల పూర్వ విద్యార్థులు డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే, డాక్టర్ మన్నం గోపీచంద్‌లకు కేంద్రప్రభుత్వం 2016 సంవత్సరానికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించనున్నట్టు తెలిసింది. ఈ మేరకు డాక్టర్ గోఖలేకి సమాచారం అందింది. వీరిద్దరు కార్డియో థోరాసిక్ సర్జన్లు(సీటీఎస్) కావడం విశేషం. కృష్ణాజిల్లాకు చెందిన డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణగోఖలే గుంటూరు వైద్యకళాశాలలో 1976లో వైద్యవిద్యను అభ్యసించారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గుండెమార్పిడి ఆపరేషన్లు నిర్వహించిన మొదటి వైద్య నిపుణుడు. నవ్యాంధ్రప్రదేశ్‌లో సైతం గుండెమార్పిడి ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సహృదయ ట్రస్టు ద్వారా జీజీహెచ్‌లో పేదరోగులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేస్తున్నారు. జీజీహెచ్‌లో 125 గుండె ఆపరేషన్లు చేసిన ఆయన త్వరలో గుండె మార్పిడి ఆపరేషన్లు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన డాక్టర్ మన్నం గోపీచంద్ 1975లో గుంటూరు వైద్య కళాశాలలో ైవె ద్యవిద్యను అభ్యసించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్లో గుండె వైద్యనిపుణుడిగా పనిచేస్తున్నారు. -
జీఎంసీకి పూర్వ వైభవం
సాక్షి, గుంటూరు : ఎందరో గొప్ప వైద్యులను తయారు చేసిన గుంటూరు వైద్య కళాశాల(జీఎంసీ)కి పూర్వ వైభవం రానుందా.. రాజధాని నగరంగా రూపాంతరం చెందుతున్న గుంటూరు నగరంలో ఉన్న ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జీజీహెచ్)కు మహర్దశ పట్టనుందా.. అనే ప్రశ్నలకు ఉన్నతస్థాయి వైద్య వర్గాలు అవునంటున్నాయి. ఇప్పటి వరకూ 150 సీట్లకే సరైన భవన సముదాయాలు, బోధనా సిబ్బంది, వైద్య పరికరాలు లేకపోవడంతో భారత వైద్యమండలి తనిఖీలు చేసినప్పుడల్లా అసంతృప్తి వ్యక్తం చేసి వెళ్ళడం పరిపాటిగా మారింది. అయితే ఇటీవల పరిస్థితి మెరుగుపడిందని గుర్తించిన భారత వైద్య మండలి బృందం ఇటీవల గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు 200 ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేసింది. వచ్చే ఏడాది నుంచి మరో 50 ఎంబీబీఎస్ సీట్లు పెంచాలని భారత వైద్య మండలికి ప్రతిపాదనలు పంపారు. గుంటూరు వైద్యకళాశాలకు 250 సీట్లు మంజూరు చేయాలంటే జీజీహెచ్, జీఎమ్సీల్లో నూతనభవనాల నిర్మాణం, వైద్య పరికరాల కొనుగోలుకు సుమారుగా రూ.300 కోట్ల మేర నిధులు అవసరమవుతాయని ఏపీఎమ్ఎస్ఐడీసీకి ప్రభుత్వ వైద్య కళాశాల అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఈ నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా విడుదల చేసేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. 250 సీట్లు మంజూరు చేయాలంటే భారత వైద్య మండలి నిబంధనల మేరకు ఎలాంటి భవనాలు నిర్మించాలి, సౌకర్యాలను ఏమేరకు మెరుగుపర్చాలి, కావాల్సిన వైద్య పరికరాలు వంటి వాటిపై మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేయాలంటూ హైదరాబాద్‌కు చెందిన భార్గవ్ అసోసియేట్స్ కంపెనీకి అప్పగించారు. వైద్య కళాశాలలో శిథిలావస్థకు చేరిన రీజనల్ ల్యాబ్, బయోకెమిస్ట్రీ విభాగాల భవనాలను కూల్చి వాటి స్థానంలో ఐదు అంతస్తులతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నూతన భవనాలు నిర్మించేందుకు బార్గవ్ అసోసియేట్‌కు చెందిన ఇంజినీర్ల బృందం వైద్య కళాశాలకు వచ్చి పరిశీలించారు. వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న జీజీహెచ్‌లో మెడికల్ స్టోర్స్ విభాగం, లాండ్రి, మోడ్రన్ కిచెన్, వ్యాధి నిర్ధారణ పరీక్షా కేంద్రం, కాలినగాయలవారికి ప్రత్యేకవార్డు, బ్లడ్‌బ్యాంక్, కాన్పుల విభాగం, ఎమర్జెన్సీ మెడికల్ డిపార్ట్మెంట్, మెడికల్ ఆఫీసర్స్ రూమ్, నర్సుల క్వార్టర్స్, రెసిడెంట్ డాక్టర్స్ క్వార్టర్స్ తదితర విభాగాలను నిర్మించేందుకు ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నేడు వైద్య కళాశాలలోని అన్ని విభాగాల అధిపతులతో కళాశాల అధికారులు సమావేశమై దీనిపై చర్చించనున్నారు. -
డీఎంహెచ్‌ఓగా డాక్టర్ నాగమల్లేశ్వరి
గుంటూరు మెడికల్: జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారిగా డాక్టర్ రావిపాటి నాగమల్లేశ్వరిని నియమిస్తూ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్.వి.సుబ్రహ్మణ్యం శనివారం ఉత్తర్యులు జారీ చేశారు. ప్రస్తుతం ఆమె అదనపు జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారిగా పనిచేస్తున్నారు. జిల్లాలోని యడ్లపాడు గ్రామానికి చెందిన ఆమె గుంటూరు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు. కొనాళ్లు కొత్తపేటలోని ప్రైవేటు ఆస్పత్రిలో ప్రాక్టీస్ చేసి 1987 జూన్‌లో ప్రకాశం జిల్లా ఇంకొల్లు మెడికల్ ఆఫీసర్‌గా ప్రభుత్వ సర్వీస్‌లోకి ప్రవేశించారు. ఇన్‌సర్వీస్ కోటాలో గుంటూరు వైద్య కళాశాలలో పీజీ(ఫార్మకాలజీ) చేశారు. 2012లో డిప్యూటీ సివిల్ సర్జన్‌గా పదోన్నతి పొంది సత్తెనపల్లి, చిలుకలూరిపేట ఆస్పత్రుల్లో పనిచేశారు. తర్వాత సివిల్ సర్జన్‌గా పదోన్నతి పొంది 2013 ఏప్రిల్ నుంచి అదనపు డీఎంహెచ్‌ఓగా పనిచేస్తున్నారు. మూవ్మెంట్ ఉత్తర్వులు వచ్చాక గురువారం విధుల్లో చేరతానని డాక్టర్ నాగమల్లేశ్వరి తెలిపారు. డాక్టర్ గోపీనాయక్‌కు బదిలీ జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారిగా పనిచేస్తున్న డాక్టర్ మీరావత్ గోపీనాయక్‌ను బదిలీ చేస్తూ వైద్యఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్.వి.సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 21 నాటికి డీఎంహెచ్‌ఓగా ఐదేళ్లు పూర్తరుునందున పరిపాలన కారణాలతో బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎక్కడా పోస్టింగ్ కేటాయించకుండా ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని సూచించారు. ప్రాంతీయ శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్‌గా డాక్టర్ పద్మజారాణి గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ప్రాంతీయ శిక్షణ కేంద్రం(ఫీమేల్) ప్రిన్సిపాల్‌గా డాక్టర్ తిరుమలశెట్టి పద్మజారాణిని నియమిస్తూ వైద్యఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్.వి.సుబ్రహ్మణ్యం శనివారం ఉత్తర్యులు జారీచేశారు. ప్రస్తుతం ఆమె మంగళగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ప్రాంతీయ శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న డాక్టర్ శ్రీధర్ బాబు మార్చి 31న పదవీ విరమణ చేయటంతో ఏప్రిల్ 1 నుంచి పద్మజారాణి ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు. ఉత్తర్వులు అందిన తర్వాత బుధవారం లేదా గురువారం విధుల్లో చేరతానని ఆమె తెలిపారు. -
రాజకీయాల్లో రాణించిన వైద్యులు
గుంటూరు వైద్యకళాశాలలో విద్యనభ్యసించి, వైద్యులుగా గుర్తింపు పొందిన అనేకమంది రాజకీయాల్లోనూ గుర్తింపు పొందారు. ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాకుండా ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించి విద్యనభ్యసించిన వైద్య కళాశాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. వీరిలో ఎక్కువగా టీడీపీకి చెందినవారే ఉన్నారు. డాక్టర్ మాకినేని పెదరత్తయ్య, డాక్టర్ కోడెల శివప్రసాదరావు వారి వారి నియోజకవర్గాల నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికై సరికొత్త రికార్డు సృష్టించారు. రాష్ట్ర కేబినెట్ మంత్రులుగా పనిచేశారు. గుంటూరు-2 నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున గెలిచిన డాక్టర్ శనక్కాయల అరుణ రాష్ట్ర కేబినెట్లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. ఐదుసార్లు గెలిచిన మాకినేని, కోడెల డాక్టర్ మాకినేని పెదరత్తయ్య ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు టీడీపీ తరఫున పోటీచేసి గెలుపొంది రికార్డు సృష్టించారు.రత్తయ్య 1983లో వీజీఏ రావుపై, 1985లో చుక్కా పీటర్పాల్పై, 1989లో జి.వి. అప్పారావుపై, 1994లో చేబ్రోలు హనుమయ్యపై, 1999లో డాక్టర్ రాయపాటి శ్రీనివాస్‌పై గెలుపొందారు. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీలో మొదట్లో కొన్నాళ్లు ఉన్నా, తిరిగి టీడీపీ గూటికి చేరుకున్నారు. ప్రస్తుతానికి ఎమ్మెల్యే ఎన్నిక రేసులో మాత్రం లేరు.డాక్టర్ కోడెల శివప్రసాద్ నరసరావుపేట నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన డాక్టర్ కోడెల 1983లో మొట్టమొదటిసారిగా నరసరావుపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థి బి.సుబ్బారెడ్డిపై గెలుపొందారు. తదుపరి 1985లో కాసు వెంకట కృష్ణారెడ్డిపై, 1989లో ఎం.రాధాకృష్ణమూర్తిపై, 1994లో దొడ్డా బాలకోటిరెడ్డిపై, 1999లో కాసు వెంకట కృష్ణారెడ్డిపై గెలుపొందారు. ప్రస్తుతం టీడీపీ తరఫున సత్తెనపల్లి నుంచి పోటీ చేయనున్నారు. ఎమ్మెల్యే కాకపోయినా..ఎమ్మెల్సీ అయ్యారు... రెండుపర్యాయాలు కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసినా ఒక్కసారి కూడా విజయం వరించని డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ఎమ్మెల్సీగా, జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేశారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి 1983లో డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ తొలిసారిగా ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసి టీడీపీ అభ్యర్థి డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు చేతిలో ఓటమి చెందారు. రెండోసారి 1999లో డాక్టర్ మాకినేని పెదరత్తయ్యపై ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి చెందారు. రాష్ర్ట విభజన నే పథ్యంలో డాక్టర్ రాయపాటిశ్రీనివాస్ సోదరుడు ఎంపీ రాయపాటి సాంబశివరావును కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడంతో సోదరునికి మద్దతుగా డాక్టర్ రాయపాటి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. అనంతరం సోదరునితో పాటు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గుంటూరు తొలి మేయర్... గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు మొట్టమొదటి మేయర్‌గా ఎన్నికైన డాక్టర్ కొల్లి శారద ఇక్కడి వైద్య విద్యార్థినే. రైతునాయకుడుగా పేరుగడించిన డాక్టర్ యలమంచలి శివాజి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. డాక్టర్ ఎం.వి. రమణారెడ్డి, డాక్టర్ కె.కె.కోయ, డాక్టర్ ఫాతిమా తదితరులు గుంటూరు వైద్యకళాశాలలో చదివి వివిధ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులుగా పనిచేశారు. కొసమెరుపు... రాష్ట్ర కేబినెట్లో ఆరోగ్యశాఖ మంత్రులుగా పనిచేసిన డాక్టర్ కోడెల శివప్రసాద్, డాక్టర్ శన క్కాయల అరుణ, మంత్రిగా పనిచేసిన డాక్టర్ మాకినేని పెదరత్తయ్య, ఎమ్మెల్సీగా పనిచేసిన డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ తమకు విద్యాబుద్ధులు నేర్పిన కళాశాల అభివృదికి ఏమీ చేయలేదు. కోస్తాంధ్రలో పేదల పెద్దాసుపత్రిగా పేరుగడించిన గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రికి కూడా ఏమీ చేసిందేమీలేదు. గుంటూరు వైద్య కళాశాలకు భారత వైద్యమండలి గుర్తింపుకోసం అవసరమైన ఎంఆర్ఐ వైద్య పరికరాన్ని తెప్పించడంలో వీరంతా విఫలమయ్యారనే విమర్శలు లేకపోలేదు.