రాజకీయాల్లో రాణించిన వైద్యులు
గుంటూరు వైద్యకళాశాలలో విద్యనభ్యసించి, వైద్యులుగా గుర్తింపు పొందిన అనేకమంది రాజకీయాల్లోనూ గుర్తింపు పొందారు. ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాకుండా ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించి విద్యనభ్యసించిన వైద్య కళాశాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. వీరిలో ఎక్కువగా టీడీపీకి చెందినవారే ఉన్నారు.
డాక్టర్ మాకినేని పెదరత్తయ్య, డాక్టర్ కోడెల శివప్రసాదరావు వారి వారి నియోజకవర్గాల నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికై సరికొత్త రికార్డు సృష్టించారు. రాష్ట్ర కేబినెట్ మంత్రులుగా పనిచేశారు. గుంటూరు-2 నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున గెలిచిన డాక్టర్ శనక్కాయల అరుణ రాష్ట్ర కేబినెట్‌లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు.
ఐదుసార్లు గెలిచిన మాకినేని, కోడెల
డాక్టర్ మాకినేని పెదరత్తయ్య ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు టీడీపీ తరఫున పోటీచేసి గెలుపొంది రికార్డు సృష్టించారు.రత్తయ్య 1983లో వీజీఏ రావుపై, 1985లో చుక్కా పీటర్‌పాల్‌పై, 1989లో జి.వి. అప్పారావుపై, 1994లో చేబ్రోలు హనుమయ్యపై, 1999లో డాక్టర్ రాయపాటి శ్రీనివాస్‌పై గెలుపొందారు.
వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీలో మొదట్లో కొన్నాళ్లు ఉన్నా, తిరిగి టీడీపీ గూటికి చేరుకున్నారు. ప్రస్తుతానికి ఎమ్మెల్యే ఎన్నిక రేసులో మాత్రం లేరు.డాక్టర్ కోడెల శివప్రసాద్ నరసరావుపేట నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు.
టీడీపీ ఆవిర్భావం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన డాక్టర్ కోడెల 1983లో మొట్టమొదటిసారిగా నరసరావుపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థి బి.సుబ్బారెడ్డిపై గెలుపొందారు. తదుపరి 1985లో కాసు వెంకట కృష్ణారెడ్డిపై, 1989లో ఎం.రాధాకృష్ణమూర్తిపై, 1994లో దొడ్డా బాలకోటిరెడ్డిపై, 1999లో కాసు వెంకట కృష్ణారెడ్డిపై గెలుపొందారు. ప్రస్తుతం టీడీపీ తరఫున సత్తెనపల్లి నుంచి పోటీ చేయనున్నారు.
ఎమ్మెల్యే కాకపోయినా..ఎమ్మెల్సీ అయ్యారు...
రెండుపర్యాయాలు కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసినా ఒక్కసారి కూడా విజయం వరించని డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ఎమ్మెల్సీగా, జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేశారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి 1983లో డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ తొలిసారిగా ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసి టీడీపీ అభ్యర్థి డాక్టర్ ఎంఎస్‌ఎస్ కోటేశ్వరరావు చేతిలో ఓటమి చెందారు.
రెండోసారి 1999లో డాక్టర్ మాకినేని పెదరత్తయ్యపై ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి చెందారు. రాష్ర్ట విభజన నే పథ్యంలో డాక్టర్ రాయపాటిశ్రీనివాస్ సోదరుడు ఎంపీ రాయపాటి సాంబశివరావును కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడంతో సోదరునికి మద్దతుగా డాక్టర్ రాయపాటి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. అనంతరం సోదరునితో పాటు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
గుంటూరు తొలి మేయర్...
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు మొట్టమొదటి మేయర్‌గా ఎన్నికైన డాక్టర్ కొల్లి శారద ఇక్కడి వైద్య విద్యార్థినే. రైతునాయకుడుగా పేరుగడించిన డాక్టర్ యలమంచలి శివాజి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. డాక్టర్ ఎం.వి. రమణారెడ్డి, డాక్టర్ కె.కె.కోయ, డాక్టర్ ఫాతిమా తదితరులు గుంటూరు వైద్యకళాశాలలో చదివి వివిధ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులుగా పనిచేశారు.
కొసమెరుపు...
రాష్ట్ర కేబినెట్‌లో ఆరోగ్యశాఖ మంత్రులుగా పనిచేసిన డాక్టర్ కోడెల శివప్రసాద్, డాక్టర్ శన క్కాయల అరుణ, మంత్రిగా పనిచేసిన డాక్టర్ మాకినేని పెదరత్తయ్య, ఎమ్మెల్సీగా పనిచేసిన డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ తమకు విద్యాబుద్ధులు నేర్పిన కళాశాల అభివృదికి ఏమీ చేయలేదు. కోస్తాంధ్రలో పేదల పెద్దాసుపత్రిగా పేరుగడించిన గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రికి కూడా ఏమీ చేసిందేమీలేదు. గుంటూరు వైద్య కళాశాలకు భారత వైద్యమండలి గుర్తింపుకోసం అవసరమైన ఎంఆర్‌ఐ వైద్య పరికరాన్ని తెప్పించడంలో వీరంతా విఫలమయ్యారనే విమర్శలు లేకపోలేదు.