దొంగసొత్తుతో అసెంబ్లీలోకి ప్రవేశిస్తారా
►
కొత్త సభకు మకిలి అంటనివ్వద్దు
► పార్టీ ఫిరాయించిన 21 మందిని అనర్హులుగా ప్రకటించండి
► వాళ్లంతా చంద్రబాబుకు దొంగసొత్తే అవుతారు
► స్పీకర్ కోడెలకు వైఎస్ జగన్ బహిరంగ లేఖ
హైదరాబాద్
ఒక దొంగతనంలో అడ్డంగా ఆడియో, వీడియో సాక్ష్యాలతో దొరికిన చంద్రబాబు హైదరాబాద్ అసెంబ్లీని ఖాళీ చేసిన చంద్రబాబు.. రెండో దొంగసొత్తుతో కొత్త అసెంబ్లీలోకి ప్రవేశిస్తారా అని వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు ఆయన ఓ బహిరంగ లేఖ రాశారు. ఏసీ సీఎం చంద్రబాబు తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో వీడియో సాక్ష్యాలతో సహా అడ్డంగా దొరికిపోవడం వల్లే హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్లే ప్రక్రియ ఇంత వేగంగా జరిగిందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆయన చేసిన మరో దొంగతనం.. తమ పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలకు పార్టీ కండువాలు కప్పడమని.. వాళ్లంతా దొంగసొత్తే అవుతారని అన్నారు. వాళ్లను అనర్హులుగా ప్రకటించాలని ఏనాడో అడిగినా, మీరు ఇంతవరకు నిర్ణయం తీసుకోకపోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుందని చెప్పారు.
ఒక దొంగతనంలో దొరికి హైదరాబాద్ అసెంబ్లీ ఖాళీ చేసిన సీఎం చంద్రబాబు రెండో దొంగ సొత్తుతో కొత్త అసెంబ్లీలో ప్రవేశించకుడా చూడాల్సిన బాధ్యత మీ మీదే ఉందని గుర్తుచేశారు. స్పీకర్ పదవికి ఉన్న గౌరవం దృష్ట్యా పార్టీ మారిన 21 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించి, కొత్త సభకు మకిలి అంటకుండా చూడాలని కోరుతున్నామని.. రాజ్యాంగానికి, ప్రజల తీర్పునకు తగిన విలువ ఇవ్వాలని కోరుతున్నామని వైఎస్ జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు.
ఈ విషయాన్ని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు వై. విశ్వేశ్వరరెడ్డి, ఆదిమూలపు సురేష్ తదితరులు లోటస్‌పాండ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఫ్యాన్ గుర్తు మీద గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోకపోవడం వల్లే తమ అధ్యక్షుడు ఈ లేఖ రాయాల్సి వచ్చిందన్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలకు పచ్చ కండువాలు కప్పి పార్టీలోకి తీసుకున్నారు తప్ప వాళ్ల మీద ఎలాంటి చర్య తీసుకోలేదని, దీనిపై చర్య తీసుకోవాలని పదే పదే డిమాండ్ చేస్తున్నా ఫలితం లేదని అన్నారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం గొంతు నొక్కడానికి అన్ని ప్రయత్నాలు జరిగిన విషయాన్ని అందరూ చూశారని, ప్రజాసమస్యలపై ప్రస్తావిస్తే మాట్లాడనివ్వలేదని, రోజా లాంటి ఎమ్మెల్యేలను ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. కనీసం కొత్త అసెంబ్లీలోకి వెళ్తున్న సందర్భంలోనైనా ఇలాంటి ఘటనలకు ఫుల్‌స్టాప్ పెడదామని కోరారు. రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయని, వీటన్నింటిపై అసెంబ్లీలోచర్చించడానికి అవకావం ఉండాలని, వీటికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు.