
సాక్షి, గుంటూరు : ఎన్నికలు దగ్గరపడుతున్నా...గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీలో వర్గపోరు మరోసారి భగ్గుమంది. ఇప్పటికే ఎంపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావు ఉప్పు-నిప్పుగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా నరసరావుపేటలో కోడెలకు వ్యతిరేకంగా రాయపాటి వర‍్గం పావులు కదిపింది. కోడెల శివప్రసాదరావు చిరకాల ప్రత్యర్థి నల్లపాటి రామును టీడీపీలో చేర్చించడమే కాకుండా, ఏకంగా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ కండువా వేయించారు రాయపాటి. ఈ విషయాన్ని చివరి నిమిషం వరకూ కోడెలకు తెలియకుండా గోప్యంగా ఉంచారు. ఈ వ్యవహారంపై కోడెల తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
కాగా నరసరావుపేట నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా అరవింద బాబును కూడా కోడెల శివప్రసాదరావు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా టీడీపీ ద్రోహి అరవింద్ బాబు అంటూ తన అనచరులతో ర్యాలీ కూడా చేయించారు. అయినప్పటికీ తాను నరసరావుపేట ఎంపీగా మరోసారి పోటీ చేయాలంటే డాక్టర్ చదలవాడకు టికెట్ ఇవ్వాల్సిందేనని రాయపాటి చంద్రబాబు వద్ద పట్టుబట్టి మరీ టికెట్ ఇప్పించుకున్నారు. దీంతో జిల్లాలో ఒక బీసీ అభ్యర్థికైనా స్థానం కల్పించాలనే ఉద్దేశంతో డాక్టర్ చదలవాడకు టికెట్ ఇచ్చినట్లుగా కోడెల వర్గీయులు తమకు తామే సర్ది చెప్పుకుంటున్నారు. అయితే డాక్టర్ చదలవాడ అభ్యర్థిత్వ నిర్ణయంపై కోడెల ప్రభావం లేకుండా అధిష్టానం వ్యవహరించింది. ఈ నేపథ్యంలో ‘నల్లపాటి’ విషయంలో రాయపాటి.. కోడెలపై పైచేయి సాధించినట్లు అయింది.
Comments
Please login to add a commentAdd a comment