సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ తీరుపై జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి.లక్ష్మణ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. అంతేకాక సభాపతి గౌరవాన్ని కాపాడాలని ఆయన స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన స్పీకర్ రాజకీయ పార్టీ సమావేశాలలో పాల్గొనటం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు.
గత 4 సంవత్సరాలలో 23 మంది శాసనసభ్యులు పార్టీ ఫిరాయిస్తే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం అప్రజాస్వామికమని లక్ష్మణ రెడ్డి పేర్కొన్నారు. అంతేకాక పార్టీ ఫిరాయించిన వారిలో నలుగురు మంత్రుల పదవుల్లో కొనసాగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన గుర్తు చేశారు. నరసరావుపేట, సత్తెనపల్లిలో అవినీతి తారాస్థాయికి చేరిందన్నారు. గత ఎన్నికల్లో రూ. 11 కోట్లకు పైగా ఖర్చు చేశానని బహిరంగంగా స్పీకర్ కోడెల శివప్రసాద్ చెప్పిన విషయం విదితమే. కానీ, దానిపై ఇప్పటి వరకు ఏవ్యవస్థ చర్యలు తీసుకోకపోవటం దారుణమని లక్ష్మణ రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment