Yashwant
-
జడ్జి ఇంట్లో నోట్ల కట్టల కేసు : జస్టిస్ వర్మ ఇంటికి ‘సుప్రీం’ కమిటీ
ఢిల్లీ: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగిన సందర్భంలో నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నియమించిన ముగ్గురు ప్రధాన న్యాయమూర్తుల కమిటీ ఇవాళ జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటికి వెళ్లింది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో బయపడ్డ నోట్ల కట్టల గురించి దర్యాప్తు చేపట్టనుంది.మార్చి 14న ఢిల్లీలోని జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది. రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం తర్వాత భారీ మొత్తంలో కాలిన నోట్ల కట్టలు వెలుగులోకి వచ్చాయి. దీంతో జస్టిస్ యశ్వంత్ వర్మపై ఆరోపణలు వెల్లువెత్తాయి.#WATCH | Delhi | Three-member Judge committee to probe allegations against Justice Yashwant Varma leaves from his residence pic.twitter.com/A3Fw8N12X9— ANI (@ANI) March 25, 2025 ఇదే అంశంపై విచారణ చేపట్టాలని సుప్రీం కోర్టు..పలు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో కమిటీని నియమించింది. ఆ కమిటీలో పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి షీల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీఎస్ సందవాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి అను శివరామన్‌లను సభ్యులుగా చేర్చింది. కాలిన నోట్ల కట్టల విలువ రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా అంటూ పలు రిపోర్టులు వెలుగులోకి వచ్చింది. దీంతో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, మరో నలుగురు సీనియర్ న్యాయమూర్తుల కొలీజియం జస్టిస్ యశ్వంత్ వర్మను ఢిల్లీ హైకోర్టు నుంచి అల్హదాబాద్ హైకోర్టుకు ట్రాన్స్ఫర్ చేసింది.నోట్ల కట్టల విషయంలో స్పష్టత వచ్చే వరకు న్యాయపరమైన పనులు కేటాయించవద్దని సుప్రీం కోర్టు.. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర ఉపాధ్యాయకు ఆదేశాలు జారీ చేసింది. -
జస్టిస్ వర్మపై దర్యాప్తు... కీలక దశకు
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నగదు దొరికిన ఘటనపై దర్యాప్తు కోసం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ చురుగ్గా వ్యవహరిస్తోంది. తొలి దశ దర్యాప్తును ఇప్పటికే పూర్తిచేసింది. విచారణ కీలకమైన రెండో దశకు చేరినట్లు తెలిసింది. ఈ దశలో లభించే సాక్ష్యాధారాలే జస్టిస్ వర్మ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. త్రిసభ్య కమిటీలో పంజాబ్, హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగు, హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు సీజే జస్టిస్ జీఎస్ సంధావాలియా, కర్నాటక హైకోర్టు సీజే జస్టిస్ అనూ శివరామన్ ఉన్న విషయం తెలిసిందే. కమిటీ దర్యాప్తును సీజేఐ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. తొలి దశ దర్యాప్తులో ఫిర్యాదు ఆధారంగా కొందరు సాక్షులను మాత్రమే ప్రశ్నించారు. అందులో తేలిన అంశాల ఆధారంగా రెండో దశలో మరింత లోతుగా విచారిస్తున్నారు. విచారణ పూర్తవగానే సీజేఐకి కమిటీ నివేదిక సమర్పించనుంది. ఇందుకు గడువేమీ నిర్దేశించలేదు. జస్టిస్ వర్మ ఇంట్లో భారీగా నగదు దొరికిందన్న వార్తలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే. కాలిపోయినట్లు చెబుతున్న నోట్ల కట్టల వీడియోలు, ఫొటోలను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉపాధ్యాయకు పోలీసు కమిషనర్ అందజేశారు. వాటిని ఆయన సుప్రీంకోర్టుకు సమరి్పంచారు. ఇందుకు సంబంధించి శనివారం రాత్రి సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేసిన వీడియోలు, ఫొటోలు సంచలనం సృష్టించాయి. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నెల 14న జస్టిస్ వర్మ నివాసంలో అగ్నిప్రమాదం సందర్భంగా తమ సిబ్బందికి అక్కడ నోట్ల కట్టలేవీ దొరకలేదని ఢిల్లీ ఫైర్ సరీ్వసెస్ చీఫ్ అతుల్ గార్గ్ తొలుత ప్రకటించారు. తానలా అనలేదంటూ మర్నాడే వివరణ ఇచ్చారు. నోట్ల కట్టల విషయం నిజమేనని తేలితే జస్టిస్ వర్మను పదవి నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి సీజేఐ సిఫార్సు చేయవచ్చు. అనంతరం పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ఆమోదించడం ద్వారా హైకోర్టు న్యాయమూర్తి పదవి నుంచి ఆయనను శాశ్వతంగా తొలగించవచ్చు. సీజేఐ ఖన్నాపై ప్రశంసల వర్షం జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో దొరికిన నగదుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు, కీలక డాక్యుమెంట్లను సుప్రీంకోర్టు ప్రజా బాహుళ్యంలోకి తీసుకురావడం గొప్ప విషయమని న్యాయ నిపుణులు అన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘ఇది చాలా అరుదైన ఘటన. ఇలాంటి ఉదంతాల్లో వివరాలను సాధారణంగా గోప్యంగా ఉంచుతుంటారు. కానీ వాటిని వెబ్సైట్లో అందరికీ అందుబాటులో తేవడం ద్వారా గొప్ప సంస్కరణకు సీజేఐ శ్రీకారం చుట్టారు. ఆయనకు మా సెల్యూట్’’ అని సీనియర్ అడ్వొకేట్లు సంజయ్ హెగ్డే, ఇందిరా జైసింగ్, ఆదిష్ సి.అగర్వాల్ తదితరులు అభినందించారు. జస్టిస్ వర్మపై అంతర్గత విచారణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటును కూడా ప్రశంసించారు. జస్టిస్ వర్మ ఇంట్లో దొరికిన డబ్బు కట్టల వీడియోను చూసి ఆందోళన చెందానని ఆదిష్ చెప్పారు. పెద్ద మొత్తంలో నగదు కాలిపోయిన స్థితిలో దొరకడం పట్ల పలు అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. ఈ విషయంలో నిజానిజాలు నిగ్గుతేలాలని సీనియర్ న్యాయవాది మార్కండేయ ఖట్జూ అన్నారు. నాపై కుట్రలు: జస్టిస్ వర్మ నా ఇంట్లో ఎలాంటి నగదూ దొరకలేదు కాలిపోయాయంటున్న నోట్లతో సంబంధం లేదు నా ప్రతిష్టను దెబ్బతీసేందుకే నిరాధార ఆరోపణలు న్యూఢిల్లీ: తన అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం తర్వాత నోట్ల కట్టలేవీ లభించలేదని, తనకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తేల్చిచెప్పారు. పెద్ద ఎత్తున నగదు లభ్యమైనట్లు జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. నిరాధార ఆరోపణలతో తన ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.కె.ఉపాధ్యాయకు ఆయన లేఖ రాశారు. ఆ నోట్లతో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అవి అక్కడికెలా వచ్చాయో తనకు తెలియదన్నారు. ‘‘అగ్నిప్రమాదం జరిగిన రోజు నేను ఇంట్లో లేను. ప్రమాదం తర్వాత స్టోర్‌రూంలో కాలిన కరెన్సీ నోట్ల కట్టలను అధికారులు తొలగించడం గానీ, స్వాదీనం చేసుకోవడం గానీ జరగలేదని నా కుమార్తె, సిబ్బంది చెప్పారు. కాలిన నోట్లను అధికారులు నా కుటుంబసభ్యులకు చూపలేదు. ఆ నోట్లను వారు బయటకు తీసుకెళ్లినట్లు నా కుటుంబీకులు చూడలేదు. నాకు గానీ, నా కుటుంబీకులకు గానీ స్టోర్‌రూంలో నగదు భద్రపర్చే అలవాటు లేదు. ఆ గదిలో మంటల్లో పాక్షికంగా కాలిన నగదు దొరికినట్లు చెప్పడం పూర్తిగా అర్థరహితం, అసంబద్ధం. దీని వెనక కుట్ర ఉంది’’ అని ఆరోపించారు. అందరూ స్వేచ్ఛగా తిరిగే స్టోర్‌రూంలో ఎవరైనా భారీగా నగదు దాస్తారా అని ప్రశ్నించారు. ప్రమాదం జరిగినప్పుడు లేని నోట్లు తర్వాత అక్కడెలా ప్రత్యక్షమయ్యాయో దర్యాప్తు అధికారులే తేల్చాలన్నారు. ‘‘మేం బ్యాంకు ఖాతాల నుంచే ఆర్థిక లావాదేవీలు చేస్తుంటాం. నగదు అవసరమైనప్పుడు బ్యాంకు నుంచి విత్‌డ్రా చేస్తుంటాం. వాటికి అన్ని లెక్కలూ ఉన్నాయి’’ అని చెప్పారు. -
మంటల్లో కాలిపోయిన నోట్ల కట్టలు.. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో వీడియోలు..
ఢిల్లీ: దేశంలో భారీ అవినీతి ఆరోపణ నడుమ జస్టిస్ యశ్వంత్ వర్మ పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న యశ్వంత వర్మ ఇంట్లో ఇటీవల అగ్ని ప్రమాదం జరగ్గా, అక్కడ పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయటపడ్డాయి. నోట్ల కట్టలన్నీ మంటల్లో కాలిపోయాయి దీనికి సంబంధించిన వీడియోను ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు.ఇక, అగ్ని ప్రమాదం సందర్భంగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయన్న ఆరోపణలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.కె.ఉపాధ్యాయ.. శనివారం 25 పేజీల నివేదికను సుప్రీంకోర్టు సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నాకు సమర్పించారు. అందులో జస్టిస్ యశ్వంత్ వర్మ వివరణతోపాటు ఢిల్లీ పోలీసు కమిషనర్ అందించిన వివరాలు, ఫొటోలు, వీడియోలు ఉన్నాయి. అగ్నిమాపక శాఖ ఆపరేషన్ వివరాలూ ఫొటోలు, వీడియోల్లో ఉన్నాయి. సీజేఐ రాసిన లేఖ కూడా ఉంది.ఢిల్లీ హైకోర్టు సీజే సమర్పించిన నివేదికను పరిశీలిస్తే.. సగం కాలిన నోట్ల కట్టలను గురించి అధికారిక ప్రస్తావన కనిపించింది. దీనిపై అధికారిక సమాచారం ఉందన్న విషయం అందులో ఉంది. మరోవైపు స్టోర్ రూంలో తానుగానీ, తన కుటుంబ సభ్యులుగానీ ఎటువంటి నగదును ఉంచలేదని సీజే జస్టిస్ ఉపాధ్యాయకు ఇచ్చిన వివరణలో జస్టిస్ యశ్వంత్ వర్మ పేర్కొన్నారు. తమకు చెందిన నగదు దొరికిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.BREAKING 🚨Video of the cash pile at Justice Yashwant Varma’s residence. Delhi Police submits video of the cash pile, Supreme Court makes the video public. Justice Varma has said he has no knowledge of any such cash: pic.twitter.com/T0l5pkJvMK— Shiv Aroor (@ShivAroor) March 22, 2025మరోవైపు.. జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీగా నగదు దొరికిన ఘటనపై సమగ్ర విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా శనివారం త్రిసభ్య కమిటీ నియమించారు. ఈ కమిటీలో పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగ్, హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.ఎస్.సంధావాలియా, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అనూ శివరామన్‌ను సభ్యులుగా నియమించారు. ఇదిలా ఉండగా.. ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మకు ఎలాంటి న్యాయ సంబంధిత విధులు అప్పగించవద్దని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.కె.ఉపాధ్యాయను సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆదేశించారు. -
జస్టిస్ యశ్వంత్ వర్మపై విచారణకు త్రిసభ్య కమిటీ
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీగా నగదు దొరికిన ఘటనపై సమగ్ర విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా శనివారం త్రిసభ్య కమిటీ నియమించారు. ఈ కమిటీలో పంజాబ్, హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగ్, హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.ఎస్.సంధావాలియా, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అనూ శివరామన్‌ను సభ్యులుగా నియమించారు.మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మకు ఎలాంటి న్యాయ సంబంధిత విధులు అప్పగించవద్దని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.కె.ఉపాధ్యాయను సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆదేశించారు. సీజేఐకి నివేదిక సమర్పించిన జస్టిస్ డి.కె.ఉపాధ్యాయ జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీగా నోట్ల కట్టలు లభ్యమైన ఘటనపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.కె.ఉపాధ్యాయ తమ నివేదికను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు సమర్పించారు. యశ్వంత్ వర్మ ఇంట్లో నగదు లభించడంపై జస్టిస్ డి.కె.ఉపాధ్యాయ అంతర్గత విచారణ చేపట్టారు. సాక్ష్యాధారాలు, సమాచారం సేకరించారు. సంబంధిత అధికారులతో చర్చించారు. అన్ని అంశాలతో నివేదిక సిద్ధం చేసి, సీజేఐకి అందజేశారు. దీని ఆధారంగా జస్టిస్ యశ్వంత్ వర్మపై సుప్రీంకోర్టు తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. -
న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు లభ్యం కావడం సంచలనాత్మకంగా మారింది. ఇదంతా లెక్కల్లో చూపని అక్రమ నగదేనని అధికారులు చెబుతున్నారు. సాక్షాత్తూ న్యాయమూర్తి ఇంట్లో భారీగా సొమ్ము లభించడం రాజకీయంగా పెనుదుమారం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా తీవ్రంగా స్పందించారు.యశ్వంత్ వర్మపై బదిలీ వేటు వేయాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అవినీతికి పాల్పడి అక్రమంగా నగదు కూడబెట్టినట్లు విచారణలో తేలితే యశ్వంత్ వర్మను పదవి నుంచి తొలగించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. అయితే, ఆయన ఇంట్లో ఎంత నగదు దొరికిందనే సంగతి అధికారులు ఇంకా బయటపెట్టలేదు. ఈ నెల 14వ తేదీన నగదు లభించగా, ఈ నెల 20దాకా ఆయన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించడం గమనార్హం. వారం రోజులదాకా విషయం బయటకు రాలేదు. అగ్నిప్రమాదంతో బయటపడ్డ నగదు ఢిల్లీ తుగ్లక్ రోడ్డులోని అధికారిక నివాసంలో జస్టిస్ యశ్వంత్ వర్మ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఈ నెల 14వ తేదీన రాత్రి సమయంలో ఆ ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి 11.30 గంటల సమయంలో యశ్వంత్ వర్మ కుటుంబ సభ్యులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఢిల్లీ ఫైర్ సర్విసు సిబ్బందితోపాటు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మంటలను అర్పివేశారు. ఆ సమయంలో యశ్వంత్ వర్మ ఇంట్లో లేరు. మంటలను ఆర్విన తర్వాత గదులను తనిఖీ చేస్తుండగా, ఓ గదిలో భారీగా నోట్లకట్టలు ఉన్నట్లు గుర్తించి పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ హోంశాఖకు తెలియజేశారు. నగదు వివరాలను తెలియజేస్తూ ఒక రిపోర్టు అందజేశారు.హోంశాఖ ఈ రిపోర్టును సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నాకు సమర్పించింది. ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో అక్రమ నగదు లభించడాన్ని జస్టిస్ సంజీవ్ ఖన్నా తీవ్రంగా పరిగణించారు. ఆయన నేతృత్వంలో సుప్రీంకోర్టు కొలీజియం గురువారం సమావేశమైంది. యశ్వంత్ వర్మను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. వాస్తవానికి యశ్వంత్ వర్మ 2021లో అలహాబాద్ హైకోర్టు నుంచే బదిలీపై ఢిల్లీ హైకోర్టుకు వచ్చారు. తాజా వివాదం నేపథ్యంలో యశ్వంత్ వర్మ శుక్రవారం విధులకు హాజరు కాలేదు. ఆయనపై సుప్రీంకోర్టు కొలీజియం అంతర్గత విచారణ ప్రారంభించినట్లు తెలిసింది.కేవలం బదిలీతో సరిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కొలీజియంలోని కొందరు సభ్యులు సూచించినట్లు సమాచారం. యశ్వంత్ వర్మ వ్యవహార శైలిపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ నుంచి కొలీజియం వివరణ కోరింది. తాజా వివాదంపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సైతం విచారణ ప్రారంభించారు. యశ్వంత్ వర్మ విషయంలో తప్పుడు వార్తలు, పుకార్లు ప్రచారంలోకి వస్తున్నా యని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నామని, విచారణతో దీనికి సంబంధం లేదని స్పష్టంచేసింది. పూర్తి విచారణ తర్వాతే చర్యలు తీసుకుంటామని తెలియజేసింది. పదవి నుంచి తొలగించవచ్చా? న్యాయమూర్తులు అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు తేలితే శాశ్వతంగా పదవి నుంచి తొలగించాలంటూ 1999లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. హైకోర్టు జడ్జిపై ఫిర్యాదు అందితే తొలుత ప్రధాన న్యాయమూర్తి విచారణ ప్రారంభించాలి. సదరు జడ్జి నుంచి వివరణ కోరాలి. జడ్జి ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందకపోయినా లేక లోతైన దర్యాప్తు అవసరమని భావించినా అందుకోసం అంతర్గత కమిటీని నియమించాలి. ఆరోపణలు నిజమేనని కమిటీ దర్యాప్తులో తేలితే.. పదవికి రాజీనామా చేయాలంటూ జడ్జిని ఆదేశించాలి. శాశ్వతంగా పదవి నుంచి తొలగించడానికి అభిశంసన చర్యలు ప్రారంభించాలంటూ పార్లమెంట్‌కు సిఫా ర్సు చేయాలి. అభిశంసన తీర్మానాన్ని పార్లమెంట్ ఆమోదిస్తే జడ్జి పదవి ఊడినట్లే. ఫైర్ సిబ్బందికి నగదు దొరకలేదు: డీఎఫ్ఎస్ చీఫ్ జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో తమ సిబ్బందికి ఎలాంటి నగదు దొరకలేదని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్(డీఎఫ్ఎస్) చీఫ్ అతుల్ గార్గ్ శుక్రవారం చెప్పారు. అగ్నిప్రమాదం జరిగినట్లు ఈ నెల 14న రాత్రి 11.35 గంటలకు కంట్రోల్ రూమ్‌కు సమాచారం వచ్చిందని, తమ సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్లి మంటలు ఆర్వివేశారని అన్నారు. 15 నిమిషాల్లో ఈ ప్రక్రియ ముగిసిందన్నారు. వారికి నగదేమీ దొరకలేదన్నారు. పార్లమెంట్లో అభిశంసించాలి జస్టిస్ యశ్వంత్ వర్మను బదిలీ చేయాలని కొలీజియం నిర్ణయించడం పట్ల పలువురు సీనియర్ న్యాయవాదులు విస్మయం వ్యక్తంచేశారు. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న జడ్జిని మరో కోర్టుకు బదిలీ చేయడం ఏమిటని అడ్వొకేట్ వికాస్ సింగ్ ప్రశ్నించారు. ఆయనతో వెంటనే రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. అవినీతిపై కఠినంగా వ్యవహరించాల్సిన వృత్తిలో ఉన్న వ్యక్తి అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకోకుండా వదిలేయడం ఏమిటని అన్నారు.చట్టం దృష్టిలో అందరూ సమానమేనని పేర్కొన్నారు. సమగ్ర దర్యాప్తు జరిపి, పూర్తి నిజాలు బయటపెట్టాలని మరో అడ్వొకేట్ రాకేశ్ ద్వివేది చెప్పారు. యశ్వంత్ వర్మ తప్పు చేసినట్లు రుజువైతే చట్టప్రకారం శిక్షించాలని సూచించారు. యశ్వంత్ వర్మ వ్యవహారంలో సుప్రీంకోర్టు కొలీజియం పూర్తి పారదర్శకంగా, నిజాయతీగా పనిచేస్తుందని ఆశిస్తున్నట్లు సీనియర్ లాయర్ ఇందిరా జైసింగ్ వెల్లడించారు. ఈ నెల 14న నోట్ల కట్టలు దొరికితే ఈ నెల 21న విషయం బయటపడడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.పనికిరాని చెత్త మాకొద్దుయశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలంటూ కొలీజియం సిఫార్సు చేయడాన్ని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ శుక్రవారం వ్యతిరేకించింది. తమ హైకోర్టు చెత్తకుండీ కాదని తేల్చిచెప్పింది. పనికిరాని చెత్తను ఇక్కడికి తరలిస్తామంటే అంగీకరించే ప్రసక్తే లేదని హెచ్చరించింది. ఈ మేరకు బార్ అసోసియేషన్ ఒక తీర్మానం ఆమోదించింది. ఎవరీ యశ్వంత్ వర్మ? వివాదానికి కేంద్ర బిందువుగా మారిన జస్టిస్ యశ్వంత్ వర్మ 1969 జనవరి 6న ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన హన్స్‌రాజ్ కాలేజీలో బీకాం(ఆనర్స్), మధ్యప్రదేశ్‌లోని రేవా యూనివర్సిటీలో ఎల్ఎల్బీ డిగ్రీ పూర్తిచేశారు. 1992 ఆగస్టు 8న అడ్వొకేట్‌గా న్యాయవాద వృత్తి ఆరంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 2014 అక్టోబర్ 13న అలహాబాద్ హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 2016 ఫిబ్రవరి 1న అదే కోర్టులో శాశ్వత జడ్జిగా ప్రమాణం చేశారు. 2021 అక్టోబర్ 11న ఢిల్లీ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. జడ్జిల నియామకం పారదర్శకంగా జరగాలి: కపిల్ సిబల్ ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో అక్రమ నగదు లభ్యం కావడం నిజంగా ఆందోళనకరమైన అంశమని సీనియర్ అడ్వొకేట్, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ అన్నారు. న్యాయ వ్యవస్థలో అవినీతిని ఎంతమాత్రం సహించడానికి వీల్లేదని చెప్పారు. న్యాయ వ్యవస్థలో అవినీతి అక్రమాలు పునరావృతం కాకుండా న్యాయమూర్తుల నియామకాన్ని మరింత పారదర్శకంగా మార్చాలని అభిప్రాయపడ్డారు. జడ్జిలను చాలాచాలా జాగ్రత్తగా నియమించాలని పేర్కొన్నారు. అవినీతి అనేది మొత్తం సమాజానికే కీడు చేస్తుందని హెచ్చరించారు. దేశంలో అవినీతి తగ్గుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అవినీతి పెరిగిపోతోందని కపిల్ సిబల్ స్పష్టంచేశారు. మరొకరైతే పెద్ద వివాదం అయ్యేది: ధన్‌ఖడ్ జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో పెద్ద ఎత్తున అవినీతి సొమ్ము దొరకడాన్ని కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేశ్ శుక్రవారం రాజ్యసభలో లేవనెత్తారు. న్యాయ వ్యవస్థలో జవాబుదారీతనం అవసరమని, అందుకోసం చట్టసభలు చొరవ తీసుకోవాలని అన్నారు. దీనిపై ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ను కోరారు.ఈ వ్యవహారంపై సభలో నిర్మాణాత్మక చర్చ జరగడానికి ఒక విధానం రూపొందించే విషయం ఆలోచిస్తానని ధన్‌ఖడ్ చెప్పారు. జడ్జి ఇంట్లో అక్రమ నగదు లభ్యమైన వెంటనే ఆ విషయం బయటకు రాకపోవడం తనను బాధించిందని వ్యాఖ్యానించారు. ఒకవేళ రాజకీయ నాయకుడు లేదా ప్రభుత్వ అధికారి లేదా పారిశ్రామికవేత్త ఇంట్లో డబ్బులు దొరికి ఉంటే వెంటనే పెద్ద వివాదం అయ్యేదని అన్నారు.బదిలీతో చేతులు దులుపుకోవద్దు: కాంగ్రెస్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మను కేవలం బదిలీ చేసి, చేతు లు దులుపుకోవడం సరైంది కాదని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖే రా శుక్రవారం పేర్కొన్నారు. ఆ డబ్బు ఎవరిదో, ఎక్కడి నుంచి వచ్చిందో తేల్చాలని డిమాండ్ చేశారు. న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా ప్రభుత్వం వ్యవహరించాలన్నారు. ఈడీ, సీబీఐల కంటే అగ్నిమాపక శాఖే అద్భుతంగా పనిచేస్తోందని పవన్ ఖేరా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. -
‘స్మార్ట్ ఫోన్ మా అబ్బాయిని అంతర్జాతీయ క్రికెటర్‌గా మార్చేసింది’
అతనికి పుట్టుకతోనే వినికిడి లోపం. పైగా మాటలు రావు. ఏ భాష సరిగా చదవడం రాదు... రాయడమూ పూర్తిగా రాదు. సైగలతోనే తన భావాలను వ్యక్తంచేస్తాడు. సాధారణ పాఠశాలలోనే చదివాడు. కష్టపడి డిప్లొమా పూర్తిచేశాడు. పదో తరగతి పాసైన తర్వాత తల్లి కొనిచ్చిన స్మార్ట్ ఫోన్లో చూసి తనకు ఇష్టమైన క్రికెట్ నేర్చుకున్నాడు. అంతర్జాతీయ బధిరుల క్రికెట్లో నంబర్ వన్ బౌలర్‌గా ఎదిగాడు. గంటకు 140 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తూ బ్యాటర్లకు ఒక చాలెంజ్‌గా మారాడు. ఇదీ.. ఎనీ్టఆర్ జిల్లా కొండపల్లికి చెందిన బధిరుల అంతర్జాతీయ క్రికెటర్ రావూరి యశ్వంత్ నాయుడు విజయగాథ. సాక్షి, అమరావతి: కొండపల్లికి చెందిన రావూరి యశ్వంత్‌నాయుడు స్మార్ట్ ఫోన్లో చూస్తూ క్రికెట్ నేర్చుకున్నాడు. మంచి బౌలర్‌గా ఎదిగాడు. ఫోన్లో క్రికెట్ పాఠాలు నేర్చుకుంటూ ఉండగా, ఆన్లైన్లో వచి్చన చిన్న మెసేజ్ చూసి 2015లో ఢిల్లీలో సెలక్షన్స్‌కు వెళ్లాడు. అప్పుడే తొలిసారిగా బధిరుల జాతీయ జట్టు ఏర్పడటంతోపాటు యశ్వంత్‌కు చోటు దక్కింది. ఆ తర్వాత జట్టులో కీలక సభ్యుడిగా మారాడు. అంతకుముందు ఏపీ తరఫున మ్యాచ్‌లు ఆడాడు. అప్పులు చేసి అండగా నిలిచిన తల్లి గత ఏడాది బధిరుల క్రికెట్‌ను బీసీసీఐ దత్తత తీసుకుంది. అప్పటివరకు మ్యాచ్‌లకు వెళితే ఖర్చంతా క్రీడాకారులదే. యశ్వంత్ తండ్రి నాగేశ్వరరావు 2015లో అనారోగ్యంతో చనిపోయారు. నాటి నుంచి అతనిని తల్లి బేబి అన్ని విధాలా ప్రోత్సహించారు. కుమారుడు క్రికెట్ ఆడేందుకు వెళ్లడానికి అప్పులు చేసి డబ్బులిచ్చారు. యశ్వంత్ 20ఏళ్ల వయసులో ఢిల్లీలో జరిగిన తొలి బధిరుల వరల్డ్ కప్‌లో భారత్ తరఫున ఆడాడు. ఆ టోరీ్నలో మనదేశం విజేతగా నిలిచింది. సాధారణ అంతర్జాతీయ పేసర్లతో సమానంగా బౌలింగ్ చేయగలిగిన యశ్వంత్ 135 జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 167 వికెట్లు తీశాడు. అయినా యశ్వంత్‌కు మ్యాచ్ ఫీజు ఉండదు. ఒక సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిస్తే రూ.1,100 ఇచ్చారు. వరల్డ్ కప్ గెలిచిన జట్టు మొత్తానికి రూ.లక్ష ఇచ్చారు. వరల్డ్ కప్ గెలిచిన సమయంలో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇచి్చన విందులో పాల్గొన్నాడు. అతని కుటుంబ సభ్యులకు ఆహా్వనం ఉన్నా డబ్బులు లేక వెళ్లలేకపోయారు. గతంలో యశ్వంత్‌కు రూ.5లక్షలు ఇవ్వాలని శాప్‌ను ప్రభుత్వం ఆదేశిస్తూ లెటర్ ఇచ్చినా డబ్బులు లేవన్నారు. మెక్‌గ్రాత్ నుంచి మెళకువలు.. గోకరాజు గంగరాజు సహకారంతో 2016లో మంగళగిరిలోని ఏసీఏ స్టేడియంలో యశ్వంత్‌కు కోచింగ్ తీసుకునే అవకాశం దక్కింది. అప్పుడే ఆ్రస్టేలియా దిగ్గజ బౌలర్ గ్లేన్ మెక్‌గ్రాత్ వచ్చారు. ఆయన యశ్వంత్ బౌలింగ్‌ని మెచ్చుకుని ఎన్నో మెళకువలు నేరి్పంచారు. స్టెయిన్ నా ఫేవరెట్.. ‘నాకు అమ్మంటే ఎంతో ఇష్టం. మా అక్క సుమ నా విజయంలో వెన్నంటే ఉంటుంది. సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ నా ఫేవరెట్. బ్యాటింగ్, కోచింగ్‌లో ద్రావిడ్‌ను చూసి ఎంతో నేర్చుకున్నా. ఈ ఏడాది ఖతార్‌లో జరగాల్సిన బధిర టీ20 వరల్డ్ కప్ వాయిదా పడింది. దాని సెలక్షన్స్‌కు వెళ్లే ముందు మంగళగిరి క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తుంటే కుడి మోకాలు వద్ద గాయమైంది. నాలుగు నెలలు రెస్ట్. త్వరలో బంగ్లాదేశ్‌లో ఆసియా కప్, కేరళలో సౌత్ జోన్, జమ్మూ–కశ్మీర్ డెఫ్ ఐపీఎల్‌కు సన్నద్ధమవుతున్నా.’ – సైగల ద్వారా వెల్లడించిన రావూరి యశ్వంత్ స్మార్ట్ ఫోన్ మా అబ్బాయి జీవితాన్ని మార్చింది ‘స్మార్ట్‌ఫోన్ పిల్లలను చెడగొడుతుందంటారు. మా అబ్బాయిని మాత్రం అంతర్జాతీయ క్రికెటర్‌గా తీర్చిదిద్దింది. మావాడికి పుట్టకతోనే వినికిడి లోపం. పైగా మాటలు రావు. వాడు 10వ తరగతి పాసైన తర్వాత ఒక చిన్న స్మార్ట్‌ఫోన్ కొనిచ్చా. దానిలో వీడియోలు చూస్తూ అంతర్జాతీయ బధిర క్రికెట్ బౌలర్లలో నంబర్ వన్‌గా ఎదిగాడు. ఇప్పుడు నా కొడుకు ఆటను నేను స్మార్ట్ ఫోన్లో చూస్తున్నాను.’ – బేబి, అంతర్జాతీయ క్రికెటర్ రావూరి యశ్వంత్ తల్లి -
ముప్పైకి పైగా భయపడే సీన్లు ఉన్నాయి
‘‘నా 30 ఏళ్ల వయసులోనే ఐటీ కంపెనీలను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేశాను. దాంతో సినిమా తీయడం సులభం అనుకున్నాను. కానీ వంద కాదు.. వెయ్యి కోట్లు ఉన్నా సినిమా చేయడం అంత సులభం కాదని తెలుసుకున్నాను. వందల మంది కలిసి పని చేస్తూ, అన్నీ కలిసి వస్తేనే ఓ సినిమా పూర్తవుతుంది. లేదంటే ఎన్ని కోట్లు డబ్బులున్నా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది’’ అన్నారు యశ్వంత్ దగ్గుమాటి. శ్రీరామ్, ఖుషీ జంటగా ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించిన హారర్ ఫిల్మ్ ‘పిండం’. యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా యశ్వంత్ దగ్గుమాటి మాట్లాడుతూ– ‘‘నాకు యూఎస్‌లో ఐటీ కంపెనీలున్నాయి. సాయికిరణ్‌కు సినిమాలపై ఆసక్తి. ఓ సినిమా చేద్దామని ఇండియా వచ్చాం. సిద్ధు జొన్నలగడ్డతో మేం చేయాల్సిన ‘డల్లాస్ దేశీ దొంగలు’ సినిమా లాక్డౌన్ వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత మరో కథ అనుకున్నాం. అది కూడా కుదర్లేదు. ఆ నెక్ట్స్ ‘పిండం’ కథను రెడీ చేశారు సాయికిరణ్. ఓ సందర్భంలో సాయికిరణ్ వాళ్ల నాన్నమ్మ ఓ భవంతిని చూపించి, ఓ కథ చె΄్పారట. ఆ కథకు కొన్ని కల్పిత అంశాలు జోడించి ‘పిండం’ కథ రాశారు. ఈ సినిమాలో ముప్పైకి పైగా భయపడే సన్నివేశాలు ఉన్నాయి. 1930, 1990, 2023.. ఇలా మూడు కాలమానాల్లో స్క్రీన్‌ప్లే ఉంటుంది. ఇక మా సంస్థలో మొదలైన తొలి చిత్రం ‘డల్లాస్‌లో దేశీ దొంగలు’ ఉంటుంది. మరికొన్ని కథలు ఉన్నాయి’’ అన్నారు. -
కుమారులే.. కాడ్డెదులుగా..
మహబూబ్‌నగర్: పుడమితల్లిని నమ్ముకున్న ఓ రైతు చివరికి కన్న కొడుకులను కాడెద్దులుగా మార్చారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని గోకులపాడుకు చెందిన అయ్యన్న ఉల్లిపంట సాగుచేశాడు. ఇటీవల విస్తారంగా కురిసిన వర్షాలకు కలుపు ఏపుగా పెరిగింది. దీంతో కలుపుతీతకు ఇటు కూలీలు దొరకక.. అటు కాడెద్దులు లేకపోవడంతో తన ఇద్దరు కుమారులు యశ్వంత్, రుద్రప్రతాప్‌లను కాడెద్దుల మాదిరిగా గుంటుక కట్టి కలుపు తీశారు. ఆదివారం చంద్రశేఖర్‌నగర్ శివారులో కనిపించిన ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. – మానవపాడు -
జ్యోతిక పసిడి పరుగు.. రజతం గెలిచిన యశ్వంత్
న్యూఢిల్లీ: తొలిసారి నిర్వహిస్తున్న జాతీయ అండర్–23 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రెండో రోజు తెలుగు రాష్ట్రాల అథ్లెట్లు సత్తా చాటుకున్నారు. మహిళల 400 మీటర్ల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి దండి జ్యోతికశ్రీ స్వర్ణ పతకాన్ని సాధించింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రాంతానికి చెందిన జ్యోతికశ్రీ 400 మీటర్ల దూరాన్ని 53.05 సెకన్లలో ముగించి విజేతగా నిలిచింది. పురుషుల 110 మీటర్ల హర్డిల్స్ విభాగంలో వైజాగ్‌కు చెందిన లావేటి యశ్వంత్ రజతం గెల్చుకున్నాడు. కాగా యశ్వంత్ 14.25 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచాడు. పురుషుల 400 మీటర్ల ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ నక్కా రాజేశ్ 48.94 సెకన్లలో గమ్యానికి చేరి ఎనిమిదో స్థానంలో నిలిచాడు. మహిళల 100 మీటర్ల విభాగంలో తెలంగాణకు చెందిన నిత్య కాంస్య పతకం సొంతం చేసుకుంది. నిత్య 11.90 సెకన్లలో రేసును పూర్తి చేసి మూడో స్థానాన్ని సంపాదించింది. 200 మీటర్ల విభాగంలో మాయావతి ఫైనల్‌కు చేరింది. చదవండి: Ashwin Vs Morgan: అందుకే ఆ గొడవ జరిగింది: దినేశ్ కార్తిక్ -
ప్రాణం తీసిన కుటుంబ కలహాలు
కుమారుడితో సహా తల్లి ఆత్మహత్య ఖిల్లాఘనపురం: కుటుంబ కలహాలు తల్లీ కొడుకు ప్రాణాలు తీశాయి. ముక్కుపచ్చలారని మూడేళ్ల కొడుకుపై కిరోసిన్ పోసి నిప్పంటించి.. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఆదివారం వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం మానాజిపేటలో చోటుచేసుకుంది. బిజినేపల్లి మండలం మహదేవునిపేటకు చెందిన నందమోని కురుమయ్య కుమార్తె మాధవిని మూడేళ్ల క్రితం ఖిల్లాఘనపురం మండలం షాపురం గ్రామానికి చెందిన జుట్టు శ్రీనువాసులుకు ఇచ్చి వివాహం చేశారు. దంపతులిద్దరు మహదేవునిపేటలో ఉండి కూలీపనులు చేసుకుంటున్నారు. డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య చిన్నపాటి తగాదా వచ్చింది. శ్రీనువాసులు తన పాత ఆటోను మరమ్మతు చేయించుకుంటానని స్వగ్రామానికి వెళ్లాడు. మాధవి తన అక్కగారి ఊరైన మానాజిపేటకు వెళ్లింది. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన మూడేళ్ల కొడుకు యశ్వంత్‌పై ముందు కిరోసిన్ పోసి తానూ పోసుకుని నిప్పు అంటించుకుంది. ఇంటి ముందు ఉన్న సపారం (గడ్డితో ఉన్న కప్పు)కు అంటుకున్నాయి. పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో ఇరుగుపొరుగు వచ్చి మంటలను ఆర్పివేసే సరికి తల్లి, కొడుకు మంటల్లో కాలిపోయారు. -
విద్యుదాఘాతంతో బాలుడి మృతి
నల్లబెల్లి మండలం గుండ్లపహాడ్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అనుముల యశ్వంత్(13) అనే బాలుడు వ్యవసాయ బావి వద్ద నున్న మోటారును బంద్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. -
నిర్లక్ష్యం ఖరీదు.. నిండు ప్రాణం
మండాకురిటి(సంతకవిటి) : మరుగుదొడ్ల కోసం నిర్మించిన సెప్టిక్ ట్యాంకులో పడి యశ్వంత్(5) అనే బాలుడు మృతి చెం దారు. శనివారం మధ్యాహ్నం ఈ సంఘటన జరగ్గా సాయంత్రం మృతదేహం లభిం చింది. విజయనగర జిల్లా గరివిడి మండలం కోడూరు గ్రామానికి చెందిన కెల్ల సన్యాసిరావు భార్య భారతి స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మం డాకురిటి. ఇద్దరు కుమారులతో సహా భార్యాభర్తలి ద్దరూ రెండురోజుల క్రితం మండాకురిటి వచ్చారు. శని వారం సాయంత్రం వీరు తిరిగి కోడూరుకు వెళ్లాల్సి ఉంది. అయితే మధ్యాహ్నం వీరి పెద్ద కుమారుడు యశ్వంత్ ఆటాడుకుంటూ ఇంటి సమీపంలోనే ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాల వైపు వెళ్లాడు. కొడుకు ఎంతకూ తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు వెతుకులాట ప్రారంభించారు. ఆ క్రమంలో పీహెచ్సీ భవనాల సమీపంలో మరుగుదొడ్డ కోసం నిర్మించిన ట్యాంకుల వద్ద బురదలో బాలుడి అడుగుజాడలు కనిపించాయి. దాంతో అనుమానంతో నీళ్లతో నిండి ఉన్న ట్యాంకులోకి దిగి వెతికారు. యశ్వంత్ మృతదేహాన్ని కనుగొని బయటకు తీసుకొచ్చారు. విగతజీవుడైన కుమారుడిని చూడగానే తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఐదేళ్లకే కొడుకు నూరేళ్ల జీవితం ముగిసిపోయిందని గుండెలవిసేలా వలపించారు. మరోవైపు తనను చూడ్డానికొచ్చిన కూతురు, అల్లుడికి పుత్రవియోగం కలగడాన్ని యశ్వంత్ తాత రామారావు తట్టుకోలేకపోయారు. విలపిస్తూ సొమ్మసిల్లిపోయాడు. అయితే ఈ సంఘటనపై తమకు ఎటువంటి సమాచారం అందలేదని స్థానిక ఎస్సై పి.సురేష్‌బాబు చెప్పారు. నిర్లక్ష్యమే కారణం ఇంతటి దారుణానికి అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని బాధితులతోపాటు చుట్టుపక్కల ప్రజలు ఆరోపించారు. మరుగుదొడ్డి ట్యాంకు నిర్మించి మూత వేయకుండా వదిలేయడం వల్లే నిండు ప్రాణం పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో రామారావు ఇంటి సమీపంలో రెండేళ్ల క్రితం పీహెచ్సీ భవనాల నిర్మాణం ప్రారంభించారు. రూ.67 లక్షలతో నిర్మిస్తున్న ఈ భవనాలకు మరుడుదొడ్డి వసతి కోసం 15 అడుగుల లోతులో రెండు ట్యాంకులు నిర్మించారు. అయితే వాటికి పైకప్పులు వేయకుండా వదిలేశారు. ఇటు కాంట్రాక్టర్, అటు అధికారులు ఈ విషయం పట్టించుకోలేదు. వర్షాలకు ఆ ట్యాంకులు నీటితో నిండిపోయాయి. ఇప్పుడు ఈ దుర్ఘటనకు కారణమయ్యాయి. ఏడాదిలో నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా ఆ విషయమూ అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. -
నిన్ను చూసి వెన్నెలే అనుకున్నా!
అనూప్‌తేజ్, యశ్వంత్, ప్రణమ్య ముఖ్యతారలుగా రాజశేఖర్ ఎ.ఎం. దర్శకత్వంలో టి.విజయవాసుదేవరెడ్డి నిర్మించిన ‘నిన్ను చూసి వెన్నెలే అనుకున్నా’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని ‘అల్లరి’ నరేష్ ఆవిష్కరించి, తొలి ప్రతిని రఘు మాస్టర్‌కి అందించారు. ఈ సందర్భంగా ‘అల్లరి’ నరేష్ మాట్లాడుతూ -‘‘టైటిల్ అందరికీ నచ్చేలా ఉంది. సినిమా కూడా అదే రీతిలో ఆహ్లాదకరంగా ఉంటుందనుకుంటున్నా’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘టైటిల్ అందరికీ నచ్చేలా ఉంది. సినిమా కూడా అదే రీతిలో ఆహ్లాదకరంగా ఉంటుందనుకుంటున్నా’’ అన్నారు. లవ్, రొమాన్స్ యాక్షన్, ఫిక్షన్, థ్రిల్లర్ అన్నీ ఉన్న సినిమా ఇదని దర్శకుడు పేర్కొన్నారు’’ అని చెప్పారు. అనూప్‌తేజ్ మాట్లాడుతూ -‘‘నా తొలి సినిమా ‘కేక’. ఇది నాకు మంచి బ్రేక్ ఇస్తుంది’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల విశ్వనాథ్, సుభాష్ నారాయణ్, జీవన్ కిషోర్ రెడ్డి తదితరులు మాట్లాడారు.