కుమారుడితో సహా తల్లి ఆత్మహత్య
ఖిల్లాఘనపురం: కుటుంబ కలహాలు తల్లీ కొడుకు ప్రాణాలు తీశాయి. ముక్కుపచ్చలారని మూడేళ్ల కొడుకుపై కిరోసిన్ పోసి నిప్పంటించి.. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఆదివారం వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం మానాజిపేటలో చోటుచేసుకుంది. బిజినేపల్లి మండలం మహదేవునిపేటకు చెందిన నందమోని కురుమయ్య కుమార్తె మాధవిని మూడేళ్ల క్రితం ఖిల్లాఘనపురం మండలం షాపురం గ్రామానికి చెందిన జుట్టు శ్రీనువాసులుకు ఇచ్చి వివాహం చేశారు. దంపతులిద్దరు మహదేవునిపేటలో ఉండి కూలీపనులు చేసుకుంటున్నారు.
డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య చిన్నపాటి తగాదా వచ్చింది. శ్రీనువాసులు తన పాత ఆటోను మరమ్మతు చేయించుకుంటానని స్వగ్రామానికి వెళ్లాడు. మాధవి తన అక్కగారి ఊరైన మానాజిపేటకు వెళ్లింది. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన మూడేళ్ల కొడుకు యశ్వంత్‌పై ముందు కిరోసిన్ పోసి తానూ పోసుకుని నిప్పు అంటించుకుంది. ఇంటి ముందు ఉన్న సపారం (గడ్డితో ఉన్న కప్పు)కు అంటుకున్నాయి. పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో ఇరుగుపొరుగు వచ్చి మంటలను ఆర్పివేసే సరికి తల్లి, కొడుకు మంటల్లో కాలిపోయారు.