
ఇదేం విచిత్రమో..
వీధుల్లో సగం ఇళ్లే మునుగుతున్నాయట..
చింతూరు: పోలవరం ముంపు గ్రామాలపై కొందరు అధికారుల తీరు విచిత్రంగా ఉంటోంది. వారి తప్పి దాల కారణంగా ప్రజలు వీధిన పడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. చింతూరు మండలం ముకునూరులోని ఓ వీధిలో కుడివైపున ఉన్నప్రాంతం పోలవరం ప్రాజెక్ట్ కారణంగా ముంపునకు గురవుతున్నట్టు తేల్చిన అధికారులు ఎడమవైపు ఉన్నప్రాంతం ముంపులో లేదని నమోదు చేశారు. దీంతో విస్తుపోయిన గ్రామస్తులు ఇదెక్కడి విడ్డూరమంటూ మండిపడుతున్నారు. ఒకే గ్రామంలో పక్కపక్కనే ఉన్న గృహాలు ఓవైపు మునిగి మరోవైపు మునిగిపోకుండా ఎలాఉంటాయని వారు ప్రశ్నిస్తున్నారు.
ఆ ఇళ్లు ముంపులో లేవంట
ముకునూరులో మొత్తం 175 గృహాలుండగా 120 గృహాలు ముంపులో ఉండగా 55 ఇళ్లు ముంపులో లేవంటూ పోలవరం అధికారులు చెబుతున్నారని. దీనిపై అధికారులను కలిసి అడిగితే సర్వేలో అలానే తేలిందని అంటున్నా రని గ్రామస్తులు తెలిపారు. దీంతో గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని గ్రామస్తులందరికీ కలిపి పరిహారం ఇవ్వాలని లేకుంటే తమకు కూడా పరిహారం వద్దని తేల్చిచెప్పినట్లు వారు తెలిపారు. ఇరువైపులా ఎంతోమందికి చెందిన కుటుంబాలు నివాసముంటున్నాయని, ముంపు పేరుతో ఈ ప్రాంతాలను విడదీస్తే కుటుంబాలు చెల్లాచెదురవుతాయని గ్రామస్తులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఐటీడీఏ పీవో అపూర్వభరత్‌ను కలసి విజ్ఞప్తి చేయగా పరిశీలించి సర్వే చేపట్టి అధికారులను నివేదిక అందచేస్తామని చెప్పినట్లు వారు తెలిపారు.
● ఇదేక్రమంలో ఏజీకోడేరులో కూడా గ్రామంలోని 693 గృహాలను ముంపులో చేర్చిన అధికారులు 23 ఇళ్లు ముంపులో లేవనడంతో వారంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
● ఉలుమూరులో 172 గృహాలుండగా 116 గృహా లు ముంపు జాబితాలో ఉండగా 56 గృహాలను ముంపు జాబితాలో చేర్చలేదు.
● చింతూరులో 1,508 గృహాలను ముంపు జాబితాలో చేర్చగా సుమారు 450 గృహాలను ముంపు జాబితాలో లేవు. మరో వైపు చింతూరును ఆనుకుని ఉన్న నిమ్మలగూడెంలో 120 గృహాలుండగా వాటిని కూడా ముంపుజాబితాలో చేర్చకపోవడంతో ఇటీవల గ్రామస్తులు ఈ విషయాన్ని పీవో అపూర్వభరత్ దృష్టికితీసుకెళ్లడంతో సర్వే చేయించి న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. మండలంలోని మల్లెతోటలో 272 గృహాలకు గాను 39 గృహాలను ముంపు జాబితాలో చేర్చలేదు.
సర్వే నివేదిక అందజేస్తాం
ఐటీడీఏ పీవో, ఆర్‌అండ్‌ఆర్ అధికారి ఆదేశాల మేరకు ఆయా గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది ద్వారా సర్వే చేయడం జరిగింది.ముంపు జాబితాలో లేని ప్రాంతాలపై సర్వే నివేదికను ఆర్‌అండ్‌ఆర్ అధికారికి నివేదించాం. తదుపరి ఆదేశాల మేరకు చర్యలు చేపడతాం.
– చిరంజీవి, తహసీల్దార్, చింతూరు
సర్వే నివేదికలో విచిత్రాలు, వింతలు
అధికారుల నిర్వాకంపై నిర్వాసితుల ఆగ్రహం
గ్రామం మొత్తం ఇళ్లు ముంపులో జాబితాలో
చేర్చినవి లేనివి
ముకునూరు 175 120 55
ఏజీకోడేరు 716 693 23
ఉలుమూరు 172 116 56
చింతూరు 1,958 1,508 450
నిమ్మలగూడెం 120 - - 120
మల్లెతోట 272 233 39