
ప్రాణం తీసిన ఈత సరదా
ముంచంగిపుట్టు: ఈత సరదా ప్రాణం తీసింది. ఎండవేడిని తట్టుకోలేక స్నేహితులతో కలిసి మత్స్యగెడ్డలో ఈత కొడదామని వెళ్లిన ఓ గిరిజన యువకుడు నీటిలో మునిగి మరణించాడు. స్థానిక ఎస్‌ఐ రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం మధ్యాహ్నం ఎండ వేడి అధికంగా ఉండడంతో మండలంలోని ఏనుగురాయి పంచాయతీ నడుమూరు గ్రామానికి చెందిన సిరగం వంశీకృష్ణ(18) తన స్నేహితులు కవెర్ల భూపతిరాజు, సిరగం మణికంఠ,సిరగం సిద్ధార్థ,కవెర్ల జగదీష్ వర్మ,సిమిలియ శ్రీనులతో కలిసి కుమ్మిగూడ గ్రామ సమీపంలో మత్స్యగెడ్డలో ఈత కొడదామని వెళ్లాడు.అందరూ ఈత కొడుతుండగా వంశీకృష్ణ ప్రమాదవశాత్తూ మత్స్యగెడ్డలో మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు వంశీకృష్ణ మునిగిపోయిన చోట గాలించారు. ఫలితం లేకపోవడంతో నడుమూరు గ్రామస్తులకు జరిగిన సంఘటనపై సమాచారం ఇచ్చారు.దీంతో నడుమూరు,ఏనుగురాయి,గాదెలబురుగు,రాతులపుట్టు,కుమ్మిగూడ గ్రామాలకు చెందిన గిరిజనులు తరలి వచ్చి మత్స్యగెడ్డలో నాటుపడవతో గాలించారు. గంట తరువాత వంశీకృష్ణ మృతదేహాన్ని బయటకు తీశారు.ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ రామకృష్ణ సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. వంశీకృష్ణ స్నేహితులతో మాట్లాడి ప్రమాదం వివరాలు సేకరించారు. తమ కుమారుడు వంశీకృష్ణను డాక్టర్ చదివిద్దామనుకున్నామని, ఇంతలో మృతి చెందాడని తల్లిదండ్రులు జానకమ్మ,నాగరాజు గుండెలు అవిసేలా రోదించడం అందరిని కలిసివేసింది. వంశీకృష్ణ వారికి రెండో కుమారుడు. ముంచంగిపుట్టు పీహెచ్‌సీలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.సంఘటన జరిగిన కుమ్మిగూడ మత్స్యగెడ్డ వద్ద ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందారని,చాలా ప్రమాదకర ప్రదేశమని స్థానికులు తెలిపారు.
వంశీ కృష్ణ (ఫైల్)
మత్స్యగెడ్డలో మునిగి
గిరిజన యువకుడి మృతి
నడుమూరులో విషాదం

ప్రాణం తీసిన ఈత సరదా

ప్రాణం తీసిన ఈత సరదా