
డ్రోన్లను తిప్పికొట్టేందుకు వ్యూహాత్మక అడుగులు
సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో ఈఎన్సీ ఎయిర్ బేస్ ఐఎన్ఎస్ డేగాలో యుద్ధ విమానాల పైలట్లకు శిక్షణ తీవ్రతరం చేశారు. వాస్తవంగా ఏడాది పొడవునా ఇక్కడ పైలట్ల శిక్షణ కొనసాగుతుంటుంది. కానీ ప్రస్తుతం యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో దీన్ని మరింత చురుగ్గా కొనసాగించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ఆధునిక సాంకేతికతను వినియోగించుకొని దాడులకు తెగబడుతున్న శత్రుదేశాల కుయుక్తుల్ని తిప్పికొట్టేందుకు భారత నౌకాదళం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన నేవల్ ఎయిర్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ సిస్టమ్ (ఎన్ఏఐఎస్ఎస్)ను సిద్ధం చేశారు. ఎయిర్ స్టేషన్లో స్మార్ట్ ఫెన్స్‌ను అమర్చి.. సీసీకెమెరాల సాయంతో పహారా కాస్తున్నారు. స్మార్ట్ ఫెన్స్లోపలికి ఏ ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాఫ్టర్, మనిషి వచ్చినా.. వెంటనే కంట్రోల్ రూమ్‌కు అప్రమత్తం చేయడంతో పాటు సెకెన్ల వ్యవధిలో మొత్తం వ్యవస్థకు సమాచారం అందజేస్తుంది. ఎయిర్‌స్టేషన్ చుట్టూ ఇన్ఫ్రారెడ్ డివైజ్‌లు, మోషన్ డిటెక్టర్స్, ఏ చిన్న రంధ్రం చేసి లోపలికి ఎవరు ప్రవేశించాలని భావించినా వారిని మట్టుపెట్టేలా యాంటీ పెనిట్రేషన్, థర్మల్ సెన్సార్లతో పాటు డ్రోన్ల పర్యవేక్షణతో పహారా ముమ్మరం చేసినట్లు సమాచారం. ఎయిర్ స్టేషన్‌కు దాదాపు 2 కిలోమీటర్ల వరకూ ఇన్ఫ్రారెడ్ సిగ్నల్స్ వ్యాపింపజేసి.. శత్రువుల చొరబాట్లను సులువుగా పసిగట్టనున్నారు. అదేవిధంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన నేవల్ యాంటీ డ్రోన్ సిస్టమ్ (ఎన్ఏడీఎస్)ని కూడా డేగాలో అప్రమత్తం చేశారు. భారీ డ్రోన్ల నుంచి తూనీగల పరిమాణంలో ఉన్న మైక్రో డ్రోన్ల వరకూ లేజర్ ఆథారిత కిల్ మెకానిజం సహాయంతో గుర్తించి.. వాటిని మట్టుపెట్టేలా రూపొందించిన ఈ వ్యవస్థ సాయంతో 360 డిగ్రీల కోణంలో.. 10 కిలోమీటర్ల పరిధిలో ఏ రకమైన డ్రోన్ ఉన్నా.. పసిగట్టి నాశనం చేయగలదు.