
అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ వెల్లడి
ఈవీఎం భద్రతా లోపాలకు సంబంధించి ఆధారాల సమర్పణ
బ్యాలెట్ ఆధారిత ఎన్నికల వల్లే ప్రజల్లో పెరగనున్న నమ్మకం
ఎలాన్ మస్క్ కూడా ఇదే హెచ్చరిక
దేశ వ్యాప్తంగా ఈవీఎంలపై చర్చ
సాక్షి, అమరావతి: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వ్యవస్థను సులువుగా హ్యాక్ చేయొచ్చని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ పేర్కొన్నారు. అందువల్ల దేశ (అమెరికా) వ్యాప్తంగా అన్ని ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్‌లకు మారాలని పిలుపునిచ్చారు. దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరైన క్యాబినెట్ సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రతా లోపాలకు సంబంధించి పలు ఆధారాలను సమావేశం ముందుంచారు. 2020 ఎన్నికల సమయంలో మాజీ సైబర్ సెక్యూరిటీ చీఫ్ క్రిస్ క్రెబ్స్ చర్యలపై దర్యాప్తు చేయాలని జస్టిస్ డిపార్ట్‌మెంట్ (డీవోజే)ని ఆదేశిస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది.
‘ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వ్యవస్థ చాలా కాలంగా హ్యాకర్లకు అందుబాటులో ఉంది. తద్వారా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో ఎన్నో ఉదాహరణలు మన ముందున్నాయి. ఈ విధానంలో ఫలితాలను తారుమారు చేయడానికి, దుర్వినియోగం చేసేందుకు అవకాశం ఉందని చెప్పేందుకు మా వద్ద పలు ఆధారాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పేపర్ బ్యాలెట్‌లను తీసుకురావాలనే మీ (ట్రంప్) ఆదేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. అప్పుడే ఓటర్లు ఎన్నికల సమగ్రతపై నమ్మకం కలిగి ఉంటారు’ అని గబ్బార్డ్ స్పష్టం చేసినట్లు ప్రముఖ జర్నలిస్ట్ స్మిత ప్రకాశ్ తెలిపారు. కాగా, గబ్బార్డ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. యునైటెడ్ స్టేట్స్‌లో ఎన్నికల భద్రతపై ఈ వ్యాఖ్యలు భారీ చర్చకు దారితీశాయి.

ఇదిలా ఉండగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గురించి ఇటీవల టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ కూడా హెచ్చరించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై ఆధార పడటం సరికాదని చెప్పారు. అవి హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ‘ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తొలగించాలి. ‘సాంకేతికత, ఏఐ ద్వారా హ్యాక్ అవ్వడానికి ఉన్న అవకాశం చిన్నదైనా, అది ఎంతో పెద్ద సమస్యకు దారితీస్తుంది’ అని మస్క్ తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ (మునుపటి ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. కాగా, తులసి గబ్బార్డ్ వ్యాఖ్యలపై మన దేశంలో కూడా చర్చ జరుగుతోంది. గత ఏడాది ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఈవీఎంలపై పలు అనుమానాలు వ్యక్తం అయిన సంగతి తెలిసిందే.