సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని, ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసింది. పోలింగ్‌కు సంబంధించిన దుష్ప్రచారాలను నమ్మొద్దని కోరింది. పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూలైన్‌లో వేచి ఉన్నారని, దీంతో ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఓటర్లు ఎటువంటి పుకార్లు నమ్మవద్దని, ఈవీఎంలలో సాంకేతిక లోపాలను సాంకేతిక సిబ్బంది పరిష్కరించారని తెలిపారు. సక్రమంగా కనెక్షన్లు ఇవ్వకపోవడంవల్ల కొంత ఆలస్యం జరిగిందన్నారు. ప్రతి ఓటరూ తప్పనిసరిగా ఓటు వేయాలని, సాయంత్రం ఆరుగంటల వరకు క్యూలైన్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిందని ద్వివేది తెలిపారు.
పలుచోట్ల ఈవీఎంలలో సమస్యలు తలెత్తాయని, ఆ సమస్యలను చాలావరకు సరిదిద్దామని, అన్నిచోట్ల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నందున.. ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్‌లకు తరలివచ్చి ఓటు వేయాలని ఈసీ విజ్ఞప్తి చేసింది. ఈవీఎంలలో తలెత్తిన సాంకేతిక సమస్యలను ఎక్కడిక్కడ అధిగమించడానికి ఈసీ చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కోసం 45,900 ఈవీఎంలు వినియోగిస్తున్నారు. ఇందులోని కేవలం 362 ఈవీఎంలలోనే స్వల్ప సాంకేతిక సమస్యలు తలెత్తాయి. లోపాలు తలెత్తిన 310 ఈవీఎంలను అధికారులు అప్పటికప్పుడు సరిచేశారు. 52 చోట్ల సాంకేతికంగా సమస్యలు తలెత్తిన ఈవీఎంలను మార్చామని, ప్రజలు ఏమాత్రం సంకోచించకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈసీ ఓటర్లను కోరింది.
Comments
Please login to add a commentAdd a comment