సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీప్యాట్ స్లిప్పులు దొరికిన వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పందించారు. ఆ స్లిప్పులు పోలింగ్ నాటివి కాదని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా కృష్ణా జిల్లా నూజివీడులో వాడని ఈవీఎంల తరలించిన వ్యవహారంపై స్పందించిన ద్వివేది.. ఈ రెండు వ్యవహారాల్లోనూ అధికారులపై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాలను ఈవీఎంల కమిషనింగ్ సెంటర్‌గా మాత్రమే వినియోగించామని, ఆత్మకూరు ఆర్డీవో ఆధీనంలో ఉన్న ఈ కమిషనింగ్ సెంటర్‌లో బ్యాలెట్ పత్రాలు పెట్టిన తర్వాత చెక్ చేశారని, పోలింగ్‌కు ముందే ఒక్కో నియోజకవర్గానికి కేటాయించిన ఈవీఎంలలో వెయ్యి ఓట్లను బెల్ ఇంజినీర్లు పోల్ చేశారని, ఈవీఎంలు సక్రమంగా పనిచేస్తున్నాయని నిర్ధారించుకున్న తర్వాత వాటిని పోలింగ్ కేంద్రాలకు తరలించారని తెలిపారు.
ఎవరో ఉద్యోగి ఉద్దేశపూర్వకంగా ఈవీఎంలు కమిషనింగ్ చేసిన సమయంలో వచ్చిన వీవీప్యాట్ స్లిప్పులను బయట పారేశారని, వీవీ ప్యాట్ స్లిప్పుల విషయంలో ఆత్మకూరు ఎన్నికల ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన ఉద్యోగులపై క్రిమినల్ కేసు పెట్టి తక్షణం అరెస్ట్ చేయాలని జిల్లా కలెక్టర్‌ను సీఈఓ ద్వివేది ఆదేశించారు. ప్రతి నియోజకవర్గం పరిధిలో జరిగే తప్పులకు రిటర్నింగ్ అధికారులే బాధ్యులవుతారని హెచ్చరించారు.
ఆ ఈవీఎంల తరలింపుపైనా ఆగ్రహం..
స్ట్రాంగ్ రూమ్ నుంచి వాడని ఈవీఎంలను తరలించడంపై సీఈఓ ద్వివేది ఆగ్రహం వ్యక్తం చేశారు. నూజివీడు సబ్ కలెక్టర్, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ) వెంటనే ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కోరారు. దీంతో దాదాపు గంటన్నరపాటు ఈవీఎంల తరలింపుపై నుజువీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, కృష్ణా జిల్లా జేసీ మిషా సింగ్ వివరణ ఇచ్చారు. వినియోగించని, రిజర్వ్ చేసిన ఈవీఎంలను మాత్రమే తరలించామని వారు తెలిపారు. పోలింగ్ కేంద్రాలనుంచి ఈవీఎంలు రాకముందే.. వినియోగించని ఈవీఎంలను ఎందుకు తరలించలేదని ద్వివేది నిలదీశారు. ఈ విషయంలో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. పొరపాట్లు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment