![Action on Officer Who Failed in Election Duty, Says Dwivedi - Sakshi](/styles/webp/s3/article_images/2019/04/16/gopal-krishna-dwivedi.jpg.webp?itok=GyNI1G7_)
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ పోలింగ్ సందర్భంగా ఎన్నికల విధులను సక్రమంగా నిర్వర్తించడంలో విఫలమైన అధికారులపై విచారణ కొనసాగుతోంది. నెల్లూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో జరిగిన నాలుగు ఘటనల్లో అవకతవకలపై సంబంధిత ఎన్నికల సిబ్బందిపై వేటుకు రంగం సిద్ధమైంది. ఈ ఘటనలపై మూడు జిల్లాల కలెక్టర్ల నుంచి ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఇప్పటికే నివేదికలు తెప్పించుకున్నారు. పోలింగ్ తర్వాత తలెత్తిన వివాదాల్లో రిటర్నింగ్ అధికారులు (ఆర్వో), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల (ఏఆర్వోల)పై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘానికి ద్వివేది సిఫారసు చేశారు.
ఈవీఎంల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ద్వివేది తాజాగా మంగళవారం హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా స్ట్రాంగ్ రూములకు తరలించిన పోలింగ్ నాటి ఈవీఎంలను కదిలించొద్దని, రిజర్వ్ ఈవీఎంలను తరలించాల్సి వస్తే ముందస్తు అనుమతితో, అందరి సమక్షంలోనే తరలించాలని ఆయన తేల్చి చెప్పారు. రాజకీయ పార్టీలు స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత పెంచాలని కోరాయని, భద్రత పెంపు సాధ్యాసాధ్యాలపై డీజీపీని వివరణ కోరామని తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీ ప్యాట్ స్లిప్పులు దొరికిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, ఘటనకు బాధ్యులెవరో విచారణలో తేలుతుందని తెలిపారు. ఈ వ్యవహారంలో వాస్తవంగా ఏం జరిగిందో మీడియా కూడా పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment