
సాక్షి, చిత్తూరు: ఏపీలో కూటమి అధికారంలోకి రాగానే భాగస్వాములైన జనసేన(Janasena), బీజేపీ నాయకులకు పలుచోట్ల అవమానాలు తప్పలేదు. ఇప్పటికే పలుచోట్ల పచ్చ నేతలు రెచ్చిపోయి కూటమి నేతలపై దాడులకు తెగబడ్డారు. తాజాగా చిత్తూరు జిల్లాలో జనసేన కార్యకర్తను టీడీపీ(TDP) కార్యకర్తలు చితకబాదారు. ఈ క్రమంలో అతడిని తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.
వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లాలోని సోమల మండలంలో గురువారం రాత్రి మంత్రి నారా లోకేష్(Nara Lokesh) జన్మదిన వేడుకల్లో బ్యానర్లు కట్టినందుకు, కేక్ కట్ చేసే కార్యక్రమంలో పాల్గొన్నందుకు జనసేన కార్యకర్తను టీడీపీ నాయకులు చితకబాదారు. కందూరులో జనసేన కార్యకర్త మునీర్ బాషా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, లోకేష్ బ్యానర్లు వేసి జన్మదిన సంబరాల్లో పాల్గొన్నారు. దీంతో రెచ్చిపోయిన తెలుగుదేశం నాయకులు మునీర్ బాషాను ‘నువ్వెవడురా రావడానికి’ అంటూ చితకబాదారు.
ఈ ఘటనను చూసిన ఆయన తల్లి బిడ్డపై దాడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమెపై కూడా దాడి చేయడంతో పిడికిలి దెబ్బలకు ఆమె పళ్లు రాలిపోయాయి. దీంతో, వెంటనే స్థానికులు పుంగనూరు నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి చిన్నారాయల్‌కు సమాచారం అందించారు. ఆయన తన అనుచరులతో ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడి కుటుంబాన్ని పరామర్శించారు. గాయపడిన మునీర్ బాషాను, ఆయన తల్లిని, జనసేన కార్యకర్తలు, నాయకులు కలిసి పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయమై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు జనసేన నేతలు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేస్తారా? లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.
గాయపడిన జనసేన కార్యకర్త మునీర్ తాజాగా మాట్లాడుతూ..‘గతంలో మా నాయకుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కందూరులో బ్యానర్లు కట్టొద్దని బెదిరించారు. నేను వాటిని లెక్క చేయలేదు, అప్పుడు నాపై దాడి చేసి గాయపరిచారు, పవన్ కళ్యాణ్ బ్యానర్లు చింపారు. నిన్న రాత్రి నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా నాపై దాడి చేశారు, నా తల్లిని గాయ పరిచారు. నన్ను చంపే అధికారం వాళ్లకు ఎవరు ఇచ్చారు?. నన్ను ఊరు విడిచి వెళ్ళాలి అని బెదిరిస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎప్పుడూ జనసేన పార్టీ నాయకుల్ని, నన్ను ఇబ్బంది పెట్టలేదు. టీడీపీ వాళ్ళ కంటే వైఎస్సార్‌సీపీ నాయకులే బెస్ట్ అనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేశారు.
