
లక్ష్యాన్ని చేరని నికర కలెక్షన్లు
2024–25లో రూ. 22.37 లక్షల కోట్ల టార్గెట్
నికరంగా వసూలైనది రూ. 22.26 లక్షల కోట్లు
రికార్డు స్థాయిలో రూ. 4.76 లక్షల కోట్లు రిఫండ్
న్యూఢిల్లీ: భారీ స్థాయిలో రిఫండ్‌లు జారీ చేయడంతో గత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు నిర్దేశించుకున్న లక్ష్యం స్థాయిలో వసూలు కాలేదు. 2024–25లో నికరంగా రూ. 22.37 లక్షల కోట్లు టార్గెట్‌గా పెట్టుకోగా నికరంగా రూ. 22.26 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 13.57 శాతం అధికమే అయినప్పటికీ నిర్దేశిత లక్ష్యానికి మాత్రం చేరలేదు.
గతేడాది జూలై నాటి బడ్జెట్‌లో రూ. 22,07,000 కోట్ల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు నిర్దేశించుకోగా, దాన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ. 22,37,000 కోట్లకు సవరించారు. సాధారణంగా కార్పొరేట్ ట్యాక్సులు, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్‌టీటీ), నాన్–కార్పొరేట్ ట్యాక్సులు (గతంలో వ్యక్తిగత ఆదాయ పన్ను) మొదలైనవి ప్రత్యక్ష పన్నుల పరిధిలోకి వస్తాయి. వ్యక్తులు, సంస్థలు, హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌లు) మొదలైన వర్గాలు కట్టే పన్నులు నాన్–కార్పొరేట్ ట్యాక్సుల పరిధిలోకి వస్తాయి.
స్థూల వసూళ్లు 16 శాతం అప్..
అధికారిక డేటా ప్రకారం మార్చి 31తో ముగిసిన 2024–25 ఆర్థిక సంవత్సరంలో స్థూల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు (రిఫండ్లకు ముందు) 15.59 శాతం పెరిగి రూ. 27.02 లక్షల కోట్లకు చేరాయి. అంతక్రితం 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ. 23.37 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇక, రిఫండ్ల జారీ తర్వాత నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్ల ప్రొవిజనల్ గణాంకాలు రూ. 22.26 లక్షల కోట్లుగా నమోదైయ్యాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ. 19.60 లక్షల కోట్లతో పోలిస్తే 13.57 శాతం పెరిగాయి. – ఇవన్నీ ప్రొవిజనల్ గణాంకాలు మాత్రమే. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తుది దశ రీకన్సిలియేషన్, సర్దుబాట్లు జరుగుతున్నందున నికర వసూళ్లు మరికాస్త పెరగొచ్చని అధికారులు తెలిపారు.
మరిన్ని వివరాలు..
→ ఎస్‌టీటీ నుంచి రెవెన్యూ రూ.34,192 కోట్ల నుంచి రూ. 53,296 కోట్లకు పెరిగింది.
→ ప్రొవిజనల్ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు, జులై బడ్జెట్ లక్ష్యంతో పోలిస్తే (రూ. 22.07 లక్షల కోట్లు) 100.78 శాతం పెరగ్గా, ఫిబ్రవరిలో సవరించిన అంచనాలతో పోలిస్తే (రూ. 22.37 లక్షల కోట్లు) 99.51 శాతం పెరిగాయి.
→ 2024–25లో ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అత్యధిక స్థాయిలో రూ. 4,76,743 కోట్లు రిఫండ్ జారీ చేసింది. 2023–24లో నమోదైన రూ. 3,78,255 కోట్లతో పోలిస్తే ఇది 26.04 శాతం అధికం.
→ రికార్డు స్థాయిలో రూ. 4.76 లక్షల కోట్లు రిఫండ్లు జారీ చేసినప్పటికీ స్థూల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు బడ్జెట్లో నిర్దేశించుకున్న రూ. 22.37 లక్షల కోట్ల స్థాయిని మించి నమోదైనట్లు అధికారులు తెలిపారు. సిసలైన క్లెయిమ్‌లను పారదర్శమైన, సముచితమైన విధంగా తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటామని ట్యాక్స్‌పేయర్లకు ఇచ్చిన హామీకి డిపార్టుమెంట్ కట్టుబడి ఉండటం ఇందుకు కారణమని వివరించారు.
→ సమీక్షాకాలంలో నికర కార్పొరేట్ ట్యాక్సుల వసూళ్లు (ప్రొవిజనల్) 8.30 శాతం పెరిగి రూ. 9,86,719 కోట్లకు చేరాయి. స్థూల కార్పొరేట్ వసూళ్లు 12.41 శాతం వృద్ధితో రూ. 12,72,516 కోట్లుగా నమోదయ్యాయి.