
ప్రత్యక్ష పన్నుల ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా జోరు కనబరుస్తోంది. మార్చి 16 వరకు రూ.21.26 లక్షల కోట్లు నికరంగా వసూలైనట్టు ప్రభుత్వ డేటా వెల్లడిస్తోంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 13 శాతానికి పైగా పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులకు చివరి తేదీ మార్చి 15తో ముగిసింది. కార్పొరేట్ పన్ను విభాగంలో అడ్వాన్స్ ట్యాక్స్ 12 శాతానికి పైగా పెరిగి రూ.7.57 లక్షల కోట్లుగా ఉంది.
నికర నాన్ కార్పొరేట్ ట్యాక్స్ (ఇందులో వ్యక్తిగత ఆదాయపన్ను ప్రధానమైనది) క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 17 శాతం ఎగిసి రూ.11.01 లక్షల కోట్లుగా ఉంది. నిబంధనల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన పన్ను రూ.10,000 మించితే వారు ముందస్తు పన్నును ఆర్థిక సంవత్సరం ముగింపులోపే చెల్లించాల్సి ఉంటుంది. నాలుగు వాయిదాల్లో (జూన్ 15, సెప్టెంబర్ 15, డిసెంబర్ 15, మార్చి15) దీన్ని చెల్లించొచ్చు.
ఇదీ చదవండి: 13 రోజుల్లో కార్ల ధరలు పెంపు..
భారీగా పెరిగిన ఎస్‌టీటీ ఆదాయం సెక్యూరిటీల లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ) 56 శాతం వృద్ధితో రూ.53,095 కోట్లుగా నమోదైంది. రిఫండ్‌లు సైతం రూ.3.60 లక్షల కోట్లకు పెరిగాయి. మార్చి 16 నాటికి స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు (రిఫండ్‌లు సహా) 16 శాతం పెరిగి రూ.25.86 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.22.07 లక్షల కోట్ల ఆదాయపన్ను వసూళ్లను ప్రభుత్వం తొలుత అంచనా వేయగా, తర్వాత రూ.22.37 లక్షల కోట్లకు సవరించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment