కోటి రూపాయల ఇళ్లే కొంటున్నారు..! | Hyderabad records high value home sales surge Knight Frank | Sakshi
Sakshi News home page

కోటి రూపాయల ఇళ్లే కొంటున్నారు..!

Published Sat, Apr 19 2025 1:49 PM | Last Updated on Sat, Apr 19 2025 2:38 PM

Hyderabad records high value home sales surge Knight Frank

హైదరాబాద్‌లో అందుబాటు ఇళ్లపై తగ్గుతున్న ఆసక్తి 

ప్రీమియం యూనిట్ల వైపు కస్టమర్ల మొగ్గు

లగ్జరీ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లలో 17 శాతం వృద్ధి

నైట్‌ఫ్రాంక్‌ ఇండియా నివేదిక వెల్లడి

సొంతింటి కల సాకారం చేసుకునేందుకు నగరవాసులు ఎంతైనా ఖర్చు చేసేందుకు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. జేబుకు భారం కాకుండా బడ్జెట్‌ ఇళ్లను కొని, తర్వాత బాధపడే బదులు.. భవిష్యత్తు అవసరాలను ముందుగానే ఊహించి అధిక విస్తీర్ణం కలిగిన ఖరీదైన గృహాలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో గ్రేటర్‌లో రూ.50 లక్షలలోపు ధర ఉండే అందుబాటు ఇళ్ల విక్రయాలు క్రమంగా తగ్గుతూ.. రూ.కోటి కంటే ఎక్కువ ధర ఉండే ప్రీమియం యూనిట్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో

హైదరాబాద్‌ నగరంలో ఈ ఏడాది మార్చిలో జరిగిన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లలో అఫర్డబుల్‌ హౌసింగ్‌ వాటా 55 శాతంగా ఉంది. కానీ, గతేడాది ఇదే నెలలోని 60 శాతంతో పోలిస్తే మాత్రం ఈ విభాగం వాటా 14 శాతం మేర తగ్గింది. అదే రూ.కోటి కంటే ఖరీదైన ఇళ్ల వాటా ఏడాది కాలంలో 17 శాతం మేర పెరిగింది. మార్చిలో రిజిస్ట్రేషన్స్‌ అయిన మొత్తం ప్రాపర్టీలలో ఖరీదైన ఇళ్ల వాటా 19 శాతంగా ఉంది. గతేడాది ఇదే నెలలో ఈ విభాగం వాటా 15 శాతమే. దీని అర్థం.. 
గృహ కొనుగోలుదారులు అందుబాటు గృహాల నుంచి క్రమంగా ఖరీదైన ఇళ్ల వైపు మొగ్గు చూపిస్తున్నారని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా నెలవారీ నివేదిక వెల్లడించింది.

👉ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు ఎంతలా పెరిగాయంటే..

రూ.4,471 కోట్ల విలువైన ప్రాపర్టీలు.. 
గ్రేటర్‌లో గత నెలలో 6,327 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్స్‌ అయ్యాయి. వీటి విలువ రూ.4,471 కోట్లు.. అయితే అంతకు క్రితం నెలతో పోలిస్తే ప్రాపర్టీల విలువ రూ.14 శాతం మేర, రిజిస్ట్రేషన్లు 6 శాతం వృద్ధి చెందాయి. ఫిబ్రవరిలో రూ.3,925 కోట్ల విలువైన 5,988 యూనిట్లు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. అయితే గతేడాది మార్చితో పోలిస్తే మాత్రం రిజిస్ట్రేషన్లు 8 శాతం తగ్గగా.. విలువ 4 శాతం మేర పెరిగింది. 2024 మార్చిలో రూ.4,275 కోట్ల విలువైన 6,870 యూనిట్లు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి.

2 వేల చ.అ. కంటే విస్తీర్ణమైనవి.. 
గత నెలలో రూ.2,480 కోట్ల విలువైన 3,509 అఫర్డబుల్‌ యూనిట్లు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. అయితే గతేడాది ఇదే నెలతో పోలిస్తే మాత్రం ఇది 14 శాతం తక్కువ. అలాగే రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య ధర ఉన్న 1,605 యూనిట్లు మార్చిలో రిజిస్ట్రేషన్‌ కాగా.. వీటి విలువ రూ.1,134 కోట్లు. 2024 మార్చితో పోలిస్తే ఈ విభాగంలోనూ రిజిస్ట్రేషన్లు 7 శాతం మేర తగ్గాయి. ఇక, రూ.కోటి కంటే ఖరీదైన ఇళ్లు గత నెలలో 1,213 రిజిస్ట్రేషన్‌ కాగా.. వీటి విలువ రూ.857 కోట్లు. అయితే గతేడాది మార్చితో పోలిస్తే మాత్రం ప్రీమియం ఇళ్ల విభాగంలో రిజిస్ట్రేషన్లు 17 శాతం, విలువలు 33 శాతం మేర వృద్ధి చెందాయి. గతేడాది మార్చిలో 2 వేల చ.అ. కంటే విస్తీర్ణమైన ఇళ్ల వాటా 13 శాతంగా ఉండగా.. గత నెలకొచ్చే సరికి 16 శాతానికి పెరిగింది. 1,000 నుంచి 2,000 చ.అ. యూనిట్ల వాటా 71 శాతం నుంచి 68 శాతానికి తగ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement