
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. చైనాపై సుంకాలు గతంలో ప్రకటించినంత కఠినంగా ఉండకపోవచ్చని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సానుకూల అంతర్జాతీయ సంకేతాల మధ్య భారత బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ను తొలగించకపోవచ్చని కూడా ట్రంప్ సంకేతాలిచ్చారు.
సెషన్ ప్రారంభ సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 528.87 పాయింట్లు లేదా 0.66 శాతం పెరిగి 80,124.46 వద్ద, నిఫ్టీ 50 182.90 పాయింట్లు లేదా 0.76 శాతం లాభంతో 24,350.15 వద్ద ఉన్నాయి. మార్కెట్ ప్రారంభమయ్యాక ఐటీ స్టాక్స్ జోరందుకున్నాయి. సెన్సెక్స్‌లో హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ షేర్లు టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి.
ఏప్రిల్ నెలకు సంబంధించి తయారీ, సేవల పీఎంఐ ఫ్లాష్ రీడింగ్స్‌తో పాటు ఎల్టీఐమైండ్‌ట్రీ, 360 వన్ వామ్, దాల్మియా భారత్ వంటి కంపెనీల నాలుగో త్రైమాసిక ఫలితాలపై ఇన్వెస్టర్లు కన్నేశారు. అంతేకాకుండా, ప్రస్తుత మార్కెట్ ర్యాలీ దాదాపు అన్ని స్టాక్స్‌ను పైకి లేపుతోంది. 16 సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా లాభాలను చూస్తున్నాయి.